Thursday, March 28, 2024

సంపాదకీయం: రాజస్థాన్‌లో రాజ్యాంగం దుస్థితి

- Advertisement -
- Advertisement -

Constitutional collapsed in rajasthan రాష్ట్ర గవర్నర్‌కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనాపై విస్తృత చర్చకు, కొన్ని బిల్లుల ఆమోదం కోసం శాసన సభను సమావేశపరచాలని మంత్రివర్గం చేసిన సిఫార్సు ప్రకారం నడచుకోకుండా గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తాత్సారం చేయడంలో ఆయన ప్రజాహిత, రాజ్యాంగ విహిత విధి నిర్వహణ కంటే ప్రభు విధేయత స్పష్టపడుతున్నది. కేంద్ర పాలక పక్షమైన భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బహిష్కృతులయిన పాలక కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజేశ్ పైలట్, మరి 18 మందితో కూడిన వర్గం తన బలాన్ని తగినంత స్థాయికి పెంచుకునేంత వరకు శాసన సభను సమావేశపరచరాదని పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే గవర్నర్ నడుచుకుంటున్నారని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. 2016లో అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో, ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్ కోవా మంత్రివర్గ సిఫార్సు లేకుండానే అసెంబ్లీ సమావేశాలను 2016 జనవరి 14 నుంచి 2015 డిసెంబర్ 16కు ముందుకు జరిపిన చర్యను తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

శాసన సభను సమావేశ పరచడం, సమావేశాలను ప్రోరోగ్ చేయడం విషయంలో గవర్నర్ తప్పనిసరిగా రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సు మేరకే నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గవర్నర్‌కు స్వతంత్రాధికారాలివ్వవచ్చనే ప్రతిపాదన రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లోనే వీగిపోయింది. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందనే అనుమానం కలిగినప్పుడు మాత్రం బల నిరూపణ చేసుకోవాలని దానిని కోరుతూ అసెంబ్లీని స్వచ్ఛందంగా సమావేశ పరిచే హక్కు, అధికారం గవర్నర్‌కు ఉంటాయనేది కూడా సుస్పష్టం. రాజస్థాన్‌లో గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మెజారిటీలోనే ఉన్నదన్నది లోక విదితం. అటువంటప్పుడు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా మంత్రివర్గ సిఫార్సు మేరకు సభను ఎందుకు సమావేశపరచడం లేదన్నది కీలక ప్రశ్న. గెహ్లాట్ మంత్రి వర్గం శాసన సభ సమావేశాలను కోరుతూ రెండు సార్లు గవర్నర్‌కు సిఫార్సు చేసింది. మొదటి సిఫార్సుకు అనుకూలంగా స్పందించని గవర్నర్ మంత్రి వర్గానికి ఆరు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానమిస్తూ ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని సూచిస్తూ మంత్రివర్గం మరొక సిఫార్సును పంపింది.

అయినా ఫలితం కనపడలేదు. ఇటీవలనే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతకు గురైనప్పుడు అక్కడి గవర్నర్ బిజెపి అవసరార్థం తొందరగా అసెంబ్లీని సమావేశపరచారు. రాజస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలు ఒక పద్ధతి ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధంగానూ మెజారిటీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సులకు వ్యతిరేకంగానూ చోటు చేసుకుంటున్నాయని అంతిమంగా అక్కడ గెహ్లాట్ ప్రభుత్వం పతనమై బిజెపి పాలన నెలకొనేందుకు దోహదపడే దిశగా బంతి కదులుతున్నదని అనుకోడానికి వీలు కలిగిస్తున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ శాసన సభా పక్ష అభ్యర్థన మేరకు తిరుగుబాటు ఎంఎల్‌ఎల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉండగా, ఆ విషయంలో ముందుకు వెళ్లకుండా హైకోర్టు అడ్డు నిలిచింది. దాని ఉత్తర్వులు గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారమే చట్ట విరుద్ధమని, గవర్నర్ చర్యను ప్రభావ రహితం చేసి తనకు స్వేచ్ఛనివ్వాలని రాజస్థాన్ స్పీకర్ సుప్రీంకోర్టును కోరగా అందుకు అక్కడ చుక్కెదురయింది.

సుప్రీంకోర్టు అదనంగా తిరుగుబాటు సభ్యుల అసమ్మతి వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే, అసమ్మతి గళం వినిపించే స్వేచ్ఛ వారికి లేదా అని ప్రశ్నిస్తూ ఇది విస్తృతమైన అంశమని వ్యాఖ్యానించింది. అందుకు స్పీకర్ తరపు న్యాయవాదులు లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరై, తమ కంఠం వినిపించుకునే స్వాతంత్య్రం తిరుగుబాటు ఎంఎల్‌ఎలకు ఉన్నదని, వారు ఆ సమావేశానికి గైర్హాజరై హోటల్‌లో కూర్చున్నారని వాదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. మొత్తం పరిణామక్రమాన్ని తరచి చూసినప్పుడు రాజ్‌భవన్‌లో గాని, ఉన్నత న్యాయస్థానాల్లోగాని ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు దిక్కులేనిదైపోతున్నదని బోధపడుతున్నది. ఫిరాయింపు నిరోధక చట్టంలోని లొసుగులు దాని నెప్పుడో నిర్వీర్యం చేశాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన రాజ్యాంగ పదవుల్లోని వారు రాజ్యాంగం నిర్దేశించిన దారులను వదలిపెట్టి ఉత్తర్వులిస్తున్నాయనే అభిప్రాయం బలపడడం దేశానికి ఎంత మాత్రం క్షేమం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News