Thursday, April 25, 2024

మెట్రోరైళ్లు బస్సుల క్లీనింగ్

- Advertisement -
- Advertisement -

RTC and Metro

 

కెటిఆర్ ట్వీట్‌తో కదిలిన ఎల్ &టి, ఆర్‌టిసి

ఆర్‌టిసి, మెట్రో అధికారులకు ట్విట్టర్ ద్వారా కరోనా నివారణపై కెటిఆర్ సూచనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్‌కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కె.టి.రామారావు రంగంలోకి దిగారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా నేపథ్యంలో బస్సులన్నింటినీ కడిగి శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేసి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచనలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మెట్రో, ఆర్‌టిసి అధికారులకు సైతం ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. “బెంగుళూరు తరహాలో సత్వరమే చర్యలను చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్‌అండ్‌టి ఎండిలను అభ్యర్థిస్తున్నా అని పేర్కొన్నారు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఆర్‌టిసిలో సైతం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా” అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

ఆర్‌టిసి, మెట్రోలో ముందస్తు నివారణ చర్యలు
కరోనా వైరస్‌పై మంత్రి కెటిఆర్ సూచనల మేరకు ఆర్‌టిసి బస్సులు, బస్ స్టేషన్లు, మెట్రో రైళ్లు, మెట్రో స్టేషన్లలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. బుధవారం ఆర్‌టిసి బస్సులు, బస్ స్టేషన్లలో కెమికల్, ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్‌తో బస్సు లోపల, బయట(ప్రయాణికులు ఉపయోగించే డోర్ హ్యాండిల్, ఆర్మ్ రెస్ట్ ఇన్పైడ్, బస్సు ఫ్లోర్) కార్మికులతో శుభ్రపరిచారు. అలాగే బస్ స్టేషన్లలోని బెంచీలు, కుర్చీలను కూడా శుభ్రపరిచారు. ప్రయాణికులు ఎవరూ ఆర్‌టిసి బస్సులలో ప్రయాణించేందుకు ఎలాంటి అపోహలకు గురికావద్దని అధికారులు తెలిపారు.

అలాగే మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి మెట్రోరైళ్లు డిపోకు చేరుకున్న తర్వాత రైలును స్టెరిలైజ్ చేసి, అధికారి ధృవీకరించిన తర్వాతనే ట్రాక్‌పైకి పంపిస్తున్నామని పేర్కొంటున్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లు, చేతులు తగిలే ఉపరితల ప్రాంతాలు, ఎస్కలేటర్లు, హ్యాండ్ రైల్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని, మెట్రో డిపోకు చేరాక సబ్బు, డిటర్జెంట్లతో కడుగుతున్నామని చెబుతున్నారు. ప్రయాణికులను అప్రమత్తం చేసేలా త్వరలోనే మైకులో ప్రకటనలు, చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Corona Preventive measures in RTC and Metro
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News