Home తాజా వార్తలు ‘లోకల్ బ్రాండ్’గా సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్…

‘లోకల్ బ్రాండ్’గా సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్…

Hyderabad

 

మియాపూర్ : ‘లోకల్ బ్రాండ్’గా సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ దానకిషోర్ పేర్కొన్నారు. శనివారం మియాపూర్‌లోని ఎంఏనగర్‌ బస్తిలో ఆయన ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో స్వచ్చ భారత్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ నగర్‌లో ఓ లోకల్ బ్రాండ్‌గా సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్‌ను రూపొందిస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తను వేరు వేరు చేసి చెత్త ఆటోలో వేయడంపై, ప్లాస్టిక్ నివారణపై సంబంధిత ఎల్‌ఓలను, అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.

సాఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వివిధ సంస్థల నుంచి వాలంటీర్లుగా, ఎన్‌జీఓలుగా సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ కార్యక్రమంలో సుమారు 10వేల మందితో 3 నెలల పాటు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మంచి ఫలితాలు రావడంపై వారిని అభినందించారు. బస్తిలో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను ఆటోలో వేస్తున్నారా లేదా చెత్త ఆటో తరచుగా వస్తుందా, దోమల నివారణకై మందు జల్లుతున్నారా లేదా దానిపై గడప గడపుకు వెళ్ళడం వారి నుంచి మెరుగైన అవగాహన మాటలు వినడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇంకుడు గుంతల ఏర్పాటు, చెత్త ద్వారా కంపోస్ట్ పిట్‌లను పరిశీలించి దాని చుట్టు మొక్కలు నాటామన్నారు. ప్రతి కాలనీలోని తడి పొడి చెత్తను కాలనీలోనే కంపోస్ట్ పిట్ ద్వారా ఎరువు తయారు చేసుకునే ఏర్పాటు చేసుకోవాలని దాని ద్వారా జవహర్‌నగర్ లాంటి చెత్త డంపింగ్ కేంద్రాల అవసరమే ఉండదన్నారు. ఎంఏనగర్ బస్తి వాసుల కొరకు కమ్యూనిటి హాల్ నిర్మాణం కొరకు ఖాళీ స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. అనంతరం సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాస్టిక్ నివారణ అవగాహన కార్యక్రమాలు వారు చేపట్టిన జ్యూట్ బ్యాగుల తయారి, శిక్షణ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణి చేశారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ నివారణకై ప్రజల్లో భాగా చైతన్యం తీసుకురావాలని, వారాంతపు సంతలలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని వాలంటీర్లను కోరారు. చెత్త నిర్వహణ విధానాన్ని గడప గడపకు తీసుకువెళ్ళి ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నారు. సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ కార్యక్రమం జూలై నెలతో ముగుస్తుందన్నారు. దుర్గం చెరువును ప్రత్యేక టూరిజం ప్రాంతంగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నూతన బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఈ పర్యటనలో శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ హరిచందన, చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్ యాదగిరిరావు, వెటర్నరీ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ వకీల్, ప్రాజెక్టు అధికారిని వత్సలాదేవి, ఈఈ చిన్నారెడ్డి, డీఈలు బాలమురళీ, ఏఈలు రమేష్, ఆనంద్, అనురాగ్, ఏఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీనివాస్, హరి, టిపిఎస్‌లు, రెవెన్యూ అధికారులు రాజేశ్వర్‌రావు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల ఎన్జీవోలు, పారిశుధ్య కార్మికులు, బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Cooperate for Pure Hyderabad