Friday, December 2, 2022

రెబల్స్ వార్

- Advertisement -

Congress release first list of candidates in Telangana

 టికెట్ రాకున్నా బరిలో నిలుస్తామని హెచ్చరికలు
 ఆత్మహత్యాయత్నాలు, దిష్టిబొమ్మల దగ్ధాలు
 ఉత్తమ్ దిష్టిబొమ్మ దగ్ధం
 పొన్నాల టికెటు గల్లంతుతో కార్యకర్త అత్మహత్యాయత్నం
 వేములవాడలో ట్యాంకు పైకెక్కిన యువకులు
 పెద్దపల్లిలో
రాజీనామా హెచ్చరికలు
 వరంగల్ అర్బన్‌లో నాయిని రాజేందర్ వర్గం ఆగ్రహం
 ఎన్‌టిఆర్ ట్రస్ట్‌భవన్‌లో
నిరసనలు
 పోటీకి రెబల్స్ సిద్ధం

మన తెలంగాణ/ న్యూస్ నెట్‌వర్క్
సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రకటించిన తొలి జాబితా ఆ రెండు పార్టీల్లో చిచ్చు రేపింది. టికెట్ తమకే వస్తుందని ఆశగా ఎదురుచూసిన కొందరు ఆశావహులు, వారి అనుచరులు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. తమ నేతకు టికెట్ రాలేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్న కార్యకర్తలు ఆత్మ హత్యా యత్నాలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల దిష్టిబొ మ్మలను దగ్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవైకు పైగా నియోజకవర్గాలకు సంబంధించి అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమనింది. సోమవారం అర్ధరాత్రి జాబితా వెలువడడంతో మంగళవారం ఉదయమే ఆయా నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. కూటమిలో సీట్ల కుమ్మలాటలు ముదిరి పాకాన పడ్డాయి. కాంగ్రెస్ అధిష్టానం జాబితాను పునస్సమీక్షించకపోతే రెబల్స్‌గా పోటీ చేయక తప్పదని హెచ్చరించారు.

కొన్నిచోట్ల ఆశావహులు స్వంత పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కొద్దిమంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లను కూడా వేశారు. అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో గాంధీభవన్‌ను ముట్టడించడానికి ఆలోచనలు జరుగుతున్నాయి. పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసే చర్చలు కూడా జరుగుతున్నాయి. అభ్యంతరాలకు, అసంతృప్తికి తావులేని అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేసినట్లు ఏఐసిసి నాయకులు పేర్కొన్నా అసమ్మతి మాత్రం రెక్కలు విప్పింది. మిగిలిన జాబితాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగు వేస్తున్నందున అవి విడుదలైతే ఈ నిరసనలు, అసమ్మతి, అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందోననే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న నిరసనల్లో మచ్చుకు కొన్ని…
నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్య పేరును ప్రకటించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన బొలగం రాజు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు.
నియోజకవర్గ టికెట్ కాంగ్రెస్ నుంచి వనమాకు ఖరారు కావడంతో వనమా వ్యతిరేక వర్గం, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన తెలిపారు. మరోవైపు తమకు టికెట్ రాకుండా వనమా అడ్డుపడ్డారని టిడిపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అనుచరులు కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ వద్దరోడ్డుపై టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. పాల్వంచలో కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి కృష్ణ వర్గీయులు సైతం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఇద్దరు యువకులు నినాదాలు చేశారు. సుమారు మూడు గంటల పాటు ట్యాంక్‌పైకి ఎక్కి హల్‌చల్ చేసిన వారిని శాత్రాజుపల్లికి చెందిన గుడిసె తిరుపతి, వేములవాడకు చెందిన తాళ్లపల్లి నాగరాజులుగా గుర్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ ప్రకటించిన విజయ రమణారావును మార్చకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని హెచ్చరించారు. టిపిసిసి కార్యదర్శి డాక్టర్ గీట్ల సవితారెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, చేతి ధర్మయ్యలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏండ్ల తరబడి పార్టీలో పని చేస్తున్న వారిని మరిచి ఇటీవల పార్టీలో చేరిన విజయరమణారావుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధిష్టానం వెంటనే అభ్యర్థిని మార్చకపోతే రాజీనామాలు చేసి తీరుతామని హెచ్చరించారు. కూటమి అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు.
అర్బన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక నేతగా తనకే టికెట్ కేటాయించాలని నాయిని రాజేందర్‌రెడ్డి గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ కూటమిలో భాగంగా ఈ సారి టికెట్ టిడిపికి కేటాయించడంతో నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. ఒకానొక దఫాలో డిసిసి భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్యానికి ప్రయత్నించారు. తనకు టికెట్ రాకపోయినా, తనను అధిష్టానం గుర్తించకపోయినా రెబల్‌గా బరిలో ఉంటానని నాయిని రాజేందర్‌రెడ్డి కార్యకర్తలకు తెలియజేయడంతో వారు శాంతించారు.
పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ రాలేదనే ఆవేదనతో పగిళ్ల శరత్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు హోరెత్తాయి. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మల దగ్ధంతో పాటు ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిస్తామని శపథాలు చేశారు.
కంటోన్మెంట్‌లో మామా అల్లుళ్ల సవాల్
సికింద్రాబాద్ కంటోనె ్మంట్‌లో సర్వే సత్యనారాయణకు టిక్కెట్టు లభించడంతో ఆయన అల్లుడు క్రిశాంక్ నిరాశకు గురయ్యారు. తనకు టిక్కెట్ రాకుండా అడ్డుపడ్డ మామను ఓడించడమే లక్షంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టిపిసిసి అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రిశాంక్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఖర్చు 10 కోట్లు ఉంటేనే టిక్కెట్ ఆశించాలని ఉత్తమ్ చెప్పినట్లు ఆయన తీవ్రంగా ఆరోపిస్తూ ఇంజిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలో కదం తొక్కుతున్నారు. అలాగే శేరిలింగంపల్లి టిక్కెట్‌ను ఆశిస్తూ ఎన్నికల ప్రచారం చేసిన భిక్షపతి యాదవ్‌కు టిక్కెట్ దక్కకపోవడంతో పాటు ఆ నియోజకవర్గాన్ని మహాకూటమికి కేటాయించడంతో ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ఆశిస్తూ టిపిసిసితో హామీ పొందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధపడ్డారు. 65 మంది కాంగ్రెస్ జాబితా ప్రకటనతో ఉవ్వెత్తున ఎగిసి పడుకున్న నిరసన జ్వాలలతో కాంగ్రెస్ సతమతమవుతుంది. అయితే మరో జాబితా ప్రకటిస్తే ఎలాఉంటుందోననే ఆందోళనలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు, అధికార ప్రతినిధులకు, కాంగ్రెస్ మహిళా విభాగానికి, మైనారిటీ విభాగానికి, విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ మొండిచేయి చూపించింది. ఫలితంగా నిరసన జ్వాల లు, నాయకుల దిష్టిబొమ్మల దగ్దంతో తల్లడిల్లుతుంది.
ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగు తమ్ముళ్ళ నిరసనలు
టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశావహులు ఎన్‌టిఆర్ భవన్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి టికెట్ భవ్య ఆనంద్ ప్రసాద్‌కు కేటాయించడంపై టిడిపి నుంచే టికెట్ ఆశించిన మువ్వా సత్యనారాయణ వర్గీయులు నిరసన వ్యక్తంచేశారు. శేరిలింగపల్లి స్థానాన్ని మువ్వాకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలేరు, కోదాడ, నకిరేకల్ స్థానాలు కూడా టిడిపికి కేటాయించడంపై అక్కడి పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ తన టికెట్‌పై అమరావతికి వెళ్లి చంద్రబాబు నాయుడును కూడా కలిసి వచ్చినట్లు తెలిసింది. పార్టీ నుంచి టికెట్ రాకపోయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని ఆయన పలుమార్లు స్పష్టంచేశారు.

