Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఉన్నత విద్య పేద వర్గాలకు అందకుండా కుట్రలు

ఉన్నత విద్య పేద వర్గాలకు అందకుండా కుట్రలు

Krishnaiah

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా :  బడుగు, బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదువుతుంటే దొరల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. విద్యార్ధుల ఫీజు బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో గురువారం వందలాది మంది విద్యార్ధులు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాష్ట్ర బిసి యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేశ్, విద్యార్ధి సంఘం ప్రధానకార్యదర్శి భూపేశ్ సాగర్ నాయ కత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక ఆర్దిక అంతరాలు లొలగించేందుకు రాజ్యాంగంలో విద్యా, వైద్యాన్ని హక్కుగా చేర్చినప్పటికి అగ్రకుల పాలకులు విద్యను పేదవర్గాలకు అందకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత సంవత్సరం మార్చి నెల 29న సీఎం కేసీఆర్ ఫీజు బకాయిలు రూ.3061 కోట్లను ఏప్రిల్ లోగా చెల్లింస్తామని హామీ ఇచ్చి జీవో విడుదల చేసినప్పటికి నేటికి అమలుకు నోచుకోలేదని అన్నారు. దీంతో  ఫీజు చెల్లించని విద్యార్ధులను యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పై చదువుల కోసం, ఉద్యోగ రిత్యా విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇవ్వకపో వడంతో భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు.

ఓవైపు విద్యార్ధులు ఇబ్బందులకు గురవుతుంటే సీఎం అంత సజావుగా ఉందంటూ ప్రకటన చేయడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఫీజులు భరిస్తుందనే ఆశతో చదువుకుంటున్న ఆర్దిక స్తోమత లేని పేద వర్గాల విద్యార్ధులు ప్రభుత్వం జాప్యం కారణంగా నిరాశ నిసృహలకు లోనవుతున్నారని, ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు పథకంతో పేద కులాల వారు, రైతు కూలీలు, కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి రూ.లక్షల జీతాలు పొందుతూ కుటుంబాలను అభివృద్ది చేసుకుంటుంటే ఓర్వలేని అగ్రకుల ప్రభుత్వాలు పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నాయన్నారు.

ఫీజుల రియంబర్స్‌మెంట్ స్కీమ్‌ను ఎత్తి వేసేందుకు మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి నేటి సీఎం కేసీఆర్ వరకు పన్నిన కుట్రలను బిసి సంక్షేమ సంఘం, వివిధ విద్యార్ధి సంఘాలు ఉద్యమాల ద్వారా తిప్పికోట్టాయని పేర్కొన్నారు. నేడు బడ్జెట్ విడుదల చేయకుండా జాప్యం చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. విద్యార్ధులు తిరగబడి ఉద్యమాల ద్వారా బడ్జెట్ విడుదల చేసే వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం  ఫీజు బకాయిలు రూ.1500 కోట్లు, ఒకే దఫాగా విడుదల చేయడంతో పాటు ఈ సంవత్సరం రావాల్సిన రూ.2400 కోట్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.వి.రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, మనోజ్‌చారి, అమరేందర్, కామేష్, నర్సింహ్మగౌడ్, శ్రీరాజేందర్, మధు ముదిరాజ్, శివ, రాఖీ తదితరులు పాల్గొన్నారు.