Home ఆదిలాబాద్ కూల్..కూల్… ‘కుంటాల’ పిలుస్తోంది..

కూల్..కూల్… ‘కుంటాల’ పిలుస్తోంది..

Kuntala-WaterFallsనేరడిగొండ : దట్టమైన అడవులు, కొండలు, లోయల మధ్య ఉన్న కుంటాల జలపాతం సందర్శకుల తాకిడితో కొత్త కళను సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతం రాష్టంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్దిల్లుతోంది. సహజంగా ఏర్పడిన ఈ జలపాతం ప్రకృతి ఇచ్చిన వరం. వర్షాకాలంలో కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది. చుట్టు పచ్చని అడవులు, జాలువారే నీటి అలలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కేరింతలు కొడుతూ ఆస్వాదించారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో ఉదయం నుంచే జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలున్నప్పటికీ.. దశాబ్ధాల నుండి తెలంగాణేతరుల పాలనలో అవి మరుగునపడ్డాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఎన్నో పర్యాటక ప్రదేశాలను గుర్తించి, తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా మరుగునపడ్డ పర్యాటక ప్రదేశాల్లో ప్రకృతి వరంగా ఏర్పడిన కుంటాల జలపాతం, అక్కడి ప్రకృతి అందాలు సందర్శకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి…

కుంటాల జలపాతం మరిన్నీ విశేషాలు  : 

kuntala-waterfallsకుంటాల జలపాతం సెలయేళ్లు 42 అడుగుల ఎత్తు ఉంటాయి. జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ జలపాతాన్ని దర్శించుకునేందుకు వస్తారు. దట్టమైన అడవుల్లో రెండు కొండల పై నుంచి ఈ జలపాతం పారుతుంది. పక్షుల కిలకిల రాగాలతో కూడిన ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. జలపాతంపై నుంచి నీరు కిందపడే చోట చిన్న రాతి గుహ ఉంటుంది. అందులో సోమేశ్వరుడు, నంది విగ్రహాలు ఉంటాయి. 10 మంది మాత్రమే ఈ గుహలోకి వెళ్లగలరు. జలపాతం దిగువన కుడి వైపు చెట్టు కింద కాకతీయుల నాటి దేవతాల విగ్రహాలు కనిపిస్తాయి.
గిరిపుత్రుల ఆరాధ్యదైవం..
సందర్శకులంతా కుంటాల జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగానే చూస్తారు. కానీ ఇక్కడి చుట్టుపక్కల ఉండే గిరిజనులు మాత్రం జలపాతాన్ని ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఆ కొండలపైన ఒక గూహలో శివలింగం ఉండడంతో అక్కడి నుండి పారే నీటిని సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావిస్తారు. దేవతల మొక్కులు, పండుగలు గిరిజనులు ప్రతి సంవత్సరం రెండు సార్లు పండుగలు జలపాతం వద్ద చేసుకుంటారు. దాదాపుగా అన్ని కాలల్లో ఈ జలపాతం వద్ద నీళ్లుండడంతో పండ్లు, ఇతర అటవీ సంపద ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణులు ఇక్కడికి వేసవిలో నీటి కోసం వస్తుంటాయి. ఇప్పటివరకు 50కిపైన సీరియళ్లు, 20పైగా సినిమాల్లోని సన్నివేశాలను, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. భారీ పెట్టుబడితో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి చిత్రం షూటింగ్ ఇక్కడ వారం రోజుల పాటు కొనసాగింది. హీరో రాణా, హీరోయిన్ అనుష్క, పలువురు, సినీ నటులు జలపాతం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇవి కుంటాల జలపాతం విశేషాలు… ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఈ జలపాతాన్ని సందర్శించి.. ఆ ఆనందాన్ని పొందడి..

Route Map : 

Route-Kuntala