Home ఎడిటోరియల్ రాజ్యాంగ విహిత సంస్కృతి

రాజ్యాంగ విహిత సంస్కృతి

Festival2రాజ్యాంగంలో లౌకిక ప్రజాస్వామ్యం అని ప్రకటించుకున్నప్పటికీ స్వాతంత్య్రానంతరం దేశంలోని అసమానతలను తొలగించడానికి బలమైన కృషి జరగలేదు. ప్రభుత్వం అందుకు పూనుకోలేదు.పాత సంస్కృతి ని సంస్కరించే ఉద్యమాలు ఆయా మతాల్లో జరగాల్సి ఉండింది. సంస్కృతిపేరిట, విశ్వాసాల పేరిట, పాత మత భావాలను, ఆచరణను భారత రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా కొనసాగించడానికి ప్రభుత్వాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుమతి నిచ్చాయి. కాల క్రమంలో ప్రోత్సహించాయి కూడా. ఇది తీవ్రమైన నేరం. సంస్కృతి లేకుండా మతం లేదు. మతం లేకుండా సంస్కృతి కొనసాగుతుంది. మతం అనేది రెండున్నర, మూడువేల ఏళ్ళ నుండి స్థిరరూపం పొందుతూ మార్పులు చేర్పులతో కొత్త మతాల ఆవిర్భావం జరుగు తూ వస్తున్నది. అంతకుముందు మతాలు లేవు. బుద్ధుడు ప్రతిపాదించి ప్రచారం చేసింది ఒక సామాజిక విప్లవం. ఒక సాంస్కృతిక విప్లవం. కాలక్రమంలో దాన్ని మతంగా భావించడం జరిగింది. కొన్ని దృక్పథాల, భావాల, ఆచరణల నిర్దిష్ట స్థిర రూపాలు, వాటిని ఆచరించే జీవితం, సంస్కృతి కలిసి సంశ్లేషించినప్పుడు అది మతంగా మారింది. అవి కూడా కాలక్రమంలో మారుతూ ఉంటాయి. మారుతున్న క్రమం సామాన్య ప్రజలకు పెద్దగా పట్టదు. వర్తమానంలో ఆచరించేదే వెనుకటినుంచి ఉందని అనుకుంటూ ఉంటారు.సింధు నాగరికతకు వ్యతిరేకంగా వైదికం, వేద కాలంనాటి ఆర్యులు సంఘర్షించారు. వైదిక కర్మకాండలకు వ్యతిరేకంగా చార్వాకులు, బౌద్ధం, జైనం అనేక ఉపనిషత్తులు సంఘర్షించాయి.వైదిక కర్మకాండను వేదాల ఆధిక్యతను వ్యతిరేకిస్తూ శైవం, వైష్ణవం ఉద్యమాలు ముందుకు వచ్చాయి. కాలక్రమంలో ఒక సమన్వయంలో వైదికాన్ని కూడా స్వీకరించాయి. అందరికీ ఒకే రోగం, ఒకే మందు అనే అంశం మనుషులందరూ సమానమే అనే భావానికి దారి తీస్తుంది. అందుకని వర్ణ వ్యవస్థ సిద్ధాంత కారులు ఆయుర్వేదాన్ని వ్యతిరేకించారు. దాంతో ఆయుర్వేదం తొలుత కర్మ, పునర్జన్మ, వర్ణాధిక్య సిద్ధాంతా లను వ్యతిరేకించి, కాలక్రమంలో వాటిని కలుపు కొని ఆయుర్ వేదంగా కొనసాగుతూ వస్తున్నది. వైదికులకు, చార్వాకులకు సంఘర్షణ జరిగింది. బౌద్ధుల కు, వర్ణ వ్యవస్థకు సంఘర్షణ జరిగింది. బ్రాహ్మణీయ శక్తులు, బుద్ధుడు నిరసించిన గోమాంస భక్షణను వదిలివేయడం తోపాటు మొత్తం శాకా హారులుగా మారుతూ వచ్చాయి. శూద్రులు, గోమాంసాన్ని వదిలివేసి మాంసాహారులుగా కొనసాగుతున్నారు. అతిశూద్రులు గోమాంసాన్ని కంటిన్యూ చేయడంవల్ల అంటరాని వాళ్ళుగా చూడబడ్డా రని అంబేడ్కర్ అభిప్రాయ పడ్డారు.వైష్ణవానికి, శైవానికి మధ్య తరాల తరబడి సంఘర్షణ జరిగింది. ఊచకోతలు కూడా జరిగాయి. ఏ రాజులు, ఏ మతం స్వీకరిస్తే దానికి అనుకూలంగా ప్రజలు, వారికి వ్యతిరేకంగా మరికొందరు యుద్ధాలు చేశారు. చంపుకున్నారు. చివరికి ఇలా కాదని, ఇద్దరిని కలిపి ఒక దేవునిగా మార్చాలని సయోధ్య కుదర్చాలని కొందరు భావించారు. అలా హరిహర దేవుడు ప్రచారం చేయబడ్డాడు. దానికి ప్రతీకగా శివకేశవుల ఐక్యతతో స్వామియే శరణం అయ్యప్పను సృష్టించడం జరిగింది.
