Wednesday, April 17, 2024

సంపాదకీయం: సామాజిక సుదూరం!

- Advertisement -
- Advertisement -

Corona patient relation with public మనుషులందరినీ సమానులుగా, సాటివారుగా చూసే విశాల దృష్టి దేశంలో ఎన్నడూ లేదు. కుల వ్యవస్థ దేశ ప్రజల మధ్య దుర్భేద్యమైన గోడలు నిర్మించింది. కొన్ని కులాలకు ఉచ్ఛతను, మరి కొన్నింటికి నైచ్యాన్ని ఆపాదించి ఒకరినొకరు కలవనీయకుండా, హృదయపూర్వక ఐక్యతతో మెలగనీయకుండా చేసింది. కంచం పొత్తు, మంచం పొత్తులను నిషేధించింది. కొన్ని కులాలను వెలి వేసి అంటరానితనమనే దుర్మార్గపు ఆచారాన్ని నెలకొల్పింది. స్త్రీ పురుషుల మధ్య కూడా పరిమిత అస్పృశ్యత ఉండేది. ఆ విధంగా దేశంలో సామాజిక అగాధాలు ఏనాటి నుంచో ఉన్నాయి. వీటి నుంచి అంచెలంచెలుగా బయటపడుతూ అభ్యుదయ మార్గం పడుతున్న సమయంలో ఇప్పుడు కరోనా మన దేశంలో సరికొత్త సామాజిక దూరాలు, అంటరానితనాలను సృష్టించింది. దశాబ్దాలుగా ఒకేచోట వరసలు పెట్టుకుని మరీ పిలుచుకుంటూ నివసిస్తున్నవారు, సొంత కుటుంబీకులు, బంధువులు కూడా దరిచేరనివ్వని స్థితిని వైరస్ బాధితులకు కలిగించింది.

దూరాల నుంచే కాకుండా ఇరుగుపొరుగునున్న ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి కూడా రాకపోకలు బందైపోడం సరే, కరోనా నుంచి బాగుపడిన వారైతే తమ ఇంటిలో తిరిగి అడుగుపెట్టలేకపోతున్నారు. తమ ఆవాస ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు. అందుచేత కరోనా లక్షణాలు కనిపించిన వారు ఆ విషయాన్ని బయటికి చెప్పుకోడానికి జంకుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతున్నారు. కరోనా వచ్చి చనిపోయిన వారి మృత దేహాలకు దహన సంస్కారాలు జరగడం గగనమైపోతున్నది. వాటిని వారి సొంత కుటుంబాలకు అందజేయడానికి ఆయా గ్రామాలకు అంబులెన్సులో తీసుకెళితే ఊరివారు కలిసి కట్టుగా అడ్డుకుంటున్నారు. గుండె జబ్బుల వంటి ఇతర వ్యాధులతో చనిపోయిన వారివి కూడా కరోనా చావులుగా అనుమానిస్తూ వారి మృత దేహాలను ఊరిలోకి తీసుకురానివ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో హృద్రోగంతో మరణించిన 50 ఏళ్ల ఒక ప్రభుత్యోద్యోగి మృత దేహాన్ని రెండు గ్రామాల వారు అడ్డుకున్నారన్న సమాచారం విషాద దిగ్భ్రాంతులను కలిగించేదిగా ఉన్నది. ఇటు సొంత ఊరువారు, అటు అత్తవారి గ్రామం వారు కూడా అనుమతించలేదట.

అది కరోనా మృతి కాదని వివరించి నచ్చజెప్పడంతో చివరికి ఆ వ్యక్తి అంత్యక్రియలకు అంగీకరించారని సమాచారం. ఇలాంటి వార్తలు చదువుతుంటే సమాజం అంటే భీతికలగడం సహజం. తీవ్ర ఆయాసంతో మరణించిన మరో 61 ఏళ్ల వృద్ధుడి మృత దేహానికి పట్టుబట్టి కరోనా పరీక్షలు జరిపించారట. అందులో పాజిటివ్ బయటపడగా ఖననం చేసేందుకు వీలు లేదని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఒక కాలనీ వాసులు రెండు సార్లు అడ్డుకోగా రెండు రోజుల పాటు మృత దేహాన్ని ఇంటి ముందే ఫ్రీజర్‌లో ఉంచారట. ఇటువంటి ఉదంతాలు చూస్తుంటే సామాజికులమనే స్పృహను మనం కోల్పోతున్న దుస్థితి కళ్లకు కడుతుంది. పుట్టుకప్పుడు, పెళ్లప్పుడు, చావు సమయంలోనూ పరస్పరం సహకరించుకొని ఒకరికి పది మందిగా ఉండే గొప్ప సంప్రదాయాన్ని గాలికి వదిలి ప్రాణ భీతితోనే కావచ్చు, ఇంత కఠినాత్ములంగా పారిపోడం బాధాకరం. హైదరాబాద్ మహానగరంలోనే చాలా మంది సామాజిక భయంతో కరోనా వచ్చిందని బయటికి చెప్పుకోలేక, లోపల ఉంచుకోలేక, కరోనా కిట్లను ఇంటికి తెచ్చుకోలేక అరకొర వైద్యంతో రోజులు వెళ్లదీస్తున్నారని వార్తలు చెబుతున్నాయి.

హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి ఇళ్లకు నిత్యావసరాలను కూడా అడ్డుకుంటున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. మునిసిపల్ సిబ్బంది అటువంటి ఇళ్లకు బోర్డులు పెడుతుండడంతో భయం ఇంకా వ్యాపిస్తున్నది. కరోనా పై ఆదినుంచి జరిగిన ప్రచారంతో అది మహా మహమ్మారి అని, అది వచ్చిన వారి గాలి సోకినా దాని బారినపడి చనిపోడం ఖాయమనే అభిప్రాయం ఏర్పడింది. అదే ఈ భయోత్పాతానికి, విపరీత సామాజిక పోకడలకు కారణమవుతున్నది. కరోనా వ్యాపించిన వారికి అవసరమైన కనీస సాయాలను దూరం నుంచైనా అందుబాటులో ఉంచడం మావన ధర్మమనే స్పృహను చంపేస్తున్నది. వైరస్ సోకిన వారందరూ చనిపోవడం లేదు. సగం మందైనా మృత్యువాత పడడం లేదు. 85 శాతం మందిలో వైరస్ తోక ముడుస్తున్నది. అన్ని చోట్లా చాలా మంది బాధితులు తిరిగి కోలుకుంటున్నారు. కేవలం కొద్దిపాటి భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోడం చేస్తే వైరస్ సోకే అవకాశాలుండవు. దీనిని గమనించకుండా కరోనా వచ్చినవారిని, ఆ ఇంటిని పూర్తిగా వెలి వేయడం, శ్మశానంలో అంత్యక్రియలకు కూడా అనుమతించకపోడం ఎంత మాత్రం తగదు. తాము తగు జాగ్రత్తలు తీసుకుంటూనే బాధితులకు అండగా నిలవడం, ప్రతి ఒక్కరి కర్తవ్యం. అది మానవ సామాజిక పరంపరను నిలబెడుతుంది. మానవాళి మనుగడకు, ప్రగతికి తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News