Home ఎడిటోరియల్ మహిళా జన మహా విజయాలు

మహిళా జన మహా విజయాలు

Consensual sex with minor not crime, Delhi court says

కొందరి దృష్టిలో సంచలనాలు, మరి కొందరి పరిగణనలో మానవీయ కోణాలు. పలువురికవి బొత్తిగా మింగుడుపడనివి, మరిపెక్కుమందికి మాత్రం ప్రగతిశీల పరిణామాలు, మంచి మార్పును ఆవిష్కరించే మలుపులు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురు, శుక్ర వారాల్లో వరుసగా ఇచ్చిన రెండు తీర్పులూ సంప్రదాయులు ఛాందసవాదులైన సామాజికులకు అసంతృప్తిని, సమానత్వాన్ని కోరుకునేవారికి ఆనందాన్ని కలిగించడం సహజం.

వివాహేతర లైంగిక సంబంధం నేరం కాదని, అందుకు పాల్పడిన వారినుంచి విడాకులు తీసుకోవచ్చుగాని వారిని శిక్షకు పాత్రులను చేయడం తగదని గురువారం నాడు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ చరిత్రాత్మకమైనది. పితృస్వామిక, పురుషాధిపత్య దుర్నీతి నెత్తిన గొడ్డలివేటు వంటిది. స్త్రీ పురుషుడి ఆస్తి కాదని భర్త పాలనలోని పాలితురాలుగా భార్య పడివుండనవసరం లేదని తీర్పు చేసిన స్పష్టీకరణ భారత రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఆచరణలో మహిళల అనుభవంలోకి, హక్కుభుక్తంలోకి తీసుకు రావడానికి ఉద్దేశించినది. ఇంతవరకు స్త్రీకి ఈ హక్కును నిరాకరించి ఆమె శృంగార జీవితాన్ని భర్త అదుపాజ్ఞలకు లోబడి మాత్రమే ఉండేదిగా చేసిన భారత శిక్షాస్మృతిలోని 497వ సెక్షన్‌ను రాజ్యాంగ ధర్మాసనం ఒక్కకంఠంతో రద్దు చేసింది.

ఐపిసి సెక్షన్ 497 ప్రకారం పెళ్లైన స్త్రీతో ఆమె భర్త అనుమతిలేకుండా లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం, అందుకు పాల్పడిన పురుషుడు శిక్షార్హుడు. స్త్రీ భర్త సొత్తు కాబట్టి ఆమెకు స్వతంత్ర వ్యక్తిత్వం లేదు గనుక శిక్షకు కూడా అర్హురాలు కాదు. ఈ సెక్షన్ వివాహేతర సంబంధం పెట్టుకొన్న పురుషుడిని మాత్రమే శిక్షార్హం చేసి స్త్రీని వదిలిపెడుతున్నందున రాజ్యాంగ సమానత్వ సూత్రానికి విరుద్ధమని అందులోని 14, 15, 21 అధికరణలకు వ్యతిరేకమైనదని వాదిస్తూ గత సంవత్సరం అక్టోబర్‌లో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు గురువారంనాడు ఈ ప్రశంసార్హమైన తీర్పును ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం పిటిషనర్ వాదించినట్లు సెక్షన్ 497ను పురుష వ్యతిరేకిగా స్త్రీ పక్షపాతిగా చూడడానికిబదులు మహిళను అస్వతంత్రను పురుషుడికి బానిసగానూ చేస్తున్నదిగా పరిగణించి దానిని చరిత్ర చెత్తబుట్టలోకి విసిరి పారేయడం ఈ తీర్పులోని అత్యంత ప్రగతిశీల అంశం. స్త్రీని పురుషునితో సర్వసమానురాలుగా చేస్తున్న తీర్పు ఇది. దీనివల్ల సమాజంలో ‘అక్రమ’ సంబంధాలు పెరుగుతాయనే అపోహను కొందరు వ్యాప్తి చేస్తున్నారు. అసలు స్త్రీ పురుష సంబంధాన్ని సక్రమమైనది, అక్రమమైనది అని విడదీసి పరిగణించడమే తప్పు. పితృస్వామిక వివాహ సంబంధానికి భిన్నంగా అన్యులతో కూడడం ఆ ‘నీతి’ ప్రకారం అక్రమమైదని సంప్రదాయవాదులు పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగం ఆ తేడా చూపదు. ఐపిసి 497 సెక్షన్‌ను కొట్టివేసిన తాజా మైలురాయి తీర్పుతో ఆ వివక్ష పూర్తిగా అంతరించిపోయింది. 158 సంవత్సరాల క్రితం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రాణం పోసిన ఈ దుష్ట చట్టాన్ని స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకైనా రద్దు చేసుకున్నందుకు జాతి గర్వించాలి.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం నాడు ఇచ్చిన ఇంకో జడ్జిమెంట్ కూడా దేశంలో మహిళ స్వాతంత్య్రానికి మరో మణిమకుటాన్ని తొడిగింది. సంప్రదాయ సమాజం ఇంటిలోనూ గుడిలో కూడా స్త్రీని రెండో వరుసలోనే కూచోబెట్టింది. చాలా సందర్భాల్లో పురుషుడి తరపున దేవుడిని ప్రార్థించే పాత్రలోనే ఆమెను నిలబెట్టింది. కేరళ శబరిమల ఆలయంలోకి స్త్రీలను నిషేధించే దురాచారం చెల్లదని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం నాడిచ్చిన 4:1 మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. శబరిమలలో స్త్రీల పై నిషేధం స్పష్టమైన లింగ వివక్షేనని హిందూ మహిళల సమానత్వ హక్కుకు భంగకరమని పేర్కొన్నది. రుతుస్రావం మొదలైన వయసు నుంచి స్త్రీలు అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టడాన్ని అడ్డుకుంటున్న దుస్సంప్రదాయం ఈ తీర్పుతో అంతమవుతుంది. దీనితో అన్ని వయసుల్లోని స్త్రీలకు శబరిమల అయ్యప్ప గుడిలోకి ఇకనుంచి ప్రవేశం లభిస్తుంది. ఇది తమకు అసంతృప్తి కలిగించే పరిణామమంటూనే ఈ తీర్పును దేవస్థానం బోర్డు ఆమోదిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించడమూ సంతోషదాయకం. గతంలో తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహారాష్ట్రలోని శనిసింగనాపురం ఆలయ ప్రవేశాన్ని సాధించిన మహిళల ఉద్యమ విజయం తెలిసిందే. తాజా న్యాయ విజయంతో స్త్రీలోకం మరింత స్వేచ్ఛను పొందింది. అమానవీయ దురాచారాలను సంఘటిత శక్తితోనూ న్యాయ విజయ ఖడ్గంతోనూ దునుమాడే క్రమం మరింత ముందుకు సాగి స్త్రీ పురుష సర్వసమానత్వంతో కూడిన సంపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ పరిఢవిల్లాలి.