్ర బహ్మ, విష్ణూ, మహేశ్వర అనే త్రిమూర్తులను త్రిమూర్తు లుగా ఒక సమన్వయంలో కుదర్చడం అనేది ఆయా మతాల మధ్య యుద్ధాలు, సంఘర్షణల్లో సమన్వయం సాధించడం కోసం జరిగింది. వారికి సృష్టి, స్థితి, లయ కారకులని డ్యూటీలను, డిపార్ట్‌మెంట్లను కూడా కేటాయిం చడం జరిగింది. అక్కడికీ సంఘర్షణలు ఆగిపోలేదు. దాంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే రూపంగా ‘దత్తాత్రేయ అవతారం’ సృష్టించడం జరిగింది. దత్తాత్రేయునికి మరెన్నో అవతారాలను సృష్టించడం జరిగింది. విష్ణువును దశావతారాల్లో ఆరాధించారు. ఆనాటికి తప్పనిసరియై బుద్ధుడిని తొమ్మిదవ అవతారం గా కలిపేశారు. ఎందుకోగాని వర్ధమాన జైన మహావీరు డిని దశావతారాల్లో కలపలేదు. అలాగే వెంకటేశ్వర స్వామి (బాలాజీ), అయ్యప్ప స్వామి దశావతారాల్లో లేరు. అయినా దేవుళ్ళయిపోయారు. అంటే దశావతా రాలను స్థిరపరిచాక మళ్ళీ కొత్త దేవుళ్ళను రూపొందిం చడంవల్ల అప్పటికే దశావతారాలు లిపిబద్దమై ఉండటం వల్ల వాటిల్లో కలపలేక రకరకాల కథలు అల్లి దేవుళ్ళను చేశారు. ఆధునిక సమాజానికి అనుకూలంగా మతాలను, సంస్కృతిని సమూలంగా మార్చుకోవడం అవసరం. అంతదాకా సంఘర్షణలు కొనసాగుతాయి. చరిత్రలో ప్రతిసారీ సంఘర్షణలను పరిష్కరించడానికి ఎప్పటి కప్పుడు కృషి చేస్తూ వచ్చారు. ఇప్పుడు చేయాల్సింది కూడా అదే పని.
దశావతారాలు విష్ణువుకు సంబంధించినవి. వైష్ణవానికి సంబంధించినవి. శివుడు, శంకరుడు, సాంబ శివుడు, నటరాజ, భోళా శంకరుడు, గౌరీశంక రుడు పేర్లతో పిలువబడే శివునికి సంబంధించింది లింగపూజ, శైవారాధన. నంది పూజ, సింధు నాగరికత కాలంనుండే కొనసాగుతున్న ప్రాచీన సంస్కృతి అని కొందరి అభిప్రాయం.జంతు చర్మాన్ని కట్టుకోవడం వంటి లక్షణాలు, త్రిశూలం, వేట ద్వారా ఆహార సేకరణ దశ తాలూకు గణతెగల కాలంనాటి వాడు శివుడని, హిమాలయాలు, మానస సరోవరం శివుడు నివసించిన ప్రాంతంగా ప్రాచుర్యంలో ఉండడం మొదలైనవాటిని చర్చిస్తూ ప్రతిపాదిస్తుంటారు.శైవారాధనలో శైవం, వీరశైవం వంటి శాఖలు వెలిశాయి. బౌద్ధం, జైనం రాజుల యుద్ధకాంక్షకు, సామ్రాజ్య విస్తరణకు పనికిరాని శాంతియుత జీవితాన్ని ప్రతిపాదించాయి. అందువల్ల వాటిని నిరాకరిస్తూ వీరశైవం, వీర వైష్ణంతో పాటు యుద్ధాలను, శత్రు సంహారాన్ని గొప్పచేసే వైష్ణవ అవతారాలకు, వీరశైవానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు కాకతీయుల కాలంలో యుద్ధవిద్యల ఆవేశాన్ని రగిల్చే ‘పేరిణి నృత్యం’ బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. శాంతికాలంలో దైవారాధన పేరిట కూచిపూడి, భరతనాట్యం వంటి ఎన్నో నాట్య రీతులను దేవాలయాల్లో, రాజాస్థానాల్లో పెంచి పోషిం చడం జరిగింది.