Tuesday, April 23, 2024

ఇక థర్డ్‌వేవ్ మొదలు!

- Advertisement -
- Advertisement -

Corona third wave starts in August

ఈ నెలలో ప్రారంభమై అక్టోబర్ నాటికి పరాకాష్టకు
హైదరాబాద్, కాన్పూర్ ఐఐటి నిపుణుల అధ్యయన నివేదిక

న్యూఢిల్లీ : కరోనా రెండో దశ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌పై నిపుణులు అంచనా వేశారు. ఆగస్ట్ లోనే థర్డ్ వేవ్ ప్రారంభమై అక్టోబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. హైదరాబాద్, కాన్పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ప్రొఫెసర్లు మతుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ నేతృత్వం లోని పరిశోధక బృందం కరోనా కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కు దారి తీస్తుందని తెలియచేసింది. ప్రస్తుతం కేరళ,మహారాష్ట్రతోపాటు అత్యధిక కొవిడ్ కేసులున్న రాష్ట్రాలను చూస్తే ఈ పరిస్థితిని అంచనా వేయవచ్చని ప్రొఫెసర్ విద్యాసాగర్ బ్లూమ్‌బర్గ్‌కు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మేథమెటికల్ మోడల్ ప్రకారం థర్డ్‌వేవ్‌పై అంచనా వేశారు. భారత్‌లో మొదటి వేవ్, రెండో వేవ్ ఏ స్థాయిలో వచ్చాయి? ఆ రెండింటి మధ్య ఎంత సమయం ? ఈ విధంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి థర్డ్ వేవ్‌పై అంచనాలు రూపొందించారు.

మొదటి వేవ్ తరువాత అక్టోబర్, నవంబర్ మధ్య కొవిడ్ నియంత్రణ నియమాలు పాటించక పోవడంతో ఈ ఏడాది మేలో భారీగా కేసులు పెరిగాయి. ప్రతిరోజు వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మే 7న దేశంలో సెకండ్ వేవ్‌లో అత్యధికంగా 4,14,188 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ఉధృతి కాస్త తగ్గింది. మూడోవేవ్‌లో అత్యధికంగా ఒక్క రోజులో లక్ష కంటే తక్కువ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్ఠంగా 1,50,000 వరకు ఉండవచ్చని అంటున్నారు.

అయితే మేథమెటికల్ మోడల్ ప్రకారం దేశంలో టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని, హాట్‌స్పాట్ లలో ట్రాకింగ్ పద్ధతులు అమలు చేయాలని, కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందున జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పది రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. పదిశాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశంలో సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. థర్డ్ వేవ్‌కు అదే వేరియంట్ కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 132 దేశాలకు డెల్టా వేరియంట్ విస్తరించగా, అమెరికా, జపాన్, మలేసియాతోపాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News