Tuesday, April 23, 2024

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

- Advertisement -
- Advertisement -

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్

Registrations

 

మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోమవారం ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగలేదు. కొన్నిచోట్ల అరకొరగా జరిగినా అది కూడా అంతంత మాత్రమని తెలుస్తోంది. మాములు రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రోజుకు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2కోట్ల ఆదాయం మాత్రమే సమకూరినట్టుగా ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 40 డాక్యుమెంట్లు అయ్యే చోట సైతం రిజిస్ట్రేషన్‌లు జరగడం కొనమెరుపు. ఇప్పటికే మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపయే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి మరో రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని భావించిన ఈ శాఖ అంచనాలు ఈ నేపథ్యంలో తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నెమ్మదించాయి

ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నెమ్మదించినా రానున్న రోజుల్లో ఆ ప్రభావం రియల్‌ఎస్టేట్‌పై ఉండదని ఆరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జరిగే నష్టం ఏమిటంటే మహా అయితే నిర్మాణాలు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని రియల్‌రంగ నిపుణులు భావిస్తున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి వారం రోజులుగా మార్కెట్ కొంత స్థబ్తుగా ఉందని రానున్న రోజుల్లో రియల్‌రంగం యధావిధిగా నడుస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో మార్కెట్లు తెరుచుకోవడం లేదు

ప్రస్తుతం నిర్మాణ సంస్థలు చేపట్టే ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల్లో వినియోగించే కొన్ని వస్తువులు బాత్‌టబ్‌లు, సింకులు, కమోడ్‌లు, ట్రేళ్లు, ఫర్నీచర్ వంటివి అధిక శాతం వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వలన అక్కడి మార్కెట్లు తెరుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రియల్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులు చేసే భవన కార్మికులు పని లభించక పోవచ్చని ఈ సమస్య కూడా తాత్కాలికంగానే ఉంటుందని రియల్‌రంగం పేర్కొంటుంది. కరోనా వైరస్ వలన తాత్కాలికంగా కొనుగోళ్లు, అమ్మకాల్లో తగ్గుతాయని అంతకుమించి ఎక్కువగా ఇబ్బందులు ఉండవని, ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు సైతం రియల్‌రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

రియల్‌రంగమే ప్రత్నామ్యాయం

కరోనా ఎఫెక్ట్‌తో నెలలో స్టాక్‌మార్కెట్ దాదాపు పదివేల పాయింట్ల దాకా కోల్పోయింది. 1.5 ట్రిలియన్ డాలర్ల మేరకు మదుపరుల సంపద ఆవిరయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం, కరోనావైరస్, ఇలా పలు కారణాలతో సామాన్యుల నుంచి అపర కుబేరుల దాకా దారుణంగా నష్టపోయారు. సెస్సెక్స్ అంటేనే భయపడే స్థాయికి చేరుకున్నారు. మరి పెట్టుబడి పెట్టాలనుకునే మధ్యతరగతి వేతన జీవులు స్టాక్ మార్కెట్ కాకుండా ఇతర పెట్టుబడి మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వారికి రియల్ రంగం ప్రత్నామ్యాయంగా మారిందని, కరోనా ఎఫెక్ట్ అనందరం అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనే అవకాశం ఉందని రియల్‌రంగం నిపుణులు పేర్కొంటున్నారు.

రియల్‌రంగం ఒకేసారి కుప్పకూలదు

ప్లాట్లు అయినా అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు అయినా కొనుగోలు చేయడానికి ఇంతకుమించిన తరుణం లేదన్న వాదన స్టాక్ మార్కెట్ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ఆకాశన్నంటిన బంగారాన్ని సామాన్యులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలన్న వారి చూపు సైతం రియల్‌రంగంపై పడింది. స్టాక్ మార్కెట్ తరహాలో రియల్‌రంగం ఒకేసారి కుప్పకూలదని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైననా తట్టుకొని నిలబడుతుందని రియల్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా రియల్‌రంగంపై ఎలాంటి ప్రభావం చూపదు

క్రెడాయ్, హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయమే మంచిదే. దీనివల్ల రియల్‌రంగపై ఎలాంటి ప్రభావం పడదు. లాక్‌డౌన్ ఉన్నన్నీ రోజులు అమ్మకాలు, కొనుగోళ్లు జరగకపోవచ్చు, కానీ రియల్‌రంగం దీనివల్ల నష్టపోయే అవకాశం ఏమీ లేదు. ఇప్పటికే ప్రభుత్వం రియల్‌రంగానికి అనేక రకాలుగా చేయూతనిస్తుంది. హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి చేస్తూ రియల్‌వర్గాలతో పాటు ప్రజలకు నమ్మకం కలిగించింది. అందుకే ఎక్కడ మాంద్యం ఏర్పడినా రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి. అందరూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News