Wednesday, April 24, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిబంధనల కఠినతరం

- Advertisement -
- Advertisement -

డిసిపి నేతృత్వంలో జిఎంఆర్ సిబ్బందికి శిక్షణ
ఇకపై ఉల్లంఘనుల పనిపట్టనున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది

Corona strict rules at Shamshabad airport

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరోనా మొదటి, రెండవ వేవ్‌లో ఇప్పటి వరకు పలుమార్లు శంషాబాద్ సివిల్ పోలీసులు ఎయిర్ పోర్టు లోపల జరుగుతున్న కరోనా నిబంధనల ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ఇప్పటి వరకు శంషాబాద్ పోలీసుల సహకారంతో కరోనా నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకున్న యాజమాన్యం వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో ఉల్లంఘనదారులను నిలువరించే అధికారం జిఎంఆర్ యాజమాన్యానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. పోలీసులకు ఉండే అధికారాలను తమకు బదలాయించినట్లయితే కొవిడ్ నిబంధనలు అమలుకు తాము ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

అయితే తమ సిబ్బందికి ఉల్లంఘనలను ఎలా గుర్తించాలి? ఏ విధంగా ఫొటోలు తీసి చట్ట ప్రకారం జరిమానా విధించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలని కోరింది. ప్రత్యేకంగా 20 మంది ఎయిర్ పోర్టు సిబ్బందిని కరోనా నిబంధనల విధులు అప్పగించనున్నామని సదరు యాజమాన్యం విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేకంగా 20 మందిని ఏర్పాటు చేసుకోడానికి అనుమతినివ్వడంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బందికి కరోనా నిబంధనలపై అవగాహన, ఉల్లంఘనులను గుర్తించే అంశాలపై శిక్షణ ఇవ్వాలని పోలీసుశాఖకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా పోలీసు చలానా వెబ్‌సైట్ వీరికి అందుబాటులోకి తీసుకురావాలని ఆ ఆదేశాలలో పేర్కొంది. ఇక ఎయిర్‌పోర్టు ఆవరణలో, లోపల కొవిడ్ నిబంధనలలో ప్రధానంగా మాస్కు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించని వారిని గుర్తించేలా జిఎంఆర్ సూచించిన 20 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దీంతో ఆయా సిబ్బందికి శంషాబాద్ డిసిపి ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో శిక్షణ సైతం మొదలైంది. జిఎంఆర్ సిబ్బందికి కరోనా నిబంధనలు ఉల్లంఘించేవారిని గుర్తించడంతో పాటు జరిమానాలు ఎలా విధించాలన్న అంశాలపై శిక్షణ పూర్తి అయిన అనంతరం పోలీసు చలానా వెబ్‌సైట్ వారికి అందుబాటులోకి తెస్తామని డిసిపి ప్రకాశ్ రెడ్డి వివరించారు. జిఎంఆర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వల్ల తమ సిబ్బంది ఎయిర్ పోర్టులో, పరిసర ప్రాంతాల్లో ఉల్లంఘనలపై ఇకపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఇకనుంచి ఎయిర్‌పోర్ట్ ఆవరణంలో కరోనా నిబంధనలు పాటించనివారిని తక్షణమే గుర్తించి ఉల్లంఘనదారులకు జిఎంఆర్ నియమించిన సిబ్బంది జరిమానా విధించనున్న్తారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృ్ధతి అధికంగా ఉండడం వల్ల కొవిడ్ నిబంధనలు కఠినతరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు యాజమాన్యం వివరించింది. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాలు యథావిధిగా తిరుగుతున్న క్రమంలో ఎయిర్ పోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారు అధికం కావడం వల్లే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, తమ సిబ్బందికి శిక్షణ పూర్తికాగానే ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని ఎయిర్‌పోర్ట్ జిఎంఆర్ యాజమాన్యం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News