శివుడికి శ్మశానాన్ని అప్పగిం చారు. శివుడికి లయకారుడిగా డూటీ అప్పగించారు. అయితే శైవులు ఊరుకోలేదు. శివుడు నటరాజుగా నాట్యానికి ఆద్యుడిగా, సంస్కృత భాష అక్షరాలు శివుడి ఢమరుకం నుంచి ఆవిర్భవించాయని సూత్రీకరించి సిద్ధాంతాలు, వ్యాకరణాలు రాసి స్థిరీకరించారు. ఇలా చేసినప్పటికీ శివుడికి బూడిద చిహ్నంగా మారింది. అందుకే వైష్ణవాలయాలు సంపదకు చిహ్నమని, శివాలయాలు పేదరికానికి చిహ్నమని అనేక సామెతలు ప్రచారంలోకి వచ్చాయి.అసురులు, రాక్షసులు, నాగులు, మొదలైన వారు శైవారాధకులు. వీరు విష్ణువుని, ఇంద్రున్ని కొలవకుండా వారికి వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు. శైవ భక్తులు, అసురులు, నాగులు… విష్ణు అవతారాల చేతుల్లో హతులైనట్లు పురాణాలు, కథలు వెలిశాయి. దీన్ని ఎలా సమర్ధించుకోవాలో ఆలోచించి భోళా శంక రుడు, భోళాగా వరాలిస్తాడని, తద్వారా ఏర్పడే కష్టాలను విష్ణువు అవతారంఎత్తి పరిష్కరించాడని పురాణాలు, కథలు రాసి ప్రచారం చేశారు. అయినప్ప టికీ శివుడుని కిరాతకుడిగా, అతని సైన్యం, అనుచరులు, ప్రమధ గణాలుగా వర్ణించారు. దక్షుడు చేసిన యజ్ఞానికి అల్లుడైన శివుడ్ని పిలువ నందుకు నా తల్లిగారి యిల్లు అని పార్వతి వెళ్ళి అక్కడ అవమానించబడి యజ్ఞ గుండంలో దూకి చనిపోతుంది. అప్పుడు శివుడు తన ప్రమధ గణాలతో దక్షుడిని, అతడి అనుచరులను సంహ రిస్తాడు.
విష్ణువును పూజిస్తే రాక్షసులు కారు అన్నట్టు మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో కనపడుతుంది. ఉదాహరణకు హిరణ్యకశ్యిపుడు రాక్షసుడు. అతని కొడుకు ప్రహ్లాదుడు విష్ణువును ఆరాధిస్తాడు. అతడ్ని రాక్షసుడిగా చెప్పరు. అతని మనవడు బలిచక్రవర్తి భారతీయ షట్ చక్రవర్తుల్లో (ఆరుగుురు గొప్ప చక్రవర్తుల్లో) ఒకరుగా కీర్తిస్తారు. కానీ అతడు రాక్షస రాజు అని వామనావతారం ఎత్తి విష్ణువు అతన్ని పాతాళానికి తొక్కేస్తాడు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దీపావళిని బలిచక్రవర్తి మళ్ళీ వస్తాడని దీపాలు వెలిగించి నిరీక్షించే, స్వాగతించే పండుగుగా జరుపు కుంటారని చరిత్రకారులు పేర్కొన్నారు.ఇలా చరిత్ర పరిణామంలో వైదిక, చార్వాక, నాస్తిక, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, పౌరాణిక, కాపాలిక, శాక్తేయ, తాంత్రిక, వజ్రయాన, వామాచార మతాల పుట్టుక, భక్తి ఉద్యమాల పెరుగుదల… యుద్ధాలు, హత్యాకాండలు… సంఘర్షణలు, సమన్వయాలు సాగుతూ వచ్చాయి. అదేక్రమంలో హిందూ ముస్లింల సఖ్యత కోసం సిఖ్ఖు మతం ఆవిర్భవించింది. ప్రపంచ మతాల అన్నిటిమధ్య సఖ్యత కోసం గత శతాబ్దంలో ‘బహాయి’ ఉద్యమం ఆవిర్భవించి కొనసాగుతున్నది. ‘బహాయి’ ఉద్యమం నిర్వాహకులు ఢిల్లీలో లోటస్ టెంపుల్ కట్టారు.
