Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో 34,000 కు పెరిగిన కరోనా కేసులు

అమెరికాలో 34,000 కు పెరిగిన కరోనా కేసులు

Corona cases

 

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 34,000 కు పెరిగింది. 400 కు పైగా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో వందమంది వరకు మరణించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటివద్ద ఉండాలని ఆంక్షలు విధించారు. వెబ్‌సైట్ వరల్డోమెటెర్ వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రానికి 33.546 కేసులు నమోదైనట్టు తేలింది. మరణాల సంఖ్య 419 వరకు పెరిగినట్టు వెల్లడించింది. రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ కరోనా పాజిటివ్ కు గురైనట్టు నిర్ధారణ కావడంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈలోగా శ్వేతసౌధంలో పాత్రికేయులతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మేజర్ కరోనా వైరస్ స్పాట్‌లుగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లను గుర్తించినట్టు చెప్పారు. కరోనా కేసుల సంఖ్యలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ 24 గంటల్లో తాజాగా 5418 కేసులు బయల్పడడంతో కేసుల సంఖ్య 15000 కు పెరిగింది. అలాగే మొత్తం 114 మంది అక్కడ చనిపోగా, వీరిలో 58 మంది ఒక్క రోజు లోనే చనిపోయారు.

న్యూయార్క్‌లో వైద్య సరఫరాల కొరత
అత్యవసర వైద్య సరఫరాల కొరత న్యూయార్క్ లో బాగా ఉందని మేయర్‌బిల్ డె బ్లాసియో చెప్పారు. మరో 10 రోజుల్లో ఎక్కువ వెంటిలేటర్లు అందక పోతే మరింత మంది చనిపోతారని ఆవేదన వెలిబుచ్చారు. శ్వేత భవనంలో ఉపాధ్యక్షుడు మైకె పెన్సె పాత్రికేయులతో మాట్లాడుతూ 2,50,000 మంది కన్నా ఎక్కువ మంది అమెరికన్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. న్యూయార్క్‌కు కావలసిన వైద్య సరఫరాలన్నీ అందిస్తామని ట్రంప్ చెప్పారు.

ప్రకృతి వైపరీత్య ప్రాంతాలుగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్
న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లను భారీ ప్రకృతి వైపరీత్య ప్రాంతాలుగా ప్రకటించారు. రెస్పిరేటర్లు, సర్జికల్ మాస్క్‌లు, గౌన్లు, ముఖ తొడుగులు, గ్లోవ్స్ ఇవన్నీ పెద్దమొత్తంలో ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసే పనిలో ఉన్నామని తెలిపారు. న్యూయార్క్‌లో వెయ్యి పడకలతో నాలుగు ఫెడరల్ మెడికల్ కేంద్రాలను, కాలిఫోర్నియాలో 2000 పడకలతో 8 ఫెడరల్ మెడికల్ కేంద్రాలను, వాషింగ్టన్‌లో వెయ్యి పడకలతో మూడు పెద్ద, నాలుగు చిన్న వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ఏజెన్సీని ఆదేశించినట్టు ట్రంప్ తెలిపారు. నేషనల్ గార్డులను న్యూయార్క్‌లో నియమించడానికి అంగీకరించారు.

48 గంటల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్‌లకు వైద్య సరఫరాలు అందుతాయని చెప్పారు. పది రోజుల పాటు రోజూ గంటసేపు పాత్రికేయ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. న్యూయార్క్, లాస్‌ఏంజెల్స్‌లలో వేలాది మందికి సర్జికల్ మాస్క్‌లు పంపిణీ చేయడానికి వీలుగా రెండు నేవీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వైరస్‌ను వేగంగా పరీక్షించడానికి కిట్లను భారీ ఎత్తున అందుబాటులో ఉంచుతామని అన్నారు. మనమంతా ఇప్పుడు యుద్ధంలో ఉన్నామని, కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నామని, నేను మీ అందరికీ అధ్యక్షునిగా ఉన్నంతకాలం మీరు ధైర్యంగా ఉంటారని నమ్మాల్సిందిగా ట్రంప్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో మనం దీనిపై విజయం సాధించ బోతున్నాం అని ఆయన ధైర్యం చెప్పారు.

 

Corona cases that have grown in America