Home ఎడిటోరియల్ ఇవియంలు వివాదాలమయం

ఇవియంలు వివాదాలమయం

Congress, NDA moves EVM tampering suspicion

 

కాంగ్రెసుతో సహా ఎన్డీయేతర పార్టీలన్నీ ఇవియంల పని తీరు పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు, అభ్యంతరాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కొన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసి ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ సారి మాత్రం ప్రతిపక్షాలన్నీ ఇవియంల విషయంలో ఒక్కటయ్యాయి. ప్రతిపక్షాలన్నీ ఇవియంలను కాదంటున్నాయంటే కారణాలేమై ఉంటాయన్నది ఎన్నికల సంఘం లోతుగా ఆలోచించి అనుమానాలు తొలగించవలసిన అవసరం ఉంది.

ఓటమి భయంతో ప్రతిపక్షాలు సాకులు వెదుకుతున్నాయని, అందుకే ఇవియంలపై ఆరోపణలు చేస్తున్నాయని గుడ్డిగా కొట్టి వే యడం కూడా సబబు కాదు. ఇలాంటి అనుమానాలను, అభ్యంతరాలను చిన్నవిగా చూడడం వల్ల ప్రజాస్వామిక ప్రక్రియపై నమ్మకం దెబ్బతింటుంది. ఎన్నికల విశ్వసనీయత దెబ్బతింటుంది. ఇవియంలు ఎలాంటి లోపాలు లేని యంత్రాలని, వాటిని టాంపర్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం ప్రజలను నమ్మించే ఆధారాలు చూపించాలి. ప్రజల ముందు రుజువు చేయాలి. కాని అలాంటి రుజువులేవీ ఇంత వరకు రాలేదు.

ఇది ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న దాడిగా భావించడం కూడా సరయిన విషయం కాదు. నిజానికి ఎన్నికల సంఘంపై దాడి కానే కాదు, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సరళిని ప్రశ్నించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇవియంలపై అభ్యంతరాలు, అనుమానాలు వస్తుంటే మరోవైపు ఎన్నికల నియమావళిని బాహాటంగా తుంగల్లో తొక్కుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చా యి. ఎన్నికల సంఘం ప్రధాని పట్ల, బిజెపి అధ్యక్షుడి పట్ల చూపిస్తున్న మెతక వైఖరి దాని విశ్వసనీయతను పూర్తి గా నష్టపరిచింది. మోడీ, అమిత్ షాలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని విభేదించిన ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా తన భేదాభిప్రాయాన్ని నమోదు చేయాలని కోరాడు. కాని ఆయన అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం నమోదు చేయలేదు. ఈ విషయమై తన పోరాటం కొనసాగుతుందని లావాసా ప్రకటించారు. ఈ సంఘటనలన్నీ ఎన్నికల సంఘం ప్రతిష్ఠను పాతాళానికి చేర్చాయి. ఎన్నికల ప్రధానాధికారిపై వ్యక్తిగత దాడి కాదు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలివి. ఎన్నికల ప్రధానాధికారి వ్యక్తిగత విశ్వసనీయత గురించి ప్రశ్నలేదు. వ్యవస్థ పనితీరు నమ్మదగ్గదేనా అనేది అనుమానం.

ఎన్నికల సంఘం స్పష్టంగా జవాబు చెప్పవలసిన కొన్ని ప్రశ్నలున్నాయి. ఇవియంలోని మైక్రో చిప్ భద్రతకు సంబంధించింది. మైక్రోచిప్స్‌లో సాఫ్ట్ వేర్ ఇన్‌స్టలేషన్‌కు సంబంధించింది. ఈ మైక్రోచిప్స్ ఇండియాలో తయారు కావడం లేదు. విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ మైక్రోచిప్స్ లో సాఫ్ట్ వేర్ కోడ్ మాత్రం ఇండియాదే. కాని, ఈ చిప్ప్ ఇండియా దిగుమతి చేసుకున్నప్పుడు వాటిలో హిడ్డెన్.. అంటే రహస్య కోడ్ ఏదీ చిప్‌లో లేదని నిర్ధారించుకోవడం ఎలా? మైక్రోచిప్స్ నమ్మదగ్గవే, అందులో ఎలాంటి రహస్య కోడింగ్ లేదని నిర్ధారించడంలో మన భద్రతా సంస్థల ప్రమేయం ఎంత ఉంది? అలాగే టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటు భద్రత కూడా పెంచడం జరిగిందన్న విషయం ప్రజలకు రుజువు చేస్తూ ఉండాలి. మైక్రో చిప్స్‌లో కోడ్ ఏర్పాటు చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపనీల విషయంలో పారదర్శకత అవసరం. కోడింగ్ ప్రక్రియను మైక్రోచిప్స్‌లో ఏర్పాటు చేసినవారు ఆ తర్వాత అందులో జోక్యం చేసుకోలేరని, కోడింగ్ నిష్పక్షపాతంగా పని చేస్తుందని నమ్మకం కలిగేలా ఉండాలి. ఈ విషయం ప్రజల ముందు రుజువు కావాలి. కోడింగ్ చేసిన వారు తర్వాత దొడ్డి దారిన మైక్రోచిప్స్ కోడింగ్‌ను అదుపు చేయడం, జోక్యం చేసుకోవడం జరగదన్న హామీ ప్రజలకు లభించాలి.

