Wednesday, April 24, 2024

కరోనాలో చదువులు

- Advertisement -
- Advertisement -

Corona outbreak impact on Education

 

భారతావని భవిష్యత్తు బడి చదువుల బాగోగులపైనే ఆధారపడి ఉంటుందనేది ఎదురులేని వాస్తవం. ఏ సమాజం పురోగతినైనా అక్కడి బాలలకు అందే విద్యా బుద్ధులే నిర్ధారిస్తాయన్నది జగమెరిగిన సత్యం. ప్రథమ్ సంస్థ 2020 సంవత్సరానికి నిర్వహించిన వార్షిక విద్యా స్థాయి సర్వే నివేదిక (అసర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు) దేశంలో 5 నుంచి 16 సంవత్సరాల ఈడు పిల్లల చదువులపై ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించింది. కరోనా కారణంగా మాసాల తరబడిగా పాఠశాలలు మూతపడిపోయి తరగతి గది బోధనకు పిల్లలు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బడి చదువులు ఎలా సాగాయన్న దానిపై అసర్ సర్వే దృష్టి కేంద్రీకరించింది. ఈ నివేదిక తమ సంతానం చదువుల పట్ల తలిదండ్రులకున్న శ్రద్ధను గురించిన హర్షణీయ కోణాన్ని బయటపెట్టడంతో పాటు పట్టణ, గ్రామీణ, ధనిక, పేద, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడాలు అసాధారణ స్థాయిలో గల మన దేశంలో ఇంకా పూడ్చవలసి ఉన్న లోటుపాట్లను కూడా ఎత్తి చూపింది. 26 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 52,227 ఇళ్లలోని 59,251 మంది పిల్లలపై సెప్టెంబర్ నెలలో ఈ సర్వే జరిగింది.

ప్రథమ్ సంస్థ మొట్టమొదటి సారిగా ఫోన్ ద్వారా సర్వేని నిర్వహించింది. ఇందులో రెండు ప్రధాన అంశాలు కొట్టవచ్చినట్టు కనిపించాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక గణనీయంగా పెరగడం మొదటి విశేషమైతే, ఇంటర్ నెట్ ద్వారా ఇంటి నుంచే చదువుకోడానికి తోడ్పడిన నాణ్యమైన నాజూకు ఫోన్ల (స్మార్ట్ ఫోన్లు) కొనుగోలు, వినియోగం అధికం కావడం మరో గమనార్హమైన అంశం. 2018తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో బాలల చేరిక 62.4 శాతం నుంచి 66.4 శాతానికి వృద్ధి చెందింది. అలాగే బాలికల చేరిక కూడా 70 నుంచి 73 శాతానికి చేరుకున్నది. దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో ప్రైవేటు పాఠశాలలు విశేషంగా వెలిశాయి. వీధికి ఒకటి కంటే ఎక్కువగా నెలకొన్నాయి. ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు తగ్గడానికి కరోనా వల్ల అవి మూతపడడం ఒక కారణం కాగా, ఆ పాఠశాలల ఫీజుల భారాన్ని తట్టుకునే స్తోమత కోల్పోయిన కింది తరగతుల తలిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించడం మరో హేతువని బోధపడుతున్నది. ప్రైవేటు రంగాన్ని ఎంత ప్రోత్సహించినా ఇలాంటి జాతీయ విపత్తుల్లో అది అక్కరకు రాదనే సంగతి మరోసారి రుజువైంది.

అయితే ఉన్నత ప్రమాణాల విద్యనందించే లక్షణాన్ని ప్రభుత్వ పాఠశాలలు మరింతగా సమకూర్చుకోవలసి ఉంది. ప్రైవేటురంగ హితులుగా పేరొందిన ప్రస్తుత పాలకులు ప్రభుత్వ బడులను సమర్థవంతంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. ఈ ఏడాదిలో బడుల్లో చేరని పిల్లల సంఖ్య బాగా పెరిగింది. 2018లో 4 శాతం మంది పిల్లలు బడి వయసులో బయట ఉండగా, 2020 21 విద్యా సంవత్సరంలో అది 5.5 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా 6 10 సంవత్సరాల వయసులోని పిల్లలు బడిలో చేరకపోడం ఎక్కువగా నమోదయింది. 2018లో ఈ వయసులోని 1.8 శాతం పిల్లలు బడికి దూరంగా ఉండగా, అది ఈ ఏడాది 5.3 శాతంగా ఉంది. కరోనా లాక్‌డౌన్ వల్ల తలిదండ్రుల ఉద్యోగాలకు, ఉపాధి పనులకు తగిలిన దెబ్బ ఇందులో ప్రతిబింబించింది అనుకోవాలి. ఆన్‌లైన్‌లో చదువుకోవలసిన అవసరం రీత్యా బడి పిల్లలున్న కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరగడం హర్షించవలసిన పరిణామం. రెండేళ్ల క్రితం 36.5 శాతం బడి బాలలకు మాత్రమే ఇంట్లో స్మార్ట్‌ఫోన్లుండగా, ఈ ఏడాది ఇది 61.8 శాతానికి పెరిగింది.

అయితే మూడింట ఒక వంతు మంది పిల్లలకే ఉపాధ్యాయుల నుంచి బోధన, అధ్యయన సామగ్రి అందినట్లు వెల్లడి కావడం ఆందోళనకరం. పిల్లలకు ఈ సామగ్రిని ఇవ్వడంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు బడులదే పైచేయిగా ఉంది. పిల్లలకు పాఠశాలల నుంచి అధ్యయనాంశాలను చేరవేయడంలో వాట్సాప్ సౌకర్యం బాగా ఉపయోగపడింది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న బాలలలో 56 శాతం మందికే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండగా, ప్రైవేటు స్కూళ్ల పిల్లల్లో 74.2 శాతం మంది వాటిని కలిగి ఉన్నారు. అన్నింటికీ మించి ఇంటి వద్ద బాలలకు చదువుల్లో చేయూతనివ్వడంలో తలిదండ్రులు, తోడబుట్టిన వారు విశేషంగా తోడ్పడినట్టు నిగ్గు తేలిన విషయం అత్యంత ఆహ్లాదకరమైనది. ఇందులో తలిదండ్రుల విద్యా స్థాయి గణనీయమైన ప్రభావం చూపింది. తల్లులు కూడా విద్యావంతులైన కుటుంబాల్లో ఈ ప్రోత్సాహం ఎక్కువగా లభించడం సహజమే. ఈ నివేదికాంశాలను ఆధారం చేసుకొని ప్రభుత్వాలు పేద పిల్లలు, గ్రామీణ విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అనేక విధాలుగా మెరుగుపరచి ప్రైవేటు బడుల కంటే ఒక మెట్టు పై స్థాయిలో ఉంచడానికి కృషి చేయవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News