Home జాతీయ వార్తలు అక్క మావోయిస్టు.. తమ్ముడు పోలీసు!

అక్క మావోయిస్టు.. తమ్ముడు పోలీసు!

maoist-sisterకొంట(ఛత్తీస్‌గఢ్): తమ్ముడు పోలీసు..అక్క మావోయిస్టు..అక్క లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసిపోవాలని తమ్ముడి ఆరాటం.. తమ్ముడిని తమ దారిలోకి తెచ్చుకోవాలని అక్క పోరాటం.. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటే పొరపడినట్లే. ఛత్తీసగఢ్‌లోని సుక్మా జిల్లాలో జరుగుతున్న యదార్థ సంఘటన. జులై 29వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో 140 మంది భద్రతా సిబ్బందితో కూడిన బృందం బలెన్‌టంగ్‌కు చెందిన అడవుల్లో మకాం వేసిన ఒక మావోయిస్టుల దళాన్ని చుట్టుముట్టింది.

భద్రతా బృందానికి సుక్మా పోలీసులకు చెందిన గోప్నియా సైనిక్(రహస్య పోలీస్) వెట్టి రామ నాయకత్వం వహిస్తున్నాడు. సిపిఐ(మావోయిస్టు) ఏరియా కమిటీ నాయకురాలు వెట్టి కన్ని, ఆమెకు చెందిన 30 మంది దళ సభ్యుల కోసం వారంతా వేటాడుతున్నారు. రామ, కన్ని ఎదురెదురు పడడంతోనే వారి కళ్లు పలకరించుకున్నాయి. అయితే ఇంతలో దళ సభ్యులు కాల్పులు ప్రారంభించడంతో రామకు చెందిన బృందం కూడా ఎదురుకాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించగా కన్ని మాత్రం సురక్షితంగా తప్పించుకుంది.

43 ఏళ్ల రామకు కన్ని(50) స్వయానా అక్క. ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడడం ఇది మొదటిసారి కాదు. ఆమెపై కాల్పులు జరపాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఆమె దళ సభ్యులు కాల్పులు ప్రారంభించడంతో నేను కూడా ఎదురుకాల్పులు జరపక తప్పలేదు. కాల్పులు జరుపుతున్న ఆమె హఠాత్తుగా అడవుల్లోకి మాయమైంది అన్నాడు రామ తన అక్కతో జరిగిన ఎన్‌కౌంటర్ గురించి.

కొంటలో సిపిఐ(మావోయిస్టు) ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న కన్ని తలపై రూ. 5లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల పొడియారో’ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న కన్ని అరెస్టయిన మావోయిస్టులకు న్యాయ సహాయం అందించడం, పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల కుటుంబాల పునరావాసాన్ని సమీక్షించడం ఆమె బాధ్యతలు.

తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న కొంట ఏరియా మావోయిస్టులకు చాలాకాలంగా కంచుకోటగా ఉంది. 1980వ దశకం మధ్యలో కొంటకు వచ్చిన మావోయిస్టులు క్రమంగా తమ బలాన్ని బస్తర్ ప్రాంతానికి వ్యాపించారు. కొంత ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు 60 చదరపు కిలోమీటర్లకు వ్యాపించి ఉంది. మొత్తం 116 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. మావోయిస్టుల సమాంతర ప్రభుత్వం జనతన సర్కార్ సుమారు 50 గ్రామాలలో ఇప్పటికీ చురుకుగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

గగన్‌పల్లి గ్రామానికి చెందిన రామ, కన్ని మరికొందరు యువజనులతో కలసి 1990 దశకం ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. మా గ్రామాలలోని పేదల కోసమే మావోయిస్టు ఉద్యమం ఉన్నదని చెప్పడంతో మేమిద్దరం బాల సంఘం(యువ దళం) చేరాము. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుత మావోయిస్టు ఉద్యమంలో అంకితభావం లేదు. అందుకే 2018లో లొంగిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ వెంటనే నాకు పోలీసుగా ఉద్యోగం వచ్చింది. మరి కొద్ది నెలల్లో నేను పోలీసు కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందుతాను.

ఇప్పటి వరకు భద్రతా దళాల తరఫున 10 భారీ ఆపరేషన్లు నిర్వహించాను అంటున్నాడు రామ. రహస్య పోలీస్(సీక్రెట్ ట్రూపర్) పోస్టును ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిని జిల్లా ఎస్‌పి నియమిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఈ ట్రూపర్లకు పోలీసు కానిస్టేబుల్‌గా ప్రమోషన్ లభిస్తుంది. లొంగిపోయిన తర్వాత తన సోదరిని కూడా లొంగిపోవాలని కోరుతూ రామ మూడు లేఖలు కన్నికి రాశాడు. అయితే రామను నమ్మకద్రోహిగా అభివర్ణిస్తూ కన్ని లేఖలతోనే జవాబిచ్చింది. లొంగిపోవాలని కోరుతూ నాకు ఇక లేఖలు రాయవద్దు.

పునరావాసమో లేక నష్టపరిహారమో పొందాలన్న ఆశ నాకు లేదు. నేనొక విప్లవ నాయకురాలిని&నిన్ను నువ్వు కాపాడుకోగలనని ఎన్నడూ అనుకోకు..నువొక నమ్మక ద్రోహివి అని తమ్ముడికి రాసిన లేఖలో కన్ని ఘాటుగా విమర్శించింది. పోలీసుల్లో చేరినప్పటి నుంచి నువ్వు ఎంతోమంది అమాయకులను అరెస్టు చేయడంలో, చిత్రహింసలకు గురిచేయడంలో, దళాల ఆచూకీని కనిపెట్టడంలో నిమగ్నమయ్యావని, దీన్ని బట్టే నీ దురుద్దేశం బయటపడుతోందని కూడా ఆమె తన లేఖలో పేర్కొంది.

కాగా, ప్రస్తుతం సుక్మలో పోలీసుల క్వార్టర్స్‌లో భార్యతో కలసి ఉంటున్న రామ మాత్రం తన సొంత అక్కను చంపడం తన వల్ల కాకపోవచ్చునని అంటున్నాడు. ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఆమె లొంగిపోవాలనే కోరుకుంటున్నాను. అయితే ఎన్‌కౌంటర్‌లో ఏదైనా జరగవచ్చు. అలా జరగకూడదని మాత్రం దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు రామ.

Cop brother hunts his maoist sister, Vetti Rama and Vetti Kanni are brother and sister who are encountering each other