Friday, April 19, 2024

పరీక్షలపై కరోనా గ్రహణం

- Advertisement -
- Advertisement -

 Exams

 

మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్‌ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి నెలలో వివిధ వార్షిక పరీక్షలు, ఆ తర్వాత నెలలో ప్రవేశ పరీక్షలు జరుగుతుంటాయి. మార్చి నెలలోనే కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 4 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, ఆ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో అంతగా నమోదు కాకపోవడంతో ఆ పరీక్షలు సజావుగా ముగిశాయి.

ఈ నెల 19 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరిస్థితిని బట్టి పరీక్షల రీ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించనుంది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా పడగా, వివిధ వర్సిటీల సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

పలు రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండానే పైతరగతులకు
కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు పాఠశాలలను కొద్ది రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలల మూసివేతను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయనున్నట్టు యుపి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యే అవకాశం కల్పించింది.

అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలు రాయకుండానే పై తరగతులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు పాత మైసూరు ప్రాంతంలోని సిబిఎస్‌ఇ పాఠశాలల్లో ఈ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ధారించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గితే ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో మన రాష్ట్రంలో కూడా పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రవేశ పరీక్షలపై కూడా పడే అవకాశం
రాష్ట్రంలో వివిధ రకాల ప్రవేశ పరీక్షలపై కూడా కరోనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే రెండవ విడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) ఇప్పటికే వాయిదా పడింది. షెడ్యూల ప్రకారం జెఇఇ పరీక్షలు ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో నిర్వహించాల్సి ఉండగా, పరీక్షల తేదీల రీ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అలాగే రా్రష్ట్ర ఎంసెట్, ఇసెట్, లాసెట్, పిఇసెట్, పిజిఎల్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ పరీక్షల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని బట్టి సకాలంలో ప్రవేశ పరీక్షలు నిర్వహణపై ఆయా సెట్ల కన్వీనర్లు నిర్ణయం తీసుకోనున్నారు.

Corona effect on Exams
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News