Thursday, March 28, 2024

ప్రపంచమంతా కరోనా భయం

- Advertisement -
- Advertisement -

Corona

 

106కు చేరిన మృతులు

న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా ఇతర దేశాలకు చెందిన వారు కూడా అత్యధిక సంఖ్యలో ఈ వైరస్ ప్రభావిత చైనా ప్రాంతాలలో ఉండటంతో ఆయా ప్రభుత్వాలు కూడా తమ వారిని తిరిగి రప్పించేందుకు చర్యలు ఆరంభించాయి. దీని కోసం చైనా అధికార యంత్రాంగం సాయం తీసుకొంటోంది. పలు ప్రాంతాలలోని అంతర్జాతీయ విమానాశ్రయాలలో విమాన ప్రయాణికుల రాగానే వారిని అత్యవసర ప్రాతిపదికన వైద్య స్కానింగ్‌లకు గురి చేస్తున్నారు. వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకున్న తరువాతనే వారిని వెలుపలికి అనుమతిస్తున్నారు. శారీరకంగా సున్నితమైన రోగనిరోధక శక్తి ఉండే వారికి ఇతరుల ద్వారా ఈ వైరస్ సోకుతున్నట్లు స్పష్టం అయింది. శ్వాస కోశానికి సంబంధించిన జబ్బుకు ఈ వైరస్ కారకం కావడంతో ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం అవుతుంది.

భారతీయులకు ఏర్పాట్లు : విదేశాంగ శాఖ
చైనాలో ఈ వైరస్ తీవ్రత నేపథ్యంలో అక్కడి భారతీయులను తిరిగి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అన్ని యత్నాలు చేపట్టింది. మంగళవారం మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ విలేకరులతో ఈ విషయం గురించి మాట్లాడారు. తాము ఎప్పటికప్పుడు బీజింగ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం, చైనా ప్రభుత్వం అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. వైరస్ ప్రభావిత వూహాన్ పరిసరాలలో 700 మంది భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. వీరిలో చాలా మంది సెలవులపై భారత్‌కు తిరిగివచ్చారు.

అయితే ఇంకా 300 మంది విద్యార్థులు అక్కడనే ఉన్నట్లు తెలియడంతో వారిని తిరిగి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు ఈ విషయం గురించి తెలియచేస్తామని వివరించారు. సోమవారం నుంచి ఇప్పటివరకూ ఇండియాకు వచ్చిన దాదాపు 40000 మంది ప్రయాణికులకు విమానాశ్రయాలలో విస్తృత వైద్య స్క్రీనింగ్‌లు చేపట్టారు. వైరస్ పట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతన అధికారుల స్థాయి సమావేశం జరిగింది. ఇప్పటికే ఈ వైరస్ ఎల్లలు దాటి కెనడా, అమెరికా, జర్మనీ, శ్రీలంకలకు చేరింది.

ఎయిరిండియా జంబో సిద్ధం
చైనాలోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన 423 సీట్ల జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచింది. ఈ విమానం ముంబై విమానాశ్రయంలో ఎప్పుడైనా వెళ్లడానికి సిద్ధం అయింది. విదేశాంగ, ఆరోగ్య మంత్రిత్వశాఖల నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రత్యేక విమానం చైనాకు వెళ్లుతుంది. అక్కడున్న భారతీయులను ఇండియాకు తీసుకువస్తుందని అధికారులు ముంబైలో తెలిపారు. 250 మంది భారతీయ ప్రయాణికులు ఎక్కువగా విద్యార్థులు చైనాలో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపడ్డట్లు తెలియడంతో ఎయిరిండియా బోయింగ్ 747 సిద్ధం అయి ఉంది.

ఢిల్లీలో ముగ్గురికి కరోనా ?
తాజాగా ముగ్గురు భారతీయులు ఈ వైరస్ లక్షణాలతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. వీరికి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షీ భరద్వాజ్ తెలిపారు. 24 నుంచి 48 మధ్య వయస్కులైన వీరు పురుషులు. వీరికి అన్ని రకాల పరీక్షల తరువాత అబ్జర్వేషన్‌లో ఉంచారని కూడా మీనాక్షీ వెల్లడించారు. తరచూ చైనాకు వెళ్లుతూ వస్తూ ఉండే వీరిని విడిగా ఉంచి అన్ని విధాలుగా పరీక్షలు జరుపుతున్నారు. దగ్గు జ్వరం జలుబులతో బాధపడుతూ ఉన్నారు. చాలాకాలంగా దగ్గు జ్వరం జలుబు ఉన్నట్లు అయితే వెంటనే ఈ వైరస్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే భారత్‌లో కరోనా వ్యాధి నిర్థారణ ఏదీ జరగలేదని, కేవలం అనుమానాలతోనే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మొత్తం 450 మందిని దేశంలో వివిధ చోట్ల ఆసుపత్రులలో వైద్య పరిశీలనలో ఉంచారు. వీరిలో అత్యధిక సంఖ్యలో కేరళవారు ఉన్నారు. ఇక చైనా నుంచి ఇటీవలి కాలంలో ఇండియాకు వచ్చిన వారు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రులలో చేరుతున్నారు. గాలి, నీరు, ఆహారం ఇతరత్రా ఈ వైరస్ సోకే అవకాశం ఉండటంతో ఇది త్వరితగతిన వ్యాపిస్తుందని, నిర్థిష్టమైన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి రైల్వే స్టేషన్లు, జాతరలు ఇతర జనసమూహ ప్రాంతాలలో ఎవరికి వారుగా ఆరోగ్య మెళకువలు పాటించాలని తెలిపారు.

చైనాలో 106కు చేరిన మృతుల సంఖ్య
చైనాలో ఈ వైరస్ ప్రభావంతో మృతుల సంఖ్య ఇప్పటికీ 106కు చేరింది. మరో వైపు 1300 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. దీనితో పలు ప్రాంతాలలో అత్యవసర ప్రాతిపదికన వైద్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2019ఎన్‌కావ్
సరికొత్త న్యూమోనియాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కరోనాను అధికారికంగా వైద్యపరిభాషలో 2019 ఎన్‌సిఒవిగా పేర్కొన్నారు. చైనాలోని వూహాన్, హూబీ ప్రాంతాలలోని 17 నగరాలలో ఈ వైరస్ అంటుకుంది. ఈ ప్రాంతంలోనే అత్యధికులు దీనితో మృతి చెందారు.

2వేల మంది పాక్ విద్యార్థుల విలవిల
చైనాలోని వూహాన్‌లో 2000 మంది పాకిస్థాన్ విద్యార్థులు ఈ వైరస్ భయంతో వణికిపోతున్నారు. తమను త్వరితగతిన వెనకకు రప్పించాలని, రక్షించాలని విద్యార్థులు తమ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చైనాలోని ఇతర దేశాల విద్యార్థులను ఆయా దేశాల వారు వెంటనే రప్పించుకుంటున్నారని, ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం కూడా దిశలో చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు.

Corona fear all over the world
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News