Home తాజా వార్తలు ఎంఎల్‌ఎ బిగాలకు కరోనా

ఎంఎల్‌ఎ బిగాలకు కరోనా

Corona Positive to Nizamabad Urban MLA Ganesh Gupta

 

హోంక్వారంటైన్‌లో ముత్తిరెడ్డి, ఆసుపత్రిలో బాజిరెడ్డి
రాష్ట్రంలో 5వేలు దాటిన కేసుల సంఖ్య, కొత్తగా 219 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి, పెట్లబురుజు ఆసుపత్రిలో 32 మంది వైద్యసిబ్బందికి వైరస్
మెదక్ జిల్లాలో తొలి కరోనా మరణం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. సోమవారం నిజమాబాద్ అర్బన్ శాసనసభ్యుడు గణేష్‌గుప్తాకు కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలు ఉండటంతో టె స్టులు చేయగా పాజిటివ్ తేలినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్డన్‌తో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రం లో కరోనా బారిన పడ్డ శాసనసభ్యుల సంఖ్య 3కి పెరిగింది. అయితే వరుసగా ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇటీవల నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు కూడా భయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉండగా కొత్తగా 219 కేసులు నమోదు కా గా, ఇద్దరు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 189 ఉండగా, జిల్లాల్లో 30 మందికి వైరస్ సోకినట్లు బులెటెన్‌లో పేర్కొన్నారు. చనిపోయిన వారి వివరాలను మాత్రం ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య5193కి చేరగా, వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 4744 ఉండగా, వేరే ప్రాంతాల వచ్చిన వారు449 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2766 ఉండగా, ప్రస్తుతం 2240 మంది రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకు చికిత్స పొందుతున్నారు. అదే విధంగా వైరస్ భారిన పడి ఇప్పటి వరకు 187 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

అయితే సోమవారం వైరస్ సోకిన వారిలో సచివాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి కూడా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా మెదక్ జిల్లాల్లో తొలి కరోనా మరణం సంభవించింది. తూప్రాన్‌కి చెందిన లక్ష్మణ్ రావు అనే వ్యాపారి మరణించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయిందని, హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు వెల్లడించారు. అయితే అంత్యక్రియలను జిహెచ్‌ఎంసి టీం నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు భారత్ నగర్ మార్కెట్ లో కూరగాయలు అమ్మే 34 ఏళ్ల యువకుడు కరోన మహమ్మారితో మరణించినట్లు అధికారులు చెప్పారు. అయితే వైరస్ లక్షణాలు లేకుండా ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పాజిటివ్ తేలడంతో ఆయనను హోంకోరంటైన్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

పేట్ల బురుజు ఆసుపత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి కరోనా
ప్లేట్లబురుజు ఆసుపత్రిలో 32 మంది వైద్యసిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 14 మంది డాక్టర్లు 18 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే .ఒకే ఆసుపత్రిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా రావడం ఇదే మొదటిసారి

శాలిబండ సూరజ్బాన్ ఆసుపత్రిలో గర్బిణీకి కరోనా
శాలిబండ సూరజ్బాన్ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న బాలింతకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేపింది. పాతబస్తీ హఫీజ్ బాబానగర్‌కు చెందిన ఓ మహిళ ఈనెల 9వ తేదిన శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు పోస్ట్ ఆపరేటివ్ వార్డులో చికిత్స అందిస్తుండగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ తేలినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు చెందిన అధికారులు ఆమెకు వైద్య సేవలు నిర్వహించిన 5 మంది వైద్యులు, 5గురు నర్సులకు కరోనా టెస్టులు నిర్వహించారు. వీటి ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ వార్డులో మరో మరో పది మంది బాలింతలు వైద్యసేవలు పొందుతున్నట్లు సమాచారం.