Saturday, April 20, 2024

పోలీసులనూ వెంటాడుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -
Corona Chasing Telangana Police Department
పోలీస్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1600 మందికి కరోనా

హైదరాబాద్ : కోవిడ్ 19 వైరస్ నిర్మూలనలో 24 గంటలూ శ్రమిస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండటం వారికి, వారి కుటుంబాలకు, తోటి సిబ్బందికీ ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని పోలీసులే అత్యధికంగా కరోనా బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో సుమారు 1,600 మందికి పైగా అధికారులు, సిబ్బంది కోవిడ్ బారినపడ్డట్లు సమాచారం. ఇందులో సగానికిపైగా అంటే 800 మందికి పైగా గ్రేటర్ పోలీసులే కావడం గమనార్హం. గ్రేటర్ పోలీసులు కరోనా బారిన పడటంతో వారి తోటి సిబ్బంది కూడా క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది. దీంతో సిబ్బంది కూడా సెలవులు పెట్టాల్సి వస్తోంది.

ఫలితంగా కేసుల నమోదు, దర్యాప్తు, బందోబస్తు, గస్తీల విధుల భారం మిగిలిన వారిపై పడుతోంది. ఇటీవల బక్రీదును ఎలాగోలా నెట్టుకొచ్చినా.. ఈ ప్రభావం త్వరలో జరిగే స్వాతంత్య్ర వేడుకలపైనా పడేలా ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదిలావుండగా కరోనా నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు వైరస్ సోకకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు హెల్త్ డిఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టడంతో పాటు సిబ్బందికి ఉదయం, సాయంత్రం థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. విధి నిర్వహణకు ముందు, విధులు ముగిసిన తరువాత ఎప్పటికప్పుడు పోలీసులు తమ ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తొలుత నగరంలోని పోలీసు స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసులు అనతికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల ఏర్పాట్లును చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో నేరాల నియంత్రణ, పాత నేరస్తులను అరెస్ట్ చేయడం లాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, ఈక్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉదయం విధులకు హాజరైన సమయంలో, విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా శరీర ఉష్ణోగ్రతలు చెక్ చేసుకుని ఆ వివరాలను హెల్త్ డిఎస్‌ఆర్ యాప్‌లో పొందుపర్చాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా విధి నిర్వహణ, విధుల అనంతరం ఎవరికైనా జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు తదితర కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్త్ డిఆర్‌ఎస్ యాప్‌లో తెలియజేయాల వివరిస్తున్నారు. అదేవిధంగా హెల్త్ డిఆర్‌ఎస్ యాప్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచి విభాగం సిబ్బంది నిత్యం పరిశీలిస్తారు. అలాగే జిల్లాలోనూ జిల్లా ఎస్‌పి కేంద్రాలలోని సిబ్బందికి హెల్త్ డిఆర్‌ఎస్ యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు.

కాగా పోలీసులకు థర్మల్ స్క్రీనింగ్‌లో శరీరం ఉష్ణోగ్రతలు 100 సెల్సియస్ దాటితే వారిని వెంటనే వైద్య పరీక్షలకు తరలించాలని, ప్రస్తుతానికి నగరంలోని హోంగార్డు నుంచి పైస్థాయి అధికారులందరితో పాటు మినిస్ట్రీరియల్ స్టాఫ్‌కు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అనతికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

హోం క్వారంటైన్‌లో సీనియర్ ఐపిఎస్..

ఇటీవల అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందిన మహిళా భద్రతా విభాగం చీఫ్ స్వాతి లక్రా కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. తీవ్ర లక్షణాలు లేకపోవడంతో ఆమె ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నారు. పోలీస్ శాఖలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. బాచుపల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, బుధవారం రాత్రి ఆసిఫ్ నగర్  ఏఎస్ఐ  కరోనాతో మృతి చెందాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News