Wednesday, April 24, 2024

క్రికెట్‌పై కరోనా పిడుగు!

- Advertisement -
- Advertisement -

Corona

 

ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. అంతేగా, ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్‌ను రద్దు చేయక తప్పలేదు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌ల నిర్వహణ కూడా కష్టంగా మారింది. ఇక, కరోనా నేపథ్యంలో భారత్ వేదికగా జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నీని కూడా బిసిసిఐ నిరవధికంగా వాయిదా వేసింది. కాగా, కరోనా భూతం ప్రభావం క్రికెట్‌పై కూడా బాగానే పడింది. కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ సిరీస్‌లు, లీగ్‌లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. పలు దేశాల్లో డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలను రద్దు చేశారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఈ ఏడాది జరగాల్సిన పలు దేశవాళి క్రికెట్ టోర్నీలను అర్ధాంతరంగా నిలిపి వేశారు.

పలు టోర్నీలను వాయిదా వేయడం జరిగింది. పరిస్థితులను గమనిస్తే ఈ ఏడాది క్రికెట్ సిరీస్‌లు కూడా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. భారత్‌దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాన్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌లను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీని కూడా కరోనా వల్ల మధ్యలోనే నిలిపి వేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా తీవ్రంగా ఉంది. ఆయా దేశాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది.

వరల్డ్‌కప్ కష్టమే?
ఇక, కరోనా మహమ్మరి తగ్గక పోతే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కూడా కరోనా తీవ్రంగానే ఉంది. వరల్డ్‌కప్‌కు మరి కొన్ని నెలల సమయం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు ముందుకు వస్తుందా అనేది సందేహమే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విదేశీయుల రాకపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కరోనా తగ్గక పోతే ప్రభుత్వం ఆంక్షలు తొలగించే ప్రసక్తే ఉండదు. అదే జరిగితే ప్రపంచకప్ జరగడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి.

టెస్టు ఛాంపియన్‌షిప్‌పై కూడా..
ఇదిలావుండగా కరోనా వైరస్ దెబ్బకు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశాలు సన్నగిల్లాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ను రద్దు చేయడం తప్ప ఐసిసికి మరో మార్గం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే పలు సిరీస్‌లు జరగాల్సి ఉంది. కానీ, పరిస్థితులు మాత్రం సిరీస్‌లు జరిగేందుకు అనుకూలంగా లేవు. ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో జరిగే పలు క్రీడలను ఇప్పటికే రద్దు చేశారు. ఇక, కరోనా భయంతో పలు దేశాలు విదేశీయుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇది కూడా టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఈ టోర్నీని ఐసిసి మధ్యలోనే ఆపేసినా ఆశ్చర్యం లేదు.

వేచి చూడక తప్పదు
మరోవైపు ప్రస్తుతం కరోనా సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్రికెట్ టోర్నీలు, సిరీస్‌ల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మాములు వాతావరణం నెలకొనే వరకు ఎక్కడి సిరీస్‌లు అక్కడే నిలిచి పోవడం తథ్యం. ఇప్పటికే చాలా సిరీస్‌లు మధ్యలోనే ఆగి పోయాయి. ఇక, కొన్ని టోర్నీలను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని వాయిదా వేశారు. అంతేగాక ఐసిసి ఆధ్వర్యంలో జరిగే ప్రపంచకప్ అర్హత పోటీలు కూడా నిలిచి పోయాయి. మాములు పరిస్థితులు నెలకొనెంత వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉండడం ఖాయం.

Corona effect on Sports
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News