Home తాజా వార్తలు అక్టోబర్‌లో ‘కేబుల్ బ్రిడ్జి’ పూర్తి

అక్టోబర్‌లో ‘కేబుల్ బ్రిడ్జి’ పూర్తి

Cable-Bridge

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి మరో మణిహారంగా దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణం రూపుదిద్దుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ అభిలషించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు బ్రిడ్జి పనులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగరంలోని దుర్గంచెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని శనివారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీరింగ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి, జీహెఎంసి కమిషనర్, ఎం.దానకిషోర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, జీహెఎంసి ప్రాజెక్ట్‌ల విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ రూ. 180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నగరానికి సరికొత్త ఆకర్షణతో పాటు పర్యాటక రంగంలో మరో ఐకానిక్‌గా మారనుందన్నారు. కాగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల వివరాలను అర్వింద్‌కుమార్‌కు సంబంధిత అధికారులు వివరించారు.

సిమెంట్ కాంక్రిట్ ద్వారా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి 238 మీటర్ల పొడవుతో సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలోనే మొదటిదని పేర్కొన్నారు. మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణానికి 53 సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్‌లను అమర్చాల్సి ఉండగా 13 సెగ్మెంట్‌లను అమర్చడం పూర్తి అయ్యిందని ఇంజనీర్లు తెలిపారు. కొండాపూర్‌లో ముందుగా ఈ సెగ్మెంట్‌ల నిర్మాణాలను పూర్తిచేసి రాత్రివేళలో రోడ్డు మార్గం ద్వారా తెచ్చి దుర్గంచెరువుపై అమర్చడం జరుగుతుందని తెలిపారు. ఒకొక్కటి 25 మీటర్ల పొడవు 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే కాంక్రీట్ సెగ్మెంట్‌లను అత్యాధునిక, సాంకేతిక పద్దతిలో అమర్చుతున్నామని పేర్కొన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసి కమిషన్ దానకిషోర్ మాట్లాడుతూ, రానున్న అక్టోబర్ మాసాంతంలోగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి – చేస్తామన్నారు. జీహెఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టామని తెలిపారు.

ఈ కేబుల్ బ్రిడ్జిపై మూడు లైన్ల వాహనాల రహదారితో పాటు ఇరువైపులా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లను కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. దాదాపు పది కోట్ల వ్యయంతో అత్యంత ఆకర్షనీయమైన ఇంటిగ్రేటెడ్ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నుల్ లైటింగ్ మొత్తం స్టీల్ బ్రిడ్జి పిల్లర్లలోనే అమర్చడం జరుగుుతుందని స్పష్టం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా ఆధునిక పద్దతిలో స్టీల్ రేలింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. దుర్గంచెరువు బ్రిడ్జి నిర్మాణం పూర్తితో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గుణనీయంగా తగ్గుడంతో పాటు జూబ్లీహిల్స్ నుండి మైండ్ స్పేస్, గుచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గునుందని ఆయన తెలిపారు.

Construction of the cable bridge over the Durgam Pond