వాస్తవానికి కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌కు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నట్లు పలు సర్వేల్లోనూ తేలినట్లు ఆయన మద్దతుదారులు గుర్తుచేశారు. అయితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరీ తన సతీమణి పద్మావతికే సిట్టింగ్ స్థానం దక్కేలా చాకచక్యంగా పావులు కదపడంతో బొల్లంకు ఈసారి నిరాశే ఎదురైంది. ఇదే సమయంలో మల్లయ్య యాదవ్ గెలుపు, ఓటములపై సర్వే వివరాలు తెప్పించుకున్న టిఆర్‌ఎస్ తమ పార్టీలోకి రావాలని ఆయనకు పిలుపు కూడా పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆలేరు నుంచి టికెట్ ఆశించిన బండ్రు శోభారాణి కూడా ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె మీడియా వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదీ లేనిది ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఇక నకిరేకల్ నుంచి కూటమిలో భాగంగా టిడిపి తరపున టికెట్ ఆశించిన పాల్వాయి రజినీ కూడా కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. తమతో ఎక్కువగా లాభం పొందుతుంది కాంగ్రెస్సేనన్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణను కలిసి తన ఆవేదనను వెలిబుచ్చారు. ఇప్పటికే సీనియర్లు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా టికెట్ త్యాగం ప్రకటించారని, కాంగ్రెస్ మాత్రం పొత్తు ధర్మానికి విరుద్ధంగా స్వార్థపూరితంగా ఆలోచనలు చేసి అమలు చేస్తుందని ఆమె మీడియా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తొలిజాబితా ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా బుధశారం నిరసన జ్వాలలు చెలరేగాయి. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నాయిని రాజేందర్‌రెడ్డి మొండి చేయి ఎదురుకావడంతో రెబల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తనను పార్టీ అధిష్టానం గుర్తించనందున బుధవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి పార్టీలో కొనసాగడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ దిగువ నియోజకర్గాల్లో టికెట్‌ను ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురుకావడంతో రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
1. చెన్నూరు- దుర్గం భాస్కర్
2. మంచిర్యాల అరవింద్ రెడ్డి
3. ముధోల్ నారాయణ్ రావు పటేల్
4.పెద్దపల్లి ఈర్లకొమురయ్య, బల్మూరి వెంకట్
5.కరీంనగర్ నేరేళ్ల శారద
6.మానకోండూరరు కవ్వంపల్లి సత్యనారాయణ
7.వికరాబాద్ చంద్రశేఖర్
8.తాండూరు రాకేష్
9.కంటోన్మెంట్ క్రిశాంక్
10.సూర్యపేట పటేల్ రమేష్ రెడ్డి
11.అచ్చంపేట్ చారుకొండ వెంకటేష్
12.మునుగోడు పాల్వాయి స్రవంతి
13.నకిరేకల్ ప్రసన్నరాజ్
14.స్టేషన్ ఘన్‌పూర్ విజయరామారావు
15.ములుగు పోడెం వీరయ్య
16.ఆదిలాబాద్ భార్గవ్ దేశ్ పాండే
17.జడ్చర్ల అనిరుధ్ రెడ్డి

Congress release first list of candidates in Telangana

Telangana News

Related Articles

- Advertisement -

Latest Articles