*ఈ నెల 26 న చేవెళ్ళ నుంచి ప్రారంభం
కాంగ్రెస్‌కు చేవెళ్ల సెంటిమెంట్
2003లో ఇక్కడ నుంచే పాదయాత్ర
ప్రారంభించి సిఎం పీఠం దక్కించుకున్న వైఎస్
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధం అవుతుంది. బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడానికి షెడ్యూల్ ఖరారు చేసుకుంది. రాష్ట్రస్థాయి నేతలు అంతా సమైక్యంగా బస్సు యాత్రలో పాల్గొనడం ద్వారా క్యాడర్‌లో మరింత నమ్మకం కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను తమవైపునకు తిప్పుకోవాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతుంది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏప్రిల్ 9, 2003లో ప్రతిపక్షనేతగా చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు కొనసాగించారు. పాదయాత్రతో కార్యకర్తలలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను ప్రకటించి తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రజలలో నమ్మకం తీసుకురావడంతో 2004 ఎన్నికలలో ఘన విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 2004 అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని చేవెళ్ళ నుంచి ప్రారంభించడం సెంటిమెంట్‌గా భావిస్తూ వైఎస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదగడంతో పాటు చేవెళ్ళ సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా ఐక్యంగా బస్సు యాత్రలో పాల్లొననున్నారు. బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియాతో పాటు పలువురు ఎఐసిసి పెద్దలు హాజరుకానున్నట్లు తెలిసింది.
26న చేవెళ్ళలో శ్రీకారం
బస్సు యాత్రకు చేవెళ్ళ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 26న మధ్యాహ్నం చేవెళ్ళలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ నుంచి బస్సు యాత్రకు ముందుకు సాగడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. చేవెళ్ళ చెల్లెమ్మ సబితారెడ్డి నాయకత్వంలో చేవెళ్ళలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. చేవెళ్ళలో బహిరంగ సభ అనంతరం సాయంత్రం పరిగి నియోజకవర్గంలోని మన్నెగూడ మీదుగా వికారాబాద్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. వికారాబాద్‌లోని అనంతగిరిలో బసచేసి మరుసటి ఉదయం వికారాబాద్ నుంచి తాండూర్‌కు చేరుకోనుంది. తాండూర్‌లో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం సంగారెడ్డికి పయనం కానుంది. ప్రారంభ సమావేశం మాత్రం పెద్ద ఎత్తున చేపట్టడానికి పార్టీ అధిష్టానం సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. టిడిపి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన అనంతరం స్థానికంగా టిడిపితో పాటు టిఆర్‌యస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోగా బస్సు యాత్ర సమయంలో మరికొంత మంది నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి సబితారెడ్డి, రేవంత్ రెడ్డితో ఇప్పటికే పలువురు నేతలు సంప్రదింపులు జరిపినట్లు బస్సు యాత్రలో వారు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నారు.