Thursday, April 25, 2024

భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం
‘శ్రీరామచంద్ర’ పదానికి బదులుగా ‘రామనారాయణ’ పదం వాడడంపై అభ్యంతరం
భక్తకోటి విశ్వాసాలను వమ్ముచేస్తున్నారని
భద్రాద్రి పరిరక్షణ సమితి ఆరోపణ
అర్చకులు నోటీసులు పంపించిన చిదంబరశాస్త్రి
వివాదం చేస్తే ఊరుకోం: వేదపండితులు

Controversy Over Bhadradri Sita-Rama's Surnames

మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రిలో సీతారాముల గోత్రనామాలు, ప్రవచనాలు చెప్పే సమయంలో పలికే పదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడి అర్చకగణం ‘శ్రీరామచంద్ర’ పదానికి బదులుగా ‘రామనారాయణ’ పదాన్ని చెబుతున్నారని, ఇది తీవ్రమైన అభ్యంతరకరమని భద్రాద్రి పరిరక్షణ సమితి పేర్కొంటుంది. ఇప్పటికే భద్రాద్రి శ్రీరామచంద్రున్ని, రామనారాయణునిగా పేర్కొంటూ కళ్యాణాలలోనూ, ఇటు నిత్య పూజలలోనూ భక్తకోటి విశ్వాసాలను వమ్ముచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎప్పుడూ లేనంత రగడ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాలకు చెందిన అన్నదానం చిదంబరశాస్త్రి అనే వ్యక్తి ఇప్పటికే ఈ విషయమై అర్చకులకు లీగల్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. ఇలా శ్రీరాముని నామాల ఉచ్ఛరణ, ప్రవచనాలు చెప్పే విషయంలో మొండి పట్టుదలకు పోవడం ఈ క్షేత్రానికి మంచిది కాదని భక్తులు వాపోతున్నారు. అసలు భద్రాచలంలో ఏం జరుగుతోందన్న దానిపై ఏకంగా చిదంబరశాస్త్రి ఓ పుస్తకాన్ని అచ్చు వేయడంతో ఈ వివాదం చిలికిచిలికి వానగా ముదురుతోంది.
ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుందోనని భక్తుల ఆందోళన
రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న రాసిన ప్రతి కీర్తన వినని వారుండరు. ఎన్ని కష్ట,నష్టాలు ఎదురొచ్చినా, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ధర్మబద్ధంగా ఎదుర్కొవడం మినహా వేరే ప్రత్యామ్నాయానికి పోలేదని సీతారాముల గురించి భక్తులు చెప్పుకుంటారు. అందుకే రామపదం ధర్మపదమని వేదపండితులు పేర్కొంటారు. మరి ఇంతటి ప్రాచుర్యం కలిగిన శ్రీరాముని పట్ల, భద్రాచలం అర్చకులు, పాలనాధికారులు తీవ్రమైన నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వినిపించడంతో ప్రస్తుతం ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుందోనని భకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు
ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్టుగా సమాచారం. అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన ఇలాంటి విషయంలో ఇటు అర్చకులు, అటు అధికారులు మొండిగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్త రామదాసు భద్రాద్రిలో దేవాలయం నిర్మించిన దగ్గరి నుంచి సీతారాముల కళ్యాణం జరిపించడం ప్రతిఏటా అధికారిక కార్యక్రమంగా మారింది. పెళ్లయిన దంపతులు తప్పనిసరిగా సీతారాముల కళ్యాణం చూడడానికి ఉబలాటపడుతుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ఆధ్యాత్మికపరమైన కుట్రపూరిత దాడి
వాస్తవానికి సీతారామునికి.. భద్రాద్రి రాముడు.. చతుర్బుజ రాముడు.. వైకుంఠ రాముడు.. ఓంకార రాముడు.. రామనారాయణుడు అనే పేర్లు ఉండగా కేవలం ‘రామనారాయణ’ అనే శబ్దాన్నే ఉపయోగించడం వెనుక ఆధ్యాత్మికపరమైన కుట్రపూరిత దాడి ఉందన్నది భద్రాద్రి పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. ‘భద్రాద్రి రామనే వరాయ’ అని చెప్పాల్సిన చోట ‘రామనారాయణే వరాయ’ అని పలకడం పట్ల తమకు తీవ్రమైన అభ్యంతరం ఉందని భద్రాద్రి పరిరక్షణ సమితి పేర్కొంటుంది. రామచంద్రుడు అన్న పిలుపులో చంద్ర పదం శివగణానికి చెందినదని, అందుకోసమే ఈ పదానికి శైవాన్ని ఆపాదించడం సమంజసం కాదంటున్నారు. ఇలా వందల ఏళ్లుగా అందరి దేవుడిగా ఉన్న సీతారామచంద్రుణ్ని కొందరివాడిగా మార్చే ప్రయత్నాన్ని తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, దీనికోసం అటు చట్టపరంగానూ, ఇటు ప్రజా చైతన్యం ద్వారా ఎదుర్కొంటామని భద్రాద్రి పరిరక్షణ సమితి ప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ వేదపండితులు మాత్రం కావాలనే కొందరు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమని కొత్తగా దీనిని వివాదం చేయాలని చూస్తే ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.

Controversy Over Bhadradri Sita-Rama’s Surnames

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News