ఇవియంలను టాంపరింగ్ చేశారని చెప్పడానికి ఖచ్చితమైన సాక్ష్యాధారాలేవీ లేవు. కాని బలమైన అనుమానాలున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని సాధారణ ప్రజలకు కూడా ఇదంతా అర్థమయ్యే సరళమైన భాషలో యావత్తు ప్రక్రియను వివరించి చెప్పవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఈ అనుమానాలన్నీ దూరమయ్యేలా చేయవలసిన బాధ్యత కూడా ఎన్నికల సంఘంపైనే ఉంది. టెక్నోక్రాట్లు, సైంటిస్టులను పిలిచి మైక్రోచిప్స్‌లో కోడింగ్ ప్రక్రియను, మైక్రోచిప్స్ దిగుమతి ప్రక్రియను వారితో పరీక్షింపజేసి అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని నిర్ధారించుకుంటే చాలా మంచిది. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పరచి ఇవియంలపై పరీక్షలను నిర్వహించాలి. ఈ బృందంలో నమ్మదగ్గ నిపుణులుండాలి, అంతేకాని ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకొచ్చిన వారిని కమిటీలో వేయరాదు.

ప్రతిపక్షాలు వెలిబుచ్చిన అనుమానాలు చాలా తీవ్రమైనవి. ఈ అనుమానాలను నివారించడం అవసరం. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘంలో ఎన్నికల ప్రధానాధికారి వ్యక్తిగతంగా ఎంత విశ్వసనీయుడో, వ్యవస్థ కూడా అంతే నమ్మకంగా పని చేసేలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఎన్నికల ప్రధానాధికారి వ్యక్తిగత విశ్వసనీయత కన్నా వ్యవస్థపై నమ్మకం చాలా ముఖ్యం. ఎన్నికల కమిషన్ పై నమ్మకం లేదా అంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు. ఇక్కడ నమ్మకం అనేది కాదు ముఖ్యం. నమ్మకం కలిగేలా తీసుకున్న చర్యలేమిటన్నది ముఖ్యం. నమ్మకం కలిగేలా చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. నమ్మకం ఎలా కలుగుతుందంటే అనుమానాలను నివారించడం ద్వారా ప్రక్రియను ప్రశ్నించి, వివరణలు కోరడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రతిపక్షాలు అదే పని చేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడంత ముఖ్యమో, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు కనబడడం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షాలు ఎంత మొత్తకున్నా, ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్నికల సంఘం మాత్రం మాట వినడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు చేయడానికి సిద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం మొదట వివిప్యాట్ లెక్కింపును జరిపించడమే మంచిది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడం లేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు శాంతించేవి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు కనబడేది. వివిప్యాట్లను లెక్కించడం అంటే కాస్త ఆలస్యమవుతుందన్నది నిజమే, కాని దీనివల్ల ప్రతిపక్షాల్లో నమ్మకం కలిగి ఉండేది. ఎన్నికల సంఘం పట్ల విశ్వసనీయత పెరిగేది. కాని గుడ్డిగా ప్రతిపక్షాల మాటను కాదనడం, అంతే గుడ్డిగా పాలకపక్షం మాటకు తలూపడమే ఎక్కువగా మనకు కనబడుతోంది.

Congress, NDA moves EVM tampering suspicion