Home ఎడిటోరియల్ రాహుల్ ఐఎస్‌ఐఎస్‌ను సమర్థించాడా?

రాహుల్ ఐఎస్‌ఐఎస్‌ను సమర్థించాడా?

Congress President Rahul Gandhi London Tour

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇస్లామిక్ ఛాందసవాద తిరుగుబాటు సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)ను సమర్థించినట్లు బిజెపి తాజా వివాదం లేవదీసింది. అల్‌ఖైదా టెర్రరిజం అణచివేత తదుపరి కరుడుగట్టిన మతవాద సంస్థగా కొద్ది సంవత్సరాలపాటు ప్రపంచ దేశాలను భయకంపితం చేసిన ఆ సంస్థ సిరియా, ఇరాక్‌ల్లో చావు దెబ్బలు తిని ప్రస్తుతం మారుమూలల్లో గాయాలు మాన్పుకుంటున్నది. అందువల్ల ఐఎస్‌ఐఎస్‌ను సమర్థించటమంటే నిప్పుతో తలగోక్కోవటమే. రాహుల్ గాంధి రాజకీయాల్లో ఔత్సాహికుడు కావచ్చుగాని అంతటి అజ్ఞాని అని భావించటం సాధ్యం కాదు. అయితే బిజెపి ఎందుకీ వివాదం లేవనెత్తింది, రాహుల్ క్షమాపణ కోరుతున్నది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి అసంబద్ధ వాదోపవాదాలు మరెన్నో మీడియాకు మేత అవుతాయి.

ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధి జర్మనీలోని హాంబర్గ్‌లో బుసెలియస్ సమ్మర్ స్కూల్‌లో బుధవారం ప్రసంగిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను లోపభూయిష్టంగా విమర్శించారు. డీమానిటైజేషన్ వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడి ఉపాధి తగ్గిపోవటాన్ని, జిఎస్‌టి ఇబ్బందులను ఏకరువుపెట్టారు. పేదల ఉద్ధరణకు ఉద్దేశించిన పథకాల సొమ్ము కొద్ది భారీ కార్పొరేట్లకు చేరుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను అభివృద్ధి నుంచి మినహాయించిందని ఆరోపిస్తూ, పెద్ద జన సంఖ్యను అభివృద్ధికి దూరం చేసినపుడు అది ప్రపంచంలో ఎక్కడైనా అంతర్గత తిరుగుబాటుకు దారి తీస్తుందన్నారు. ఇది ప్రమాదకరంగా హెచ్చరించారు. ఇక్కడ ఆయన తెచ్చిన సారూప్యత అర్థరహితంగా, అపార్థానికి తావిచ్చేదిగా ఉంది. బిజెపి అధికార ప్రతినిధి దాన్నే పట్టుకుని ఎదురు దాడి చేశారు. రాహుల్ ఇరాక్ పరిస్థితిని ప్రస్తావించారు. ‘2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేశాక ఆ దేశంలోని ఒక నిర్దిష్ట తెగను ప్రభుత్వోద్యోగాలలోకి, సైన్యంలోకి తీసుకోకుండా చట్టం తెచ్చారు. అది ఆనాడు నిరపాయకర నిర్ణయంగా కనిపించింది. అయితే అది ప్రజలు పెద్ద సంఖ్యలో తిరుగుబాటులో చేరి అమెరికాతో పోరాడటానికి, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించటానికి దారి తీసింది. అది అక్కడితో ఆగలేదు; నెమ్మదిగా సిరియా, ఇరాక్‌ల్లోని శూన్య ప్రదేశాల్లో ప్రవేశించింది. అక్కడ నుంచి ఐఎస్‌ఐఎస్ అనే భయంకర భావనతో సంధానమైంది’ అన్నారు.

భారతదేశంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను అభివృద్ధికి దూరం పెట్టటం తిరుగుబాట్లకు హేతువు అవుతుందనే ధ్వని రాహుల్ గాంధి ప్రసంగంలో ఉంది. 21వ శతాబ్దంలో మనం ప్రజలకు ఒక దార్శనికత ఇవ్వకపోతే ఇతరులు ఇస్తారు అనటంలో అసంతృప్తిలోని ప్రజలు పెడదారి పడతారనే భావం ఉంది. ఇటువంటిది భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా జరగవచ్చనే సార్వజనీన సూత్రీకరణ చేశారు. ఐసిస్‌ను ఒక ‘భయంకరమైన భావన’గా ఆయన పేర్కొన్నందున, బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నట్లు ఆయన ఐఎస్‌ఐఎస్‌ను సమర్థించినట్లు భావించటానికి ప్రాతిపదికలేదు.

మోడీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైనందున నిరుద్యోగ యువతలో పెరిగే అసంతృప్తి అశాంతి అలజడులకు దారి తీస్తుందనేది రాహుల్ గాంధి వాదన. అది కొన్నిసార్లు హింసాయుత ఆందోళనలకు దారితీయవచ్చుగాని తిరుగుబాట్లు కేవలం అసంతృప్తివల్ల ఉద్భవించవు. మొత్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పీడన, అణచివేత, ఆత్మగౌరవం వంటి సమస్యలు మిళితమై దానికొక సిద్ధాంతం తోడైనపుడు యువతలో కొందరు అటు ఆకర్షితులవుతారు. వాటిలో నిరుద్యోగులే కాదు, ఉన్నత విద్యావంతులు కూడా చేరతారని చర్రిత చెబుతున్నది. ఐఎస్‌ఐఎస్ ఛాందస సిద్ధాంతం నిస్పృహలోని యువతను ఆకర్షించింది. అది ఎంచుకున్న మార్గం ఆటవికం అయినందున కొద్ది సంవత్సరాల్లోనే అణచివేతకు గురైంది.

నాయకులు విదేశీ పర్యటనల్లో భారతదేశ అంతర్గత విషయాల గూర్చి మాట్లాడకపోవటమనేది ఉత్తమ సాంప్రదాయం. దాన్ని తొలుత ఉల్లంఘించిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అమెరికా, మరికొన్ని దేశాల్లో భారతీయ సంతతి సభల్లో చేసిన ప్రసంగాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ గత పాలన అంతా దుష్పరిపాలన అయినట్లు, అవినీతి కుంభకోణాల నిలయమైనట్లు విమర్శలు ఎక్కుపెట్టారు. దానిపై వచ్చిన విమర్శలవల్లనో ఏమో తర్వాత కాలంలో ఆ దాడి తగ్గించారు. కాని రాహుల్ గాంధి ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. మన అంతర్గత సమస్యలపై మన దేశంలోనే పరస్పర విమర్శలు చేసుకోవటానికి తగినంత సమయం ఉంది. వాటి మంచి చెడులను ప్రజలు నిర్ణయిస్తారు. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలు అంతర్గత రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా దేశ గౌరవాన్ని నిలబెట్టేటట్లు ఉండాలి.