Home జాతీయ వార్తలు మందిరంపై మాటిచ్చి దాటేస్తారా..?

మందిరంపై మాటిచ్చి దాటేస్తారా..?

Construction of Ram temple in Ayodhya is definite

న్యూఢిల్లీ : అధికారంలో ఉన్న వారు ప్రజావాణిని ఆలకించాలి. ప్రజల ఆకాంక్షల మేరకు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వాగ్దానం చేసిన వారు ఇప్పటికీ అమలు చేయలేదని భయ్యాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పేరు చెప్పకుండా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన విహెచ్‌పి ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సంచాలకులు ప్రసంగించారు. ‘ ఇప్పుడు అధికారంలో ఉన్న వారు రామాలయ నిర్మాణానికి వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికీ ఈ మాట నిలబెట్టుకోలేదు. వారు ప్రజలు ఏమి చెపుతున్నారో వినాల్సి ఉంది. అయోధ్యలో ఆలయ నిర్మాణ డిమాండ్‌పై స్పందించాల్సి ఉంది. అధికారంలో ఉన్న వారికి ప్రజల మనోగతం ఏమిటి? వారి విశ్వాసాలేమిటీ ? అనేది బాగా తెలుసునని, అయితే ఇందుకు అనుగుణంగా వ్యవహరించకపోవడమే ప్రస్తుత అంశం ’ అని భయ్యాజీ చెప్పారు. ఈ దేశం రామరాజ్యాన్ని కోరుకొంటోందని, ఆలయం కట్టించాలని వారి ముందు బిచ్చమెత్తుకోవడం లేదని ఆయన బిజెపిని ఉద్ధేశించి చెప్పారు. అందరి భావోద్వేగాలను తాము వ్యక్తపరుస్తున్నామని , దీనిని గుర్తించడం అదికారంలో ఉన్న వారి బాధ్యత అని తేల్చిచెప్పారు.

దేశం అంతా రామరాజ్యం ఆకాంక్షిస్తోందని, రామాలయం ప్రాణప్రదం అని ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకులు తెలిపారు. విహెచ్‌పి సభలో ఈ నేత దేశంలోని న్యాయవ్యవస్థ గురించి కూడా ప్రస్తావించారు. ఏ దేశంలో అయితే న్యాయవ్యవస్థపై నమ్మకం సడలిపోతుందో, అపనమ్మకం ఏర్పడుతుందో ఆ దేశం ముందుకు పోలేదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని, ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని ప్రత్యేకించి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని భయ్యాజీ సూచించారు. తాము ఏ వర్గంతోనూ తగవుకు దిగడం లేదని, దేని కోసం యాచించడం లేదని, కేవలం ప్రజల ఆకాంక్షలను తెలియచేస్తున్నామని చెప్పారు. రామాలయ నిర్మాణానికి ప్రస్తుత పరిస్థితులలో చట్టం తీసుకురావడమే ఏకైక మార్గం అని తేల్చిచెప్పారు. ఆలయ నిర్మాణానికి ఇచ్చిన వాగ్ధానం అమలు అయ్యేవరకూ తమ ఉద్యమం కొనసాగి తీరుతుందని భయ్యాజీ హెచ్చరించారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన సభకు వేలాది మంది తరలివచ్చారు. మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో విహెచ్‌పి సభ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి తనదైన రీతిలో చురకలు అంటించారు.

‘ఆలయ నిర్మాణం జరిగే వరకూ ఆయన సీటు కదలకుండా చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరడం ఆయన విధి..బాధ్యత ’ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వాక్కు, వారి మనోగతం కీలకం అని , ఇక్కడ ప్రజలే శిరోధార్యం కావల్సి ఉంటుందని, తప్ప న్యాయస్థానాలు కాదని విహెచ్‌పి అధ్యక్షులు విష్ణు సదాశివ్ కోక్జే స్పష్టం చేశారు. మసీదు ఉన్న ప్రాంతంలో మందిర నిర్మాణానికి తాము కోరుతున్నామనేది దురభిప్రాయం అని, అక్కడ మొదట ఉన్నది ఆలయం అని, దీనిని కూల్చివేసి మసీదు కట్టారని విమర్శించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎన్నికల నినాదం అవుతోందనే వాదనను విష్ణు సదాశివ తోసిపుచ్చారు. స్థానికంగా విహెచ్‌పి సభ ఉండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు జరిగింది. భద్రతా చర్యలలో భాగంగా ఉన్నత కట్టడాలపై ప్రత్యేక సుశిక్షిత స్నైపర్లను సిద్ధంగా ఉంచారు. ర్యాలీ విజయవంతానికి విహెచ్‌పి ఇంటింటి ప్రచారం నిర్వహించింది. తమ పిలుపు మేరకు అత్యధిక సంఖ్యలో జనం తరలివచ్చారని దీనితో అయినా రామాలయ నిర్మాణానికి చట్టం పట్ల వ్యతిరేకంగా ఉన్న వారి మనసు మారుతుందని ఆశిస్తున్నట్లు విహెచ్‌పి ప్రతినిధి వినోద్ బన్సల్ చెప్పారు.

ప్రభుత్వాలను కూల్చేస్తా : సుబ్రమణ్యస్వామి

ఢిల్లీ: రామమందిర నిర్మాణంపై బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యల దుమారం రేపుతున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామ మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలు అభ్యతరం చెప్పడం లేదన్నారు. కానీ అటు మోడీ ప్రభుత్వం, ఇటు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రామ మందిరం నిర్మాణంపై కావాలని ఆలస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏవేని కారణాలతో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంటే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేస్తనని హెచ్చరించారు. అయోధ్య కేసును జనవరిలో విచారిస్తామని సుప్రీం కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Construction of Ram temple in Ayodhya is definite

Telanagana News