Home మహబూబ్‌నగర్ మహాకూటమిలో.. కోల్డ్‌వార్!

మహాకూటమిలో.. కోల్డ్‌వార్!

Congress Leader Vijayashanthi Star Election Campaign

మన తెలంగాణ / మహబూబ్‌నగర్ బ్యూరో: మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్,టిడిపి, తెజాస ఇతర పార్టీల మధ్య అంతర్గత పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్ల వ్యవహారం తేలకపోవడంతో ఇరువురు పార్టీ నేతల్లో అంతర్మథనం నెలకొంది. దసరా పండుగ లోపు అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందన్న నమ్మకాలు కూడా నేతల్లో కొరవడుతోంది. మరోవైపు టిఆర్‌ఎస్ వరుస సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటనపై సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. దీంతో ఆ పార్టీలోని నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా నుంచి ప్రచార రథయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారయాత్రకు పెద్ద స్పందన లేనట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు లేకుండా కేవలం రోడ్‌షోల ద్వారా ప్రచారాన్ని చేపడుతున్నాయి. ముఖ్యమైన కూడళ్ల వద్ద ఇరుకు స్థలాల్లో సభలు ఏర్పాటు చేసి విజయవంతమైనట్లు చెప్పుకుంటుండడంపై టిఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రచారయాత్రకు జనం నుంచి స్పందన లేదని స్వంత పార్టీలోని నాయకులే చెబుతుండడం గమనార్హం. ప్రజలను తరలించడంలో పోటీ టికెట్ ఆశించే అభ్యర్థులే డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాన్ని తరలిస్తున్నారు.

దీంతో ఆ మాత్రమైనా జనం కాంగ్రెస్ రోడ్‌షోకు హాజరవుతున్నారు. సినీనటి విజయశాంతి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ, భట్టి విక్రమార్క, హన్మంతరావు వంటి ఉద్ధండులు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ జన స్పందన ఆశించినంత స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారంతో జిల్లా కాంగ్రెస్ రథయాత్ర ముగిసినప్పటికీ కాంగ్రెస్ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ కొత్త జోష్ కనిపించకపోవడం గమనార్హం. టికెట్లపై అధిష్టానం ఇప్పటి వరకు ఎటూ తేల్చక పోవడంతో మహాకూటమిలోనే గ్రూపు రాజకీయాలు మొదలవుతున్నాయి. టికెట్ రాని పక్షంలో జంపు  కావడమా లేక స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలబడాల అన్న ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ తమకు కాదని ఇతరులకు టికెట్ వస్తే పరోక్షంగా కాంగ్రెస్ ను ఓడించేందుకే పోటీదారులే సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహా కూటమిలోని గ్రూపు రాజకీయాలు, అంతర్గత కలహాలు పార్టీపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. పరోక్షంగా మహాకూటమిలోని తకరారులు టిఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా మహ బూబ్ నగర్, మక్తల్, జడ్చర్ల, కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి తదితర ప్రాంతా లలో కూటమిలోని కాంగ్రెస్‌లోనే అంతర్గత కలహాలు కలిగే అవకాశా లున్నాయి. ప్రచారంలో ఇంకా ఓనమాలు కూడా దిద్దని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రచారంలో హీట్ పుట్టిస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో స్తబ్ధత నెలకొంది.
వరుస సభలతో ఆకట్టుకుంటున్న టిఆర్‌ఎస్
ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచిన టిఆర్‌ఎస్ నేతలు వరుస సభలతో ప్రజ ల్లోకి చొచ్చుకెళుతున్నారు. ఇప్పటికే వనపర్తిలో ఏర్పాటు చేసిన ప్రజల ఆశీ ర్వాద సభకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంతో సభ విజయ వంతమైంది. నాగర్‌కర్నూల్ టిఆర్‌ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ హరీష్‌రావు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఇదిలా ఉండగా ఈ నెల 14న కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభకు కేటీఆర్ హాజరై ప్రచార సభలో పాల్గొననున్నారు. దసరా తర్వాత కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ప్రకటిస్తే తిరిగి జిల్లాలో ప్రచారం జోరందుకో నుంది. ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కని విధంగా టిఆర్‌ఎస్ సభలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.