Saturday, April 20, 2024

ఒమిక్రాన్ మ్యుటేషన్లు అందోళన కలిగిస్తున్నా.. కట్టడికి వ్యాక్సిన్లే కీలకం

- Advertisement -
- Advertisement -

Control of Omicron mutations with vaccines

వైద్యశాస్త్ర నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగించే మ్యుటేషన్లతో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నా కొవిడ్ అన్నది స్వల్పకాల సంక్షోభం కాదని, కట్టడి చేయడానికి వ్యాక్సిన్లే కీలకమైన సాధనాలని శాస్త్రవేత్తలు సోమవారం వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ సంక్షోభంతో సతమతమౌతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆవిర్బావంతో ప్రపంచ శాస్త్రవేత్తల సమాజం దీనిపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా కట్టడి చేసే సామర్ధం కలిగినవిగా పేర్కొన్నారు. ఒమిక్రాన్‌కు దాదాపు 50 మ్యుటేషన్లు ఉండగా, వీటిలో 32 స్పైక్ ప్రొటీన్లలో ఉన్నాయని, ఇవి మానవ కణాల్లో వైరస్ ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయని, మరో 10 మ్యుటేషన్లు అత్యంత ప్రభావం కలిగినవని పబ్లిక్ పాలసీ నిపుణులు చంద్రకాంత్ లహారియా వెల్లడించారు. ఈ అత్యంత ప్రభావం చూపే మ్యుటేషన్లలో హెచ్ 655 వై, ఎన్ 679 కె, పి 681 హెచ్, మ్యుటేషన్లు తీవ్రంగా వ్యాప్తి చెందే రకాలుగా పేర్కొన్నారు. ఆర్ 203 కె, జి 204 ఆర్, మ్యుటేషన్లు అథ్యధికంగా ఇన్‌ఫెక్షన్‌కు దోహదం చేస్తాయని వివరించారు.

ఎస్‌ఎస్‌పి 6 అనే మ్యుటేషన్ వ్యాధినిరోధక శక్తిని తప్పించుకుంటుందని చెప్పారు. కొత్త వేరియంట్ పుట్టుకు రావడం కొవిడ్ మహమ్మారిని స్వల్పకాల సంక్షోభంగా భావించి చికిత్స చేయరాదని సూచిస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (న్యూఢిల్లీ) కి చెందిన ఇమ్యునాలజిస్టు సత్యజిత్ రధ్ అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ గురించి కొద్దిగానే తెలిసినా , ఇది అనేక మ్యుటేషన్లు కలిగిస్తోందని, దక్షిణాఫ్రికా లోని గూటెంగ్ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి దోహదం చేసిందని చెప్పారు. ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నా అంతగా తీవ్ర ముప్పు కలిగించక పోవచ్చని, ప్రస్తుత వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను కట్టడి చేయగలవని సూచించారు. కొల్‌కతా లోని సిఎస్‌ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోలజీ సీనియర్ సైంటిస్టు ఉపాసన రాయ్ కూడా ఈ అభిప్రాయాన్ని అంగీకరించారు. కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్ పొందడమే సరైన పరిష్కారంగా పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత కాకుండా కొంతవరకు వ్యాక్సిన్లు కనీస రక్షణ కల్పిస్తాయని చెప్పారు.

దేశంలో చాలామంది వ్యాక్సిన్ పొందక ముందే ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని, అందువల్ల వ్యాక్సినేషన్, ఇన్‌ఫెక్షన్ కాంబినేషన్ విస్తారమైన ఇమ్యూనిటీ స్పందన కలిగించిందని అందువల్ల మనం కాస్త అదృష్టవంతులమే అని వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ పేర్కొన్నారు. భారత దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా బయటపడక పోయినప్పటికీ ఏ కొత్త వేరియంట్ వచ్చినా ప్రస్తుత వ్యాక్సిన్లకు కట్టడి అవుతుందని అనుకోకూడదని లహారియా వివరించారు. కరోనా మహమ్మారితో మనకు 21 నెలల అనుభవం ఉందని, మన ప్రయత్నాలు సైన్సు, సాంక్రమిక వ్యాధి పరిజ్ఞాన అవగాహన పైనే ఆధారపడి ఉండాలని సూచించారు. ప్రస్తుత మ్యుటేషన్లను అర్ధం చేసుకోవడం పైనే వ్యాప్తిపై మన ఆలోచనలు ఉంటాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News