Tuesday, April 16, 2024

రాజస్థాన్ హైడ్రామాలో రాజ్యాంగం!

- Advertisement -
- Advertisement -

Constitution in Rajasthan Hydrama!

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రావణ కాష్ఠంలా రగులుతోంది. స్పీకర్ నోటీస్‌పై సవాలు దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వైఖరి వరకు ఎన్నో వివాదాస్పద అంశా లు తెర మీదకు వచ్చాయి. రాజ్యాంగ పరిధిని ప్రశ్నిస్తున్నాయి. రాజస్థాన్ స్పీకర్ తిరుగుబాటు ఎంఎల్‌ఎలకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ కోర్టులో సవాలుగా మారడం, స్పీకర్ విచారణపై హైకోర్టు స్టే విధిస్తూ జులై 24న ఉత్తర్వులు జారీ చేయడం అనూహ్య పరిణామం. ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూలు 2(1) (ఎ) ఈ సందర్భంగా చర్చ కు వస్తోంది. తిరుగుబాటు ఎంఎల్‌ఎల తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఎన్నో వాదనలు వినిపించినా అవేవీ ఈ అంశాన్ని నిర్ణయించేవి కావు. స్పీకర్ నోటీస్‌ను సవాలు చేయడం గమనిస్తే నోటీస్‌కు సంబంధించిన నియమాలు ఏమిటో గుర్తు తెచ్చుకోవాలి.

1985లో ఆనాటి లోక్‌సభ స్పీకర్ రూపొందించిన నిబంధనలే ఇప్పటికీ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. రూల్ 6, 7 నోటీస్ దాఖలుకు నిబంధన లేమిటో చేబుతున్నాయి. దాని ప్రకారమే స్పీకర్ సంబంధిత సభ్యునికి నోటీస్ పంపి ఏడు రోజుల్లోగా తన వ్యాఖ్యలు సమర్పించాలని ఆ సభ్యుణ్ని కోరడం పరిపాటిగా వస్తోంది. అయితే రాజస్థాన్ స్పీకర్ జారీ చేసింది షోకాజ్ నోటీసే. కానీ రాజస్థాన్ కోర్టులో ఇదే సవాలయింది. ఏ షోకాజ్ నోటీస్‌కైనా ఇదమిత్థంగా నిబంధనలు అంటే ఏమీ లేవు. నోటీస్‌లో పేర్కొన్న కారణాలకు స్పీకరే స్వయం విచారణ ద్వారా పరిశీలిస్తారు. ఈ దశలో ఈ షోకాజ్ నోటీస్‌కు వ్యతిరేకంగా సవాలు అన్నది ఎలా ముందుకు వస్తుంది? స్పీకర్ అనుమతిని న్యాయపరంగా సవాలు చేయవచ్చునా? ఈ అంశంపై కోర్టు సరైన శ్రద్ధ చూపించినట్టు లేదని భావించవలసి వస్తోంది. లేదంటే మొదట్లోనే పిటిషన్ రద్దయ్యేది.

ఏదేమైనా నోటీస్ దశలో స్పీకర్ చర్యపై స్టే విధించడం ఊహించలేని పరిణామం. ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ఆచరణను అడ్డు కుంటుందని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ఇలా జరిగితే ఏ సభ్యుడైనా ప్రోసీడింగ్స్‌ను ఆపడానికి కోర్టు కెక్కవచ్చు, స్టే కోరవచ్చు. ఇలాంటి జటిలమైన పెద్ద అంశాలను కోర్టు విచారణకు అనుమతించితే రాజ్యాంగంలోని పదో షెడ్యూలు 2(1) (ఎ) ప్రకారం న్యాయపరంగా తేల్చడానికి కొన్ని నెలలు పడుతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రాజ్యాంగ పరమైన అంశాలను చాలా కాలం క్రితమే పరిష్కరించినప్పుడు ఒక హైకోర్టు మళ్లీ దీన్ని ఎందుకు తిరగతోడుతోందో అంతా గందరగోళంగా కనిపిస్తోంది.