ఈ క్రమంలో వర్ణ, కుల వ్యవస్థలు కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు చాతుర్వర్ణ అసమానతలు ఏదో రూపంలో కొనసాగిస్తూ వస్తున్నాయి. భారత రాజ్యాంగం వీటన్ని టిని పూర్వపక్షం చేసి అందరూ సమానమే, ఏ కులమూ గొప్పది కాదు, ఏ కులమూ చిన్నది కాదు. అన్ని కులాలు సమానమే, అందరూ సమానమే అనే మహోన్నత తాత్విక దృష్టిని మన లక్ష్యంగా ప్రకటించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ ఆదర్శ లక్ష్యాలతో హిందూ సమా జాన్ని, సంస్కృతిని, కుల వ్యవస్థను, సంస్కరించాల్సిన అవసరం ఉంది.
హిందువులందరూ గంగా, సింథు బిందువులే అని చెప్పి సమాజాన్ని ఏకులం గొప్పది కాదని, ఏ కులం చిన్నది కాదని, మనుషులందరు సమానమేనని, నేటి ముస్లింలంతా మన హిందూ మత బాధితులే అని వారిని గౌరవిస్తూ కులాంతర వివాహాలకు పెద్ద ఎత్తున పూను కున్నప్పుడే సమాజంలో గొప్ప మార్పు జరుగుతుంది. భారతీయ సమాజం, హిందూ ముస్లిం సఖ్యతతో బలమైన సమాజంగా ఎదుగుతుంది. ఈ ఆదర్శాలతో, లక్ష్యాలతో హిందూ సమాజాన్ని సంస్క రించే కర్తవ్యాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళేవారే నిజమైన హిందువులు. ఆర్‌ఎస్‌ఎస్ ఈ కృషి చేసినపుడే అది హిందువులందరి ప్రతినిధి అవుతుంది.
కాలనుగుణంగా భారతీయ సమాజాన్ని వైరుధ్యాల పుట్టనుండి కులాతీతంగా, మతాతీతంగా సమైక్యత, స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మ గౌరవం, సమాన అవకాశాలు అందించే నూతన మానవీయ సంస్కృతిని ఆచరిస్తూ ముందుకు సాగేవారే నిజమైన దేశభక్తులు. హిందువుల్లో మెజారిటీ ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలే కనుక వారి ప్రయోజనాలను కాదని, ఆర్‌ఎస్‌ఎస్సే కాదు ఏ సంస్థయినా ముందుకు సాగడం, విస్తరించడం, కొనసాగడం సాధ్యం కాదు. పైగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు భారతీయ సమాజం పై కూడా ప్రభావం వేస్తాయి. నిర్దేశిస్తాయి.
ప్రపంచంలో మత విశ్వాసాలను, ఆధునిక జీవితానికి అనుగుణంగా ఎక్కడికక్కడ సంస్కరించు కోవాలి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సంస్కృతిలో సమా నత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవం కొరకు సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష వివక్షతలకు, అసమానతలకు వ్యతిరేకంగా సమాన త్వాన్ని ప్రతిపాదించే మౌలిక, నూతన ఆదర్శాలను, సూత్రాలను ఆమోదించి ప్రపంచ వ్యాప్తంగా ఆచరించ డానికి పూనుకోవాలి. అందుకు సాంస్కృతిక సైన్యాలను ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాటుచేసి యుద్ధ రహిత, శాంతియుత సహజీవనానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి కృషి చేయడం అవసరం. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని రెడ్‌క్రాస్ సొసైటి, స్కౌట్స్, ఎన్‌సిసి, యూనిసెఫ్, ఆమ్నెస్టి ఇంటర్నేషనల్, వలె నూతన సంస్థలను అన్నిదేశాల త్యాగధనులతో సాంస్కృ తిక సైన్యాలను రూపొందించడం అవసరం. అటువంటి కృషి చేసినపుడే విశ్వశాంతి కిబాట లేర్పడతాయి.
– 8331966987