Home జాతీయ వార్తలు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపిల నిరసన

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపిల నిరసన

Congress MPs protest inside parliament premises

 

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు

న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు గురువారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా, పార్టీకి చెందిన నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభలుకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు లోక్‌సభ ఆవరణలోని గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు, హోర్డింగ్‌లు పట్టుకుని ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వారు నినాదాలు చేశారు.‘ వారు (ప్రభుత్వం) అబద్ధాలు, అన్యాయం, తలబిరుసుదనంతో మొండిగా వ్యవహరిస్తున్నారు.

మేమంతా సత్యాగ్రహీలం, నిర్భయంగా, సంఘటితంగా ఇక్కడ నిలుచున్నాం. జైకిసాన్’అని రాహుల్ గాంధీ హిందీలో ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ‘ఫార్మర్స్ పార్లమెంట్’ పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. ధర్నా అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ కోసం రైతులు గత ఏడాది నవంబర్ 26నుంచి 238 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, అయినా ప్రభుత్వం వారి డిమాండ్‌కు అంగీకరించడం లేదన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్‌లు ఈ చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని పదేపదే చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి లోపాలను ఎత్తి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఆ పని చేయడానికి పార్లమెంటులో చర్చను వారు జరగనివ్వడం లేదు’ అని ఖర్గే అన్నారు.

Congress MPs protest inside parliament premises