Home తాజా వార్తలు కాంగ్రెస్ రెండో జాబితా… రెబెల్స్ వాత

కాంగ్రెస్ రెండో జాబితా… రెబెల్స్ వాత

Congress party releases second list of legislators

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్ధుల రెండో జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బుధవారం ఉదయం విడుదల చేశారు. ఇందులో 10 నియోజకవర్గాల్లో పోటీచేయనున్న అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి 65 మందితో తొలి జాబితాను విడుదల చేయగా, ఇప్పుడు 10 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. వివాదాలు, అసంతృప్తులు పెద్దగా లేని స్థానాలకే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తుంది. తాజాగా ప్రకటించిన 10 మంది అభ్యర్ధుల వివరాలిలా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీని నిరసనలు, రెబల్ బాధ పీడిస్తోంది. ధిక్కార స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నా, ఇంకా ఎప్పుడు గుర్తింపు దక్కుతుందనే అసహనం కట్టలు తెంచుకుంటోంది. పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మూడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తూ ఉంటే, పొన్నాల లక్ష్మయ్యలాంటి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిమంది పార్టీకి రాజీనామా చేస్తుండగా, మరికొద్ది మంది ఇప్పటికే రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేయగా, ఇంకొంతమంది ఇతర పార్టీల్లో చేరుతున్నారు.

వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పాటు స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. చేవెళ్ళ నుంచి టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో వెంకటస్వామి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తాండూరు నియోజకవర్గంలో రోహిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నారాయణస్వామి అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సర్వే సత్యనారాయణకు టికెట్ రావడంతో ఆ స్థానాన్ని ఆశించిన ఆయన అల్లుడు క్రిశాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలుచేశారు… ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి, రెబల్ లాంటివి అనేకం ఉన్నాయి.

పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతోంది : చిత్తరంజన్
కాంగ్రెస్ పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో పార్టీ అధినేతగా రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి చిత్తరంజన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిసి జనాభా మెజారిటీగా ఉన్న జిల్లాల్లోనూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తోందని ఆరోపించారు. పార్టీలో బిసిలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఒకవైపు పార్టీ ప్రకటిస్తుండగా మరోవైపు సామాజిక న్యాయం కొరవడినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బిసిలను విస్మరించడం పార్టీకి మంచిది కాదని వ్యాఖ్యానించారు.

మూడు సీట్లు కూడా ఇవ్వని కాంగ్రెస్‌ను ఎలా నమ్మాలి : దరువు ఎల్లన్న
కాంగ్రెస్ జాబితాలో ఓయు జెఎసి నేతలకు చోటు కల్పించకపోవడం బాధ కలిగించిందని దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్ ఆరోపించారు. మూడు సీట్లను కూడా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రతీ నెలా నిరుద్యోగులకు భృతి పేరుతో మూడు వేల రూపాయలను ఇస్తామని హామీ ఇస్తే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. విద్యార్థులను రాజకీయ అవసరాలకు వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. విద్యార్థులకు సీట్లు దక్కకపోవడానికి కారణం రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొద్దిమంది నేతలేనని, మూడవ జాబితాలోనైనా పార్టీ అధిష్టానం న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులుగా తామంతా ఏ ముఖం పెట్టుకుని కూటమి తరఫున ప్రచారంలో పాల్గొనాలని ప్రశ్నించారు. స్మానియా యూనివర్శిటీ పర్యటన సందర్భంగా నాలుగు సీట్లు కేటాయించనున్నట్లు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, ఆ సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియాలు కూడా అక్కడే ఉన్నారని, 2014లో ముఖం చాటేసినట్లుగానే ఇప్పుడు కూడా అన్యాయం చేశారని అన్నారు.

Congress party releases second list of legislators

Telangana Latest News