Thursday, March 28, 2024

ఫిబ్రవరిలో డౌన్

- Advertisement -
- Advertisement -

Corona to final stage by February if proper precautions are taken

జనాభాలో 30% మందిలో యాంటీబాడీలు వృద్ధి
శీతాకాలం, పండుగ సీజన్‌లో మాస్క్‌లు, శానిటైజేషన్ తప్పనిసరి
ఓనం ఫెస్టివల్‌లో నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది
స్థానిక స్థాయిలో తాజా లాక్‌డౌన్‌లు వద్దు
కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచనలు
శీతాకాలంలో
రెండో దశ ముప్పు
నీతిఆయోగ్ సభ్యులు, కొవిడ్ జాతీయ
నిపుణుల సమన్వయ కమిటీ చీఫ్ వికె పాల్ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తీవ్రత గరిష్ఠ స్థాయి దాటి పోయిందని, పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ఫిబ్రవరి నాటికి చివరి దశకు చేరుకోవచ్చని అలాగే నియంత్రించ వచ్చని కొవిడ్ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. మార్చిలో లాక్‌డౌన్ విధించకుంటే ఆగస్టు వరకు కేసుల సంఖ్య 25 లక్షలకు దాటి ఉండేదని పేర్కొంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నుంచి బయటపడి కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ అవసరమైతే తీవ్రత ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ అమలు చేయాలని సూచించింది. కరోనాకు సంబంధించిన అనేక కీలక విషయాలను కమిటీ వెల్లడించింది.లాక్‌డౌన్ సడలింపు వల్ల సెప్టెంబర్‌లో కేసులు గరిష్ఠ స్థాయిలో పెరిగాయనడం కారణం కాకపోయినప్పటికీ వేరే కారణాల వల్ల కేసులు బాగా పెరిగాయని వెల్లడించింది. దేశ జనాభాలో అప్పటికే 30 శాతం మందికి యాంటీబాడీలు వృద్ధి చెందాయంటే వారందరికీ వైరస్ సోకిందని అర్థం చేసుకోవలసి ఉంటుందని కమిటీ వివరించింది. ఆగస్టు చివరి నాటికి 14 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెంది ఉంటాయని అంచనా వేసింది. అంతకు ముందు ఐసిఎంఆర్ నిర్వహించన సర్వే కన్నా రెండోసారి జాతీయ సీరో సర్వేఅధ్యయనంలో కేసుల సంఖ్య రెట్టింపు అయినట్టు తేలిందని కమిటీ వివరించింది.

ఐఐటి, ఐసిఎంఆర్ సభ్యులతో కొవిడ్19 భారత్ సూపర్ మోడల్ పేరుతో కేంద్రం సూచనలపై డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేలో ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. రానున్నది శీతాకాలం,పండగల సీజన్ కాబట్టి, మాస్క్‌లు, శానిటైజేషన్ తదితర నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఈ సందర్భంగా కేరళలో ఆగస్టులో నిర్వహించిన ఓనం పండగను ఉదహరించింది. ఆ పండగ సందర్భంగా జనం గుంపులు గుంపులుగా చేరడం వల్లనే ఒకేసారి సెప్టెంబర్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని గమనించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 66 లక్షల వరకు సింప్టమెటిక్ కేసులు పెరిగినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ సంఖ్య ఇంకా 106 లక్షలకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

లాక్‌డౌన్ ప్రభావం

లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో, ఒక వేళ అమలు చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఏర్పడి ఉండేవో కమిటీ వివరించింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు లాక్‌డౌన్ అమలు లేకున్నట్టయితే జూన్‌లో కేసులు 14 రెట్లు పెరిగి ఉండేవని కమిటీ విశ్లేషించింది. లాక్‌డౌన్ అమలులో రెండు నెలలు ఆలస్యం చేసి ఉంటే వాస్తవ పరిస్థితి కన్నా కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి ఇంకా చేరుకుని లాక్‌డౌన్ లేనట్టి పరిస్థితిని కల్పించేదని ప్రొఫెసర్ విద్యాసాగర్ అభిప్రాయ పడ్డారు. లాక్‌డౌన్ అమలు చేయడంతో ఆ గరిష్ఠ స్థాయిని జూన్ నెలాఖరు నుంచి సెప్టెంబర్‌కు నెట్టివేయడమైందని సరిగ్గా కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వీలయిందని ఆయన వివరించారు. ఈ కమిటీ కరోనా వ్యాప్తి , లాక్‌డౌన్ ప్రభావం, వలసలు, లాక్‌డౌన్ అమలు ఫలితాలు, అమలు లేకుంటే వచ్చేపరిణామాలు, ఇవన్నీ విశ్లేషించి వాస్తవ గణాంకాల ఆధారంగా అధ్యయన నివేదిక తయారు చేసింది. అధ్యయన ప్రాథమిక వివరాలు ఇప్పుడు వెల్లడించింది. పూర్తి వివరాలు వచ్చే వారం జర్నల్‌లో వెల్లడిస్తుంది.

స్థానిక స్థాయిలో తాజా లాక్‌డౌన్లు వద్దు

చేయరాదని కేంద్ర ప్రభుత్వ నియామక కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచించింది. వ్యక్తిగత ఆరోగ్యభద్రతా నిబంధనలు తప్పనిసరి అని పూర్తిగా వీటిని పాటించాలని సూచించింది. రద్దీని నివారించాలని, ముఖ్యంగా మూసి ఉంచిన ప్రదేశాలలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పిల్లలు ఆరోగ్యభద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొంది. ఇతర వ్యాధులు ఉన్న వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

శీతాకాలంలో మళ్లీ కరోనా ముప్పు

గత మూడు వారాలుగా కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నిదానంగా ఉన్నా శీతాకాలంలో కరోనా ముప్పు వచ్చే పరిస్థితిని కాదనలేమని నీతి అయోగ్ సభ్యుడు, కరోనా వ్యాక్సిన్ నిర్వహణ జాతీయ నిపుణుల సమన్వయ కమిటీ (ఎన్‌ఇజివిఎసి) ఛీఫ్ వికె పాల్ హెచ్చరించారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో , మూడు నుంచి నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని, ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన వివరించారు. ఉత్తరాదిలో శీతాకాలంలో ఎదురయ్యే కాలుష్యం, పండగల సీజన్ కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు సంబంధించి కోల్డ్ స్టోరేజి గురించి ప్రశ్నించగా, దేశంలో తగినంత కోల్డ్ స్టోరేజి సౌకర్యాలు ఉన్నాయని, అవసరాలకు తగినట్టు సిద్ధంగా ప్రస్తుతం ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News