Home జాతీయ వార్తలు కరోనాతో బెంబేలెత్తుతున్న మహా పోలీసులు

కరోనాతో బెంబేలెత్తుతున్న మహా పోలీసులు

Corona Serious Effect On Maharashtra Policeముంబయి : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు ఈ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి కరోనాతో పోరాడుతున్న పోలీసులను కరోనా బెంబేలెత్తిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 9,566 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వారిలో 98 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉండగా, 8578 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనాతో 103 మంది పోలీసులు చనిపోయారు. 7534 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1929 మంది పోలీసులు వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా చాలా మంది ప్రజలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.  మార్చి 22 నుంచి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన 2,19,975 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులపై దాడులు చేసిన 883 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కరోనాతో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి విధిగా సహకరించాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలని , లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.