Home తాజా వార్తలు జిల్లాల్లోనూ వైద్యం

జిల్లాల్లోనూ వైద్యం

 700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
 రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
 అన్ని రకాల మందులు పంపిస్తాం
 మల్లారెడ్డి, మమత, కామినేని
 మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
 జిహెచ్‌ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
 ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరగదు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ఇబ్బందులు కలుగకుండా కోవిడ్ చికిత్సను డీ సెంట్రలైజ్ చేశామని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి. శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీంతో భాగ్యనగరంలో ఉన్న ఆసుపత్రులపై భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రులతో పాటు, జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రులలో కూడా కరోనా వైద్యం కొరకు అన్ని సౌకర్యాలను సమకూర్చామని అన్నారు. అయితే రాష్ట్రంలో వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈక్రమంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించడం మేలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని వివరించేందుకు కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా డిహెచ్ డా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చాలా మంది వేగంగా కోలుకుంటున్నారని, ఇప్పటి వరకు రాష్ట్రంలో రికవరీ రేట్ సగటున 65.48కి పెరిగిందని తెలిపారు.
మల్లారెడ్డి, మమత, కామినేనిలో ఉచిత వైద్యం..
రాష్ట్రంలో కరోనా వైద్యం విస్తరణ భాగంగా 22 మెడికల్ కాలేజీలను తమ ఆధీనంలోకి తీసుకోని వైద్య సేవలు అందిస్తున్నట్లు డిహెచ్ డాశ్రీనివాసరావు తెలిపారు. అయితే తొలి విడతగా మల్లారెడ్డి, మమత, కామినేని కాలేజీలకు అనుసంధానంగా ఉన్న ఆసుపత్రుల్లో కరోనాకి ఉచిత వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న కాలేజీల్లో అతి త్వరలోనే వైద్యసేవలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ సందేహాలుపై 104,108లను సంప్రదించాలి…
కోవిడ్‌పై ఎలాంటి సందేహాలున్న 104, 108 కాల్‌సెంటర్స్‌ను సంప్రదించాలని డిహెచ్ డా శ్రీనివాసరావు తెలిపారు. అయితే కరోనా వైద్య వివరాలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు 104కు ఫోన్ చేయాలన్నారు. అదే విధంగా అత్యవసర సేవలు, అంబులెన్స్‌ల కొరకు 108కి కాల్ చేసి అధికారులను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్లను తరలించేందుకు 90 ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో 60 జిహెచ్‌ఎంసి పరిధిలోనే తిరుగుతున్నాయని ఆయన వివరించారు.
హోం ఐసోలేషన్ వారిపై ప్రత్యేక నిఘా…
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 10వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డా శ్రీనివాసరావు తెలిపారు. అయితే వీరికి ప్రత్యేక మెడిసిన్ కిట్లు ఇచ్చి, కాల్స్ సెంటర్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. హోం ఐసోలేషన్‌లో సమస్యలు తలెత్తితే 180059912345 నంబరును సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్లకు శ్వాస సమస్యలు లేకుంటే ఇంట్లో నుంచే ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆయన సూచించారు. దీంతో పాటు సదరు రోగులు రోగనిరోదక శక్తిని పెంపొందించే ఆహారం అధికంగా తీసుకోవాలని అన్నారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో 98 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం…
కరోనా వైద్యం అందించేందుకు జిహెచ్‌ఎంసి పరిధిలో 98 ప్రైవేట్ , కార్పొరేట్ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా శ్రీనివాసరావు తెలిపారు. ఈ హాస్పిటల్స్ అన్ని ఐసిఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్సను అందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాల్లోనూ రోగులను అడ్మిట్ చేస్తున్నాంః డిఎంఇ రమేష్‌రెడ్డి
కరోనా సోకిన వాళ్లకు జిల్లా ఏరియా ఆసుపత్రిల్లోనూ అడ్మిట్ చేసుకుంటున్నామని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం ఐసోలేట్ మాత్రమే చేశామని, ఇక నుంచి జిల్లాల్లోనూ కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ, ఆయా పరిధిలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలను సమకూర్చామని ఆయన అన్నారు. దీని కోసం 700 వెంటిలేటర్స్‌ను కూడా తెప్పించామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పాజిటివ్ వస్తే ఎక్కడికి వెళ్లాలని గందరగోళం పడాల్సిన అవసరం లేదని తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్ వస్తే తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్లు గాంధీకి, మథ్యస్థంగా ఉంటే కింగ్‌కోఠిలో అడ్మిట్ కావాలని డా రమేష్‌రెడ్డి మరోసారి సూచించారు. అయితే లక్షణాలు లేకుండా, స్పల్ప తీవ్రతతో పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటమే బెటర్ అని ఆయన తెలిపారు. ఇంట్లో సౌకర్యం లేకపోతే నేచర్ క్యూర్ ఆయుర్వేద ఆసుపత్రులలో అడ్మిట్ కావాలని తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో సరోజని దేవి, చార్మినార్ ఏరియా, రామంతాపూర్ హోమియో ఆసుపత్రుల్లోనూ క్వారంటైన్ సెంటర్లు పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోవిడ్‌తో పాటు ఇతర రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉన్నందున వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని డిఎంఇ తెలిపారు. ఈమేరకు అన్ని నియమ నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
టిమ్స్‌లో ఐ.పి ప్రారంభం..
టిమ్స్ హాస్పిటల్‌లో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఓపి సేవలు కొనసాగుతుండగా, తాజాగా కోవిడ్ రోగులను ఇన్‌పేషెంట్లు వార్డులో చేర్చుకుంటున్నామని డిఎంఇ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం ఓ మహిళ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి టిమ్స్‌లో చేరినట్లు సమాచారం. టిమ్స్ ఇన్‌వార్డులో చేరిన తొలి పేషెంట్ కూడా ఈమె కావడం గమనార్హం.
ప్లాస్మాథెరఫీ అందరికీ అవసరం లేదు…
ప్లాస్మాథెరఫీ చికిత్స అందరికీ అవసరం లేదని డిఎంఇ డా రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. వైద్యనిపుణులు సలహా మేరకు మాత్రమే అది చేయాల్సిన అవసరం వస్తుందని ఆయన తెలిపారు. ఈ చికిత్సను ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం చేయాలన్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అన్యాయం జరగదు…
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అన్యాయం జరగదని డిఎంఇ డా రమేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే వారి డిమాండ్లపై మంత్రి సానుకూలంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో అవి నెరవేరతాయని ఆయన అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో విధులు బహిష్కరించడం సబబు కాదని చెప్పారు. ప్రజల ఆరోగ్య మేలు కోరి వెంటనే విధులకు హజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల్లో అన్ని రకాల డ్రగ్స్…
రాష్ట్రంలో కోవిడ్ చికిత్స నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రులకు రెండు రోజుల్లో అన్ని రకాల మందులను అందుబాటులోకి తెస్తున్నామని డిఎంఇ తెలిపారు. కొత్త మందుల కోస కూడా ఆర్డర్ పెట్టామని ఆయన స్పష్టం చేశారు.

corona Recovery rate is 65.48 in Telangana