Home Default లక్షలు అక్కర్లేదు

లక్షలు అక్కర్లేదు

Corona treatment does not exceed Rs 10,000

 

కరోనా చికిత్స ఖర్చు రూ.10వేలు మించదు
లక్ష, రెండు లక్షల రూపాయల చికిత్సే ఉండదు అధికంగా వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవు
ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్, 10వ తేదీలోగా అందుబాటులోకి తెస్తాం
టిమ్స్‌లో 1350 బెడ్ల సౌకర్యం నిర్లక్షం చేయడం వల్లే వైరస్ తీవ్రత పెరుగుతోంది… అలాంటి వారిని రక్షించడం కష్టతరమవుతోంది
గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించిన అనంతరం మంత్రి ఈటల
సిబ్బందిని సమకూరుస్తామని హామీ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు కేవలం పది వేల రూపాయ లు మాత్రమే అవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆక్సిజన్, మందులన్నీ కలిపితే కూడా పదివేలకు మించదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేదని ఆయన చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా వసూళ్లు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి మరోసారి హెచ్చరించారు. కరోనా సోకిన రోగులంతా ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స పొందాలని,అనవసరంగా ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ఆయన విన్నపించారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం గాంధీ కోవిడ్ నోడల్ కేంద్రంగా సేవలందిస్తుండగా, టిమ్స్ లో కూడా అదే తరహాలో 1350 బెడ్లతో ఐసియూ, వెంటిలేటర్లతో కూడిన సౌకర్యాలను కల్పించామని తెలిపారు. కోవిడ్ రోగులకు మందుల కంటే ఆక్సిజన్ అత్యవసరం కా వున ఈనెల 10వ తేది లోపు టిమ్స్‌తో పాటు సరోజిని, కిం గ్‌కోఠి, ఫీవర్, చెస్ట్, ఉస్మానియా ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్నప్పటికీ రోగులకు ఇబ్బందులు ఉండవని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని, చికిత్స సౌకర్యాలను స్వయం గా పరిశీలించేందుకు మంత్రి ఆదివారం గచ్చిబౌలి టిమ్స్ ను సందర్శించారు.

పాజిటివ్ పేషెంట్లను, వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భ రోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడు తూ.. కొందరి నిర్లక్షం వలనే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలు తేలినా చాలా మం ది హాస్పిటల్‌కు వెళ్లడం లేదని, ఆక్సిజన్ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి కూడా పెరుగుతుందని తెలిపారు. అంతేగాక సదరు రోగికి సకాలంలో వైద్యం మరణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్నాయని, విశాలమైన గదుల్లో పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

అవసరమైన రోగులకు రెమిడెసివిర్ లాంటి మందులను కూడా ఇచ్చి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లు లేవని చేతులు ఎత్తేస్తున్నారన్నారు. కరోనా వైరస్ వచ్చిