Home ఎడిటోరియల్ సర్కార్ కత్తెర!

సర్కార్ కత్తెర!

Constitution and law violation is crime    రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించడం నేరం. అందుకు పాల్పడే వారిని వాటి ప్రకారం శిక్షించాలి. అంతేగాని దేశంలో ఒక వర్గానికి ఇష్టంలేని పని చేసినంతమాత్రాన ఆ వర్గీయులు నేరుగా బెదిరించి, భయపెట్టి ఆ పని మానుకొనేలా చేయడం సరికాదు. మన దేశంలో మాత్రం ఎవరికి ఏది నచ్చకపోయినా దాని మీద వారు కోపోద్రిక్తులై దండెత్తి వారి నోరు మూయించడం తరచుగా జరుగుతున్నది. నైతిక, రాజకీయ పోలీసులు మూకస్వామ్య హింసతో రెచ్చిపోతున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి అన్ని వయసుల ఆడవారినీ సుప్రీంకోర్టు అనుమతిస్తే దానిని అమలు కానీయకుండా మతతత్వ సమూహాలు అడ్డుకోగలిగాయి. దీపావళి నాడు రెండు గంటల పాటే టపాసులు పేల్చాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలూ వమ్మయ్యాయి. తాజాగా తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగా అధికారంలో కొనసాగుతున్న పాలక పక్షమే చలన చిత్ర సెన్సార్ షిప్‌ను చేతుల్లోకి తీసుకొని ఒక సినిమాలోని తనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించేవని తాను భావించిన కొన్ని దృశ్యాలకు బలవంతంగా కత్తెర వేయించింది.

ప్రముఖ నటుడు విజయ్ ముఖ్య పాత్ర ధరించిన ‘సర్కార్’ అనే తమిళ చలన చిత్రం పట్ల నిరసనగా ఎఐఎడిఎంకె కార్యకర్తలు థియేటర్ల వద్ద వీరంగం వేసి ధ్వంస కాండకు తలపడ్డారు. దానితో ఆ సినిమాలోని ఐదు నిమిషాల నిడివి గల భాగాన్ని తొలగించవలసి వచ్చింది. ఈ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. గురువారం రాత్రి తాను లేనప్పుడు పోలీసులు తన ఇంటి తలుపులు బాదారనే ఫిర్యాదుతో ఆయన చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దానితో ఆయనను ఈ నెల 27 వరకు అరెస్టు చేయరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెన్సార్ బోర్డు ఆమోద ముద్ర వేసిన చిత్రం విషయంలో ఎందుకు జోక్యం చేసుకొన్నారని హైకోర్టు నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించింది. ఎఐఎడిఎంకె నిరసనకారులను అరెస్టు చేయకపోవడాన్ని నిలదీసింది. నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకోవలసిన పోలీసులు చిత్ర దర్శకుని ఇంటిమీద పడడంలోనే ప్రభుత్వం అనుచిత జోక్యం స్పష్టపడుతున్నది. ‘సర్కార్’ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద సృష్టించిన బీభత్సానికి భయపడిన వాటి యజమానులు చిత్ర నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి అందులోని కీలకమైన దృశ్యాలపై కత్తెర వేయించారు. ఇందుకు దారితీసిన దృశ్యాలు వాస్తవానికి మన సమాజంలోనూ, దేశవ్యాప్తంగానూ లోతైన చర్చ జరగవలసినవి.

ఎన్నికలలో విజయాల కోసం పార్టీలు ఓటర్లకు ఉచితాలను వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనం అమితంగా ఖర్చుపెట్టి వాటిని పంపిణీ చేయడాన్ని ఎండగడుతూ కొన్ని దృశ్యాలను ‘సర్కార్’ లో చిత్రీకరించారు. ముఖ్యంగా ఒక మిక్సర్ గ్రైండర్ (తమిళనాడులో పంపిణీ చేసిన ఉచితాల్లో ఒకటి) ను మురుగదాస్ వేసిన పాత్ర మంటల్లోకి విసిరేస్తుండగా చిత్రీకరించిన దృశ్యం పాలక పక్షానికి ఆగ్రహం తెప్పించింది. కోమలవల్లి (ఎఐఎడిఎంకె ఆరాధ్య దేవత జయలలిత అసలు పేరు) అనే ఒక విలన్ పాత్రను సృష్టించడం వారికి పుండు మీద కారం చల్లినట్టయింది. ఈ పేరు సినిమాలో వినిపించనీయకుండా చేశారు.

ఉచితాల ఉరవడికి తమిళనాడు పెట్టింది పేరు. మితిమించిన ఉచితాల వల్ల ప్రజాధనం వృథాకావడం తప్ప రాష్ట్రానికి జరిగే మేలు సున్నా అని, వీటివల్ల అభివృద్ధికి ప్రాధాన్యత తగ్గిపోతుందనేది చిత్రంలోని సందేశమని బోధపడుతున్నది. అభిమానులు విశేషంగాగల ముఖ్యపాత్రధారి విజయ్ భవిష్యత్తులో రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తీసి ఉండవచ్చు. అంతమాత్రాన అది తీయకూడని చిత్రమనడానికి వీలులేదు. ‘సర్కార్’ సినిమా ప్రదర్శన ఉగ్రవాద చర్య అని పళనిస్వామి మంత్రివర్గ సభ్యుడొకరు చేసిన వ్యాఖ్య ఎంత బాధ్యతారహితమైనదో చెప్పనక్కరలేదు. చట్టాన్ని పక్కనబెట్టి ఎవరికి వారు రెచ్చిపోవడం చివరికి సమదృష్టితో చట్టానికి కాపలాగా ఉండవలసిన ప్రభుత్వ పెద్దలు సినిమాల మీద దాడులు జరిపించడం అత్యంత అప్రజాస్వామికం. గతంలో తెలుగులో సైతం అప్పటి ముఖ్యమంత్రులపై వ్యంగ్యాస్త్రాలతో రూపొంది విడుదలయిన చిత్రాలున్నాయి. వాటిని ఎవరూ ఇలా మూక హింసతో బెదిరించి అడ్డుకోలేదు. ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఉదంతం భావ ప్రకటనా స్వేచ్ఛను బలిగొన్నది. ఈ ధోరణి ముదిరి ముందుముందు మీడియా రంగాన్ని కూడా శాసించే పరిస్థితి తల ఎత్తవచ్చు. దీనిని తీవ్రంగా ప్రతిఘటించి ‘సర్కార్’ సినిమా నుంచి తమిళనాడు సర్కారు తొలగింపచేసిన దృశ్యాల యథాతథ పునరుద్ధరణ జరిగేలా చూడాలి.

Constitution and law violation is crime

Telangana Latest News