Home మహబూబ్‌నగర్ పాలమూరు కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు

పాలమూరు కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు

టిఆర్‌ఎస్‌లోకి వలసలతో హస్తం డీలా

Mahaboobnagar-Congress-Lead

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొన్నటి వరకు పర్వాలేదనుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఎక్కువ స్థానాలు సాధించిన జిల్లాలో ఒకటైన పాలమూరులో వచ్చే సారి కూడా తమ బలాన్ని పెంచుకుంటామని ఆశలు పెంచుకుంది. ఇటీవలి పరిణామాలతో అవి నీరుగారుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఉన్న ఈ జిల్లాపై పట్టుకు వారిమధ్య ఆధిపత్య పోరుతో పాటు, తాజాగా ఎంఎల్‌సి కూచికుళ్ల దామోదర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో కాం గ్రెస్ పరిస్థితి డోలాయమానంగా మారింది. గత ఎన్నికల్లో నల్లగొండతో సమానంగా ఈ జిల్లా నుండి కాంగ్రెస్ ఒక లోక్‌సభ, ఐదు శాసనసభ స్థానాలను గెలుచుకుం ది. ఆ తరువాత ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా ఒక స్థానాన్ని గెలుపొందింది. మాజీ మంత్రి డి.కె. అరుణ సోదరుడైన మక్తల్ ఎంఎల్‌ఏ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అనంతర కాలంలో కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆలంపూర్ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వం రద్దవడంతో కాంగ్రెస్ ఖాతాలో మూడు స్థానాలే మిగిలాయి. వాటిల్లో డాక్టర్ జె.చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి, మాజీ మంత్రి డి.కె.అరుణ గెలిచిన గద్వాల, వంశీచంద్‌రెడ్డి గెలుపొందిన కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అందరు ఎంఎల్‌ఎలు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమయ్యారనే పేరుంది.

అందరూ ముఖ్యనేతలే : పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీలో కీలక నాయకులుగానే గుర్తింపు ఉంది. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వంశీచంద్‌రెడ్డి ఈ జిల్లాకు చెందిన వారే. అలాగే మాజీ మంత్రి డి.కె.అరుణ పిసిసి చీఫ్ పోస్టును ఎప్పటి నుండో ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి కూడా పాత పాలమూరు జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి నాగం జానార్ధన్‌రెడ్డి బిజెపి నుండి కాంగ్రెస్‌లోకి చేరిక విషయంలో జిల్లాలో నాయకుల మధ్య విబేధాలు పొడసూపాయి. అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌సి కూచికుళ్ల దామోదర్‌రెడ్డి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.

దామోదర్‌రెడ్డి, డి.కె. అరుణలు మొదటి నుండి రాజకీయంగా దగ్గరి సంబంధాలు నెరపేవారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు నాగం జనార్ధన్‌రెడ్డిని జైపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి, తదితరులు కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తన సోదరుడు, మక్తల్ ఎంఎల్‌ఏ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎంఎల్‌సి దా మోదర్‌రెడ్డిలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో ముందు ముందు తన అడుగులు కూడా అధికార పార్టీవైపే ఉంటాయేమోనని తన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారని డికె అరుణ చెబుతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడనని కూడా స్పష్టం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం గద్వాలతో పాటు మక్తల్, ఆలంపూర్‌తో పాటు పరిసర నియోజకవర్గాల్లో అరుణకు పట్టు ఉంది. ఆమె జిల్లాలోని రెండు నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాలలో కొంత ప్రభావితం చేయగలుగుతారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపిగా పోటీ చేసే జైపాల్‌రెడ్డి గెలుపు విషయంలో ఆమె ఎంత వరకు సహకరిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన కూతురుకు కూడా ఆ స్థానం నుండి యువత కోటాలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

టిఆర్‌ఎస్‌కు సానుకూలంగా నాగర్‌కర్నూలు ఎంపి సీటు

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల ను గెలుచుకుంది. అందులో ఒకటి నల్లగొండ కాగా, మరొకటి నాగర్ కర్నూలు. నల్లగొండ నుండి గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు నుండి గెలుపొందిన నంది ఎల్లయ్య మాత్రమే ఆ పార్టీలో మిగిలిన ఏకైక ఎంపి. గత ఎన్నికల ఫలితాలు, తాజా సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం కూడా టిఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి మందా జగన్నాధం కేవలం 17వేల ఓట్లతో ఓడిపోయారు.

ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎంఎల్‌సి దామోదర్‌రెడ్డికి నాగర్‌కర్నూలు స్థానంలో, మాజీ ఎంఎల్‌ఏ ఎడ్మ కిష్టారెడ్డికి కల్వకుర్తి, అబ్రహంకు అలంపూర్ స్థానాలలో గట్టి పట్టుంది. ఈ 3 స్థానాలు నాగర్‌కర్నూ లు ఎంపి స్థానం పరిధిలోనే ఉన్నాయి.  ప్రస్తుత టిఆర్‌ఎస్ ఓటు బ్యాంకుకు వారి బలం చేరితే నాగర్‌కర్నూ లు ఎంపి స్థానాన్ని సులువుగా కైవసం చేసుకుంటామని టిఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎంఎల్‌ఎలు ఎడ్మ కిష్టారెడ్డి, అబ్రహం లిద్దరూ గతంలో కాంగ్రెస్ నుండి గెలుపొందినవారే.  వారిద్దరికే ఆయా నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆలంపూర్ నుం డి మాజీ ఎంపి మందా జగన్నా ధం కుమారుడు శ్రీనా థ్ టిఆర్‌ఎస్ తరుపున పోటీ చేశారు.  భవిష్యత్తు సమీకరణల్లో భాగంగానే మందా ను ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిసింది.