Friday, March 29, 2024

ఎవరిది పైచేయి?

- Advertisement -
- Advertisement -

Congress removed sachin pilot from deputy CM

డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు
ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన
ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా
గవర్నర్‌ను కలిసిన గెహ్లోట్
రెండో రోజూ సిఎల్‌పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్

జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా మారాయి. తాజాగా సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకొంది. ఉపముఖ్యమంత్రి పదవినుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. అలాగే సిసిసి అధ్యక్ష పదవినుంచి కూడా ఆయనకు ఉద్వాసన పలికారు. పైలట్ మద్దతుదారులైన మరో ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలను కూడా మంత్రివర్గంనుంచి తొలగిస్తున్నట్లు సుర్జేవాలా ప్రకటించారు. వరసగా రెండో రోజు సమావేశమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సచిన్‌కు ఉద్వాసన పలికే తీర్మానానికి సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సిఎల్‌పి భేటీ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి గెహ్లోట్ రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసి పైలట్‌తో పాటుగా మరో ఇద్దరు మంత్రులను తొలగించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపినట్లు ఆ వర్గాలు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతసారను కొత్త పిసిసి అధ్యక్షుడిగా నియమించినట్లు సుర్జేవాలా తెలిపారు.

పైలట్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆభిమానం, ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని, అందుకే చిన్న వయసులోనే ఆయనకు రాజకీయ పదవులు ఇచ్చారని సుర్జేవాలా తెలిపారు. అయినప్పటికీ, ఆయన, ఆయన అనుచరులైన మంత్రులు బిజెపి కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఏ పార్టీ కూడా ఇలాంటి వాటిని సహించదని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని, పైలట్‌ను, విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించినట్లు ప్రకటిస్తూ సుర్జేవాలా చెప్పారు. అనుభవజ్ఞుడైన ఒబిసి నాయకుడు, రైతుబిడ్డ అయిన గోవింద్ సింగ్ దోతసారను పిసిసి అధ్యక్షుడిగా నియమించినట్లు ఆయన చెప్పారు. గిరిజన నాయకుడు, ఎంఎల్‌ఎ గణేశ్ గోగ్రాను యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించినట్లు కూడా ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ పదవిలో పైలట్ ముఖ్య అనుచరుడు ముకేశ్ భాకర్ ఉన్నారు. అలాగే పైలట్ మరో అనుచరుడు, ఎంఎల్‌ఎ రాకేశ్ పరీక్ స్థానంలో కాంగ్రెస్ సేవాద్ అధ్యక్షుడిగా హెమ్‌సింగ్ షెకావత్‌ను పార్టీ నియమించింది.
రెండో రోజూ సిఎల్‌పికి డుమ్మా
అంతకు ముందు రాహుల్, ప్రియాంక, అహ్మద్ పటేల్ లాంటి కాంగ్రెస్ అగ్ర నేతలు నేతలు మాట్లాడినప్పటికీ మంగళవారం సిఎల్‌పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టారు. ఆయన వర్గ ఎంఎల్‌ఎలు కూడా పార్టీ ఆహ్వానాన్ని బేఖాతరు చేశారు. మరో వైపు గెహ్లోట్ వర్గంలోని ఎంఎల్‌ఎలు కూడా నెమ్మదిగా జారుకుంటున్నట్లు కన్పిస్తోంది. సోమవారం లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరైన ఎంఎల్‌ఎలలో దాదాపు 20 మంది ఈ రోజు ఉదయం కనిపించకుండా పోయినట్లు సమాచారం. అందువల్లనే ఈ రోజు ఉదయం పది గంటలుకు జరగాల్సిన సమావేశం రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.

సచిన్ పైలట్ శిబిరంలో 16 మంది వీడియో విడుదల
తనకు 30 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉందని సచిన్ పైలట్ చెబుతున్న దానిలో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన వెంట 16 మంది ఎంఎల్‌ఎలు మాత్రం ఉన్నారు.ఈ మేరకు సచిన్‌పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూపునుంచి విడుదలైన వీడియోద్వారా వెల్లడవుతోంది. సోమవారం రాత్రి పైలట్ వర్గం గురుగ్రామ్‌లోని మానెసర్ హోటల్‌లో తన క్యాంప్ వీడియోను విడుదల చేసింది. సోమవారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన కొద్ది గంటలకే ఈ వీడియో విడుదలయింది. అ సమావేశానికి 122 మంది ఎంఎల్‌ఎలలో 106 మంది హాజరైనట్లు పార్టీ నాయకులు ప్రకటించిన
విషయం తెలిసిందే. పది సెకన్ల నిడివిగల ఈ వీడియోలు 16 మంది ఎంఎల్‌ఎలు కనిపిస్తున్నారు. ఎంఎల్‌ఎల్లో ఇంద్రరాజ్ గుర్జార్, ముకేశ్ భాకర్, హరీశ్ మీనా తదితరులను ఈ వీడియోలో చైడవచ్చు. మరో ఆరుగురు కూడా వీడియోలో ఉన్నారు కానీ, వారిని గుర్తుపట్టడం వీలు కావడం లేదు. పర్యాటక శా మంత్రి విశ్వేంద్ర సింగ్ ఈ వీడియోను విడుదల చేశారు. ఫ్యామిలీ అని దానికి క్యాప్షన్ పెట్టారు.
పైలట్ బలమెంత?
కాగా మంగళవారం జరిగిన సిఎల్‌పి సమావేశానికి 88 మంది పార్టీ ఎంఎల్‌ఎలు మాత్రమే హాజరైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సచిన్ పైలట్ చెప్తున్నట్లుగా ఆయనకు 30 మంది దాకా మద్దతు ఉందనే అనిపిస్తోంది. ఒక వేళ అది నిజం కాని పక్షంలో గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చడం ప్రధాన ప్రతిపక్షమైన బిజెపికి కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎంఎల్‌ఎలుండగా భారతీయ ట్రైబల్ పార్టీ, సిపిఎంకు చెందిన ఇద్దరేసి సభ్యులు ఆర్‌ఎల్‌డికి చెందిన ఒకరు, 12 మంది ఇండిపెండెంట్లు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. మరో వైపు బిజెపికి 72 మంది ఎంఎల్‌ఎలుండగా దాని మిత్రపక్షమైన హనుమాన్ బేణీవాల్ నేతృత్వంలోని రాష్ట్రాయ లోక్‌తాంత్రిక్ పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. మరో ఇండిపెండెంట్ కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అయితే భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే కనీసం 26 మంది ఎంఎల్‌ఎలు పైలట్ వర్గంలో ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే వీరంతా ఎంఎల్‌ఎ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంనుంచి తప్పించుకోవాలంటే మూడింట రెండు వంతుల మంది కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు ఆ పార్టీని వీడాల్సి ఉంటుంది. అందుకే ముందుగా పైలట్ బలమెంతో తేలే వరకు బిజెపి గెహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తొందరపడకపోవచ్చని పరిశీలకు అంటున్నారు.

Congress removed sachin pilot from deputy CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News