Home తాజా వార్తలు పాజిటివ్ సంకేతం

పాజిటివ్ సంకేతం

Corona positive rate comes down in July

 

జూన్ మాసంతో పోలిస్తే జులైలో సగానికి పడిపోయిన కరోనా పాజిటివ్‌ల శాతం

అప్పుడు 100 పరీక్షల్లో 25మందికి వైరస్, ఇప్పుడు 100 టెస్టుల్లో 10మందికే
సత్వర చికిత్సతోనే సత్ఫలితాలు : నిపుణులు
ఎన్ని కేసులొచ్చినా ఎదుర్కొంటాం : వైద్యశాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాజిటివ్ రేట్ తగ్గుతోంది. జూన్ కంటే జూలై నెలలో పాజిటివిటి సగానికి పడిపోయినట్లు ఆరోగ్యశాఖ లెక్క లు చెబుతున్నాయి. జూన్‌లో ప్రతి వందలో సగటున 25 మందికి వైరస్ సోకగా, జూలై చివరి వరకు ప్రతి వందలో 8 మందికి మాత్రమే నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఈ నెలలో ఇప్పటి వరకు ప్రతి వందలో పది మందికి మాత్రమే కోవిడ్ తేలుతోంది. జూన్ 20వ తేది నుంచి 30 వరకు రాష్ట్రంలో 37,994 మందికి టెస్టులు చేయగా, 9813 మందికి వైరస్ తేలింది.

అంటే పాజిటివ్ రేట్ సగటున 25.82గా నమోదైంది. అదే విధంగా జూలై 20వ తేది నుంచి 31 వరకు 1,89,606 మందికి టెస్టులు చేయగా, 14,851 మందిలో వైరస్ సోకింది. దీంతో పాజిటివ్ రేట్ సగటున 7.83గా నమోదు కాగా, ఈనెల 1వ తేదిన 9.84 శాతం, 2న 10.40 శాతం చొప్పున నమోదైనట్లు వైద్యశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం జూన్ కంటే జూలైలో కేసులు తీవ్రత తగ్గిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వేగవంతమైన ట్రిపుల్ టి తోనే ఇది సాధ్యమైంది
రాష్ట్రంలో ట్రీపుల్ టి విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వలనే వైరస్ లోడ్‌ను కంట్రోల్ చేయగలిగామని వైద్యశాఖ చెబుతోంది. లాక్‌డౌన్ సమయంలో చికిత్స సౌకర్యాలను సమర్చుకొని టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్మెంట్‌ను స్పీడ్‌గా అమలు చేయడం వలనే జూలై నెలలో కేసులు తీవ్రత తగ్గిందని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా టెస్టింగ్ కెపాసిటీని పెంచడం వలనే వైరస్ వ్యాప్తిని వేగంగా అంచనా వేయగలిగామని ఆయన తెలిపారు. ప్రతి పిహెచ్‌సి స్థాయిలో అనుమానితులకు టెస్టులు చేస్తూ, పాజిటివ్ తేలిన వాళ్లకి వేగంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలతో వైద్యం అందించడమే కాకుండా, పేషెంట్లలో ఇమ్యూనిటీ పెంచేందుకు అద్బుతమైన డైట్‌కు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమారు 5వేల మంది రోగులను కాపాడామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 84 శాతం అసింప్టమాటిక్ పెషెంట్లనూ మానిటరింగ్ చేస్తూ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నామన్నారు.అంతేగాక పాజిటివ్ రోగులు అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ చేసి 15 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోంటాం… వైద్యశాఖ
ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ కంట్రోల్‌లోనే ఉన్నప్పటికీ, ఈనెల రెండవ వారం నుంచి సెప్టెంబర్ వరకు వైరస్ లోడ్ పతాక స్థాయిలోకి వెళ్తుందని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు చెబుతున్న మాట. ఇప్పటికే 33 జిల్లాల్లో 20 శాతం మండలాలకు వైరస్ వ్యాపించగా, ఈనెల 2వ వారం నుంచి సెప్టెంబర్ నెల వరకు మరో 30 శాతం జిల్లాలకు వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే గ్రామ స్థాయిలోనూ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి పిహెచ్‌సిలో యాంటీజెన్ టెస్టులతో పాటు యాంటీవైరల్‌డ్రగ్స్‌ను కూడా పంపించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పాటు ఐసొలేషన్ సౌకర్యాలు లేని వారికి ఆయా మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్‌లలో సౌకర్యాలను కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. దీంతో పాటు ప్రతి గ్రామంలో జ్వరపీడితులను గుర్తించేందుకు ఆర్‌ఎంపి, పిఎంపి ప్రతినిధుల సేవలను కూడా వైద్యశాఖ తీసుకోనుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రజలంతా మరో నెల రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Corona positive rate comes down in July