Home Default ఆ బొమ్మలు చెక్కాలని చెప్పలేదు

ఆ బొమ్మలు చెక్కాలని చెప్పలేదు

Yadadri-Temple

కెసిఆర్ దేవుడని భావించి శిల్పే చెక్కాడు
అభ్యంతరాలుంటే సిఎం బొమ్మను తీసేస్తాం
యాదాద్రిలో బొమ్మలపై వైటిడిఎ చైర్మన్ వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి ఆలయంలో ఫలానా బొమ్మలను చెక్కాలని శిల్పులకు ఎవ్వరూ చెప్పలేదని వైటిడిఎ వైస్ ఛైర్మెన్, ప్రత్యేకాధికారి కిషన్ రావు స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ కోసం కారు, ఆయన బొమ్మను చెక్కించామని చెప్పడం సరికాదన్నా రు. కెసిఆర్ బొమ్మ చెక్కడంపై ఎవరి ప్రోద్భలం లేదన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తప్పు అంటున్నారని, తమ స్థపతికి చాలా అనుభవం, అవగాహన ఉందన్నారు. బేగంపేటలోని హరితప్లాజాలో శుక్రవారం కిషన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఏ ఆలయం పైనైనా అప్పటి పరిస్థితులు ప్రతిబింబించే లా ప్రతిమలు చెక్కడం సహజమని తెలిపారు. అహోబిలం శిలలపై ఆ శిల్పి తల్లిదండ్రులతో పాటు గాంధీ, నెహ్రూ బొమ్మలు ఉన్నాయన్నారు. అభ్యంతరాలుంటే కెసిఆర్ బొమ్మ ను తీసేస్తామన్నారు. గుడిలో ఒక్క కారు చిహ్నం లేదని, అన్ని రకాల చిహ్నాలు ఉన్నాయని స్పష్టతనిచ్చా రు. కారు మాత్రమే కాదని, ఎడ్లబండి, సైకిల్, పద్మం కూడా ఉన్నాయన్నారు. ఆలయానికి వాస్తు ఉందా లేదా అని మాత్రమే చూస్తారన్నారు.

భవిష్యత్ తరాలకు ఇప్పటి పరిస్థితులు చూపించాలనే ఉద్దేశ్యం తోనే కొన్ని చిహ్నాలు శిల్పులు చెక్కారు. యాదాద్రి ఆలయానికి ఎంతో పవిత్రత ఉందని, ఆలయం త్వరగా పూర్తి చేయాలని శిల్పులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆలయ బొమ్మలపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. శిల్పులు తమకు స్ఫూర్తినిచ్చిన దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారని తెలిపారు. సప్త గోపురాలపై ఐదు వేల బొమ్మలుంటాయని తెలిపారు. ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కాదు. అన్ని దేవాలయాల కన్నా యాదాద్రికి మంచి పేరుందని, ప్రభుత్వం యజ్ఞంలా ఈ ఆలయాన్ని కట్టిస్తోందన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కృష్ణశిలలపై చెక్కిన బొమ్మలు చెక్కు చెదరవని వివరించారు. చరిత్రను తెలియజేసేందుకే ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్‌ను దేవుడిగా భావించిన శిల్పి హరిప్రసాద్ ఆయన ప్రతిమను చెక్కారని ఆనంద్‌సాయి తెలిపారు. కేవలం బాహ్య ప్రకారంలోనే ఈ బొమ్మలు ఉన్నాయన్నారు.

Controversy over Sculptures in Yadadri Temple