Wednesday, April 24, 2024

నేవీలో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

 Indian Navy

 

పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్‌వే 4,291 కేసులు
భారత్‌లో మరణాల రేటు 3.3 శాతం
మృతుల్లో 75శాతం 60 ఏళ్ల పైబడినవారే
ఢిల్లీలో ఒకే ఇంట్లో 31 మందికి వైరస్

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత నౌకాదళంలోకీ పాకింది. ముంబయిలోని పశ్చిమ నౌకాదళ స్థావరంలో దాదాపు 26 మంది నౌకాదళ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వీరంతా ‘ఐఎన్‌ఎస్ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిని ముంబయిలోని ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్విని నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. భారత నేవీలో కరోనా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఆ చుట్టుపక్కల విధులు నిర్వర్తిస్తున్న సైనికుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో 25 మంది ఐఎన్‌ఎస్ యాంగ్రీ కాంప్లెక్స్‌లోని సింగిల్‌రూమ్ వసతి ఉండే బిల్డ్డింగ్‌లోను, బారక్స్‌లోను ఉంటున్నారని, ఒకరు మాత్రం తన తల్లితో కలిసి ఉంటున్నటు ్లఅధికార వర్గాలు తెలిపాయి.

అతని తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ వర్గాలు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్‌కు విషయాన్ని వివరించినట్లు, వారు పరిస్థితిపై ఓ కన్నేసి ఉంచినట్లు కూడాఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ నేవీలలోను వ్యాపించింది. ఇప్పటికే అమెరికాకు చెందిన అణు సామర్థం కలిగిన ‘ థియోడర్ రూజ్‌వెల్ట్’ విమాన వాహక నౌకలో 600 మందికి వైరస్ సోకింది. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన విమాన వాహక నౌకలోను 1081 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ తరుణంలో నేవీలోను కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

మరణాల రేటు 3.3 శాతం
ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని,43 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 14,792కు, మరణాల సంఖ్య 488కు చేరుకున్నట్లు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో4,291 కేసులు తబ్లిగి జమాత్ సంఘటనతో ముడిపడినవని లవ్ అగర్వాల్ చెప్పారు.

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 1992 మంది కోలుకున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం కేసుల్లో ఇది 13.85 శాతమని చెప్పారు. దేశంలో కరోనా మరణాల రేటు 3.3 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు మరణించిన వారిలో వయసుల వారీగా చూసినట్లయితే 0 45 మధ్య వయసు వారు 14.4 శాతం ఉన్నారని చెప్పారు.అలాగే 45 60 వయసు మధ్య వారు 10.3 శాతం మంది, 60 75 మధ్య వయసు వారు 33.1 శాతం మంది, 75 ఏళ్ల పైబడిన వారు 42.2 శాతం మంది ఉన్నారని చెప్పారు.

కరోనాతో పంజాబ్‌లో ఎసిపి మృతి
పంజాబ్‌లోని లూధియానా ఎసిపి అనిల్ కోహ్లి కరోనా వైరస్ సోకి మృతి చెందడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆయనకు వైరస్ లక్షణాలు కనిపించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. ఈ క్రమంలోనే లూధియానాలోని ఎస్‌పిఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఆయనకు ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి సంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఆస్పత్రికి అనుమతి కూడా ఇచ్చింది. ఈలోగానే ఆయన కన్నుమూశారు.

ఢిల్లీలో ఒకే ఇంట్లో 31 మందికి వైరస్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహామ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో ఒకే కుటుంబంలోని 31 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. దీంతో ఆ ప్రాంతం ఇప్పుడు కంటైన్‌మెంట్ జోన్‌లో ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు నగరంలో 71 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలన లెక్క చేయకుండా బైటికి వస్తున్నారన్నారు.

మహారాష్ట్రలో ఒక్క రోజే 328 కేసులు
కరోనా విసిరిన పంజాకు మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండడంతో వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. శనివారం ఒక్క రోజే రాష్ట్రంలో 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీటిలో ఒక్క ముంబయి మహానగరంలోనే 184 కేసులు ఉండడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.

 

Corona In the Indian Navy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News