గవర్నర్ విచిత్ర వైఖరి

రాజస్థాన్ అసెంబ్లీని సమావేశ పరచాల్సిందిగా ముఖ్యమంత్రి, మంత్రిమండలి నిర్ణయాన్ని అదేపనిగా గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా పక్కన పెట్టడం విచిత్రమే. అంతేకాదు 21 రోజుల నోటీస్ ముందుగా ఇవ్వాలని పట్టుపట్టారు. ఈ సమావేశాలు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. పైగా కరోనా నిబంధనలు గుర్తు చేస్తూ సభ్యులు సామాజిక దూరం పాటించాలని హితవు పలికారు. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ గవర్నర్ విధుల్లో భాగమా? అన్న అనుమానం తలెత్తక మానదు. గవర్నర్ ప్రతిపాదనకు మంత్రిమండలి తలొగ్గి అంగీకరించడంతో సంక్లిష్ట పరిస్థితిని ప్రభుత్వం తాత్కాలికంగా తప్పించ గలిగిందన్న సంతృప్తి కలిగినా రాజ్యాంగ పరంగా ఇది సమంజసం కానిది.

భవిష్యత్తులో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు సమన్లు జారీ చేయడం గవర్నర్‌కు సంబంధించిన యథావిధి రాజ్యాంగ వ్యవహారం. అయినా ఇది తీవ్రమైన రాజ్యాంగపరమైన ఘర్షణను సృష్టించింది. పాలనా రంగంలో సాధారణ, రాజకీయ, రాజ్యాంగ విధుల మధ్య సున్నితమైన అనుబంధాన్ని ఇది చెడగొడుతుందని గ్రహించక తప్పదు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల తేదీని కేబినెట్ నిర్ణయించాక ఆ మేరకు సమన్లు ఉత్తర్వుపై గవర్నర్ సంతకం చేస్తారు. అదే రోజు లేదా మరునాడు గవర్నర్ దాన్ని తిరిగి కేబినెట్‌కు పంపిస్తారు. అసెంబ్లీ సెక్రెటరీ ఆ ప్రతులను సభ్యులకు పంపిస్తారు.

రాజస్థాన్ గవర్నర్ దీనికి భిన్నంగా వ్యవహరించారు. కేబినెట్ నిర్ణయాన్ని అంగీకరించకుండా తన ప్రతిపాదనకు కేబినెట్ తలొగ్గేలా ఒత్తిడి తెచ్చి తానే తుది నిర్ణేతగా చూపించుకున్నారు. ఇది గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆందోళన కలిగించే సంఘటనగా మారింది. 2015లో అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలునే గవర్నర్ మార్చేశారు. ముఖ్యమంత్రి సలహా లేకుండా స్వయం అజెండా నిర్ణయించారు. ఇటువంటి పరిస్థితిపై 2016లో అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజస్థాన్ వ్యవహారంతో దీన్ని పోల్చవచ్చు. నబామ్ రెబియా, బెమింద్ ఫెలిక్స్ వెర్సన్ డిప్యూటీ స్పీకర్, ఇతరుల కేసులో గవర్నర్ అధికారాలేమిటో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమన్ల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించింది. రాజ్యాంగం ప్రకారం గరవ్నర్ విధులు పరిమితం అని గుర్తు చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి భారీ మెజారిటీతో ఉన్నప్పుడు గవర్నర్‌కు ఎలాంటి విచక్షణాధికారం ఉండదని, అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ నిర్ణయంతో కేబినెట్ నిర్ణయాన్ని శిరసా వహించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంతా స్పీకర్ నియంత్రణలోనే జరుగుతుంది తప్ప గవర్నర్‌కు ఇందులో ఎలాంటి పాత్ర ఉండదని వివరించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే సభలో విశ్వాస తీర్మానాన్ని తీసుకు వస్తారా అన్నది స్పష్టం చేయాలని నేరుగా ప్రభుత్వాన్ని గవర్నర్ అడగవలసిన పని ఉండేది కాదు. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1974) వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు గవర్నర్ పాత్ర ఎంత వరకో విడమర్చి చెప్పింది. మంత్రిమండలి సలహాకు వ్యతిరేకంగా వ్యవహరించే హక్కు గవర్నర్‌కు ఏ మాత్రం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇలాంటి సంక్షోభాన్ని సంస్థల సమగ్రతకు భంగం కలగకుండా ముఖ్యమంత్రి, గరవ్నర్ పరిష్కరించుకోవలసిన బాధ్యత ఉందని సూచించింది.

ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సమన్లు జారీ చేయడం లేదా ప్రోరోగ్ చేయడం లేదా రద్దు చేయడం ఇవన్నీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా పైనే జరగాలి కానీ గవర్నర్ స్వంత విచక్షణాధికారంతో పనికి రాదు. ఆర్టికల్ 208 ప్రకారం అసెంబ్లీని గౌరవించడం పైనే గవర్నర్ విచక్షణాధికారం పరిమితంగా ఆధారపడి ఉంటుంది.

రాజస్థాన్ గవర్నర్ 21 రోజుల నోటీస్ ఇస్తే కానీ సమావేశాలు ప్రారంభించడానికి వీల్లేదని గట్టిగా చెప్పడం చూస్తే అది నిబంధనా లేక సూచనా అన్న అనుమానం రాక తప్పదు. ఇటువంటి నిబంధన ఏదీ రాజ్యాంగంలో పొందుపర్చలేదు. 1969లో లోక్‌సభ రూరల్స్ కమిటీ అసెంబ్లీ సమావేశాల సమన్ల జారీకి, సమావేశాల ప్రారంభ తేదీకి మధ్య 21 రోజుల విరామం ఉంటే మంచిదని సూచించింది. ప్రశ్నోత్తరాలకు కావలసిన సమాచారం సేకరించడానికి, సభ ముందుంచడానికి అధికార యంత్రాంగానికి ఈ మేరకు సమయం కేటాయించాలని సిఫారసు చేసింది. పార్లమెంటు మొదట ఈ వ్యవధి ఇవ్వాలని అనుకున్నా తరువాత 15 రోజులకే వ్యవధిని సరి పెట్టింది. అయితే చాలా రాష్ట్రాలు యథాలాపంగా 21 రోజుల గడువును పాటించడం ఆచరిస్తున్నాయి. అయితే ఈ గడువు నిర్ణయం స్పీకర్‌కే విడిచిపెట్టారు. స్వల్ప వ్యవధి నోటీస్‌పై అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నా ఈ 21 రోజుల గడువు ఏనాడూ అడ్డు తగలలేదు. అత్యవసరం అని భావిస్తే షార్టర్ నోటీస్‌పై అసెంబ్లీ సమావేశాలు పాలక వర్గం నిర్వహించుకోవచ్చు.

గవర్నర్‌కు కేబినెట్ అవసరం లేనప్పుడు!

మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ ఎప్పుడు ఎలా వ్యవహరించవచ్చునో తెలుసుకుందాం. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలులో కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయి. అసెంబ్లీ తీర్మానించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ ఆ బిల్లును రిజర్వు చేయవచ్చు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి తమ మెజారిటీ మద్దతును కోల్పోయినా లేదా ఆరు నెలల్లో సమావేశాలు నిర్వహించకపోయినా లేదా మెజారిటీపై సందేహం కలిగినా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ డిమాండ్ చేయవచ్చు. ఎవరికి మెజారిటీ ఉందని భావిస్తే వారికి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. అయితే ఈ అధికారం ఏకపక్షం కారాదు. ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంటే అసెంబ్లీని రద్దు చేయవచ్చు.

ఏదేమైనా రాజస్థాన్ పరిణామాలు ప్రజాస్వామ్య వాదులను ఆలోపించ చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయం తోసిపుచ్చిన గవర్నర్ ప్రతిపాదనకే కేబినెట్ తలొగ్గడం కేవలం రాజకీయ బలహీనతే. ఇది ప్రేరణ దాయకం కాదు. రాజ్యాంగ సూత్రాలు, ఆచరణాల కన్నా రాజకీయాలు తెర మీదకు రావడం, స్వంత ప్రమాణాలు ఆచరించడం చర్చించవలసిన అంశాలు. దీనిపై ప్రజా చైతన్యం కొరవడితే కొత్త రాజకీయ ప్రమాణాలు ముందుకు వస్తాయి. అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనడంలో సందేహం లేదు.

పి.వెంకటేశం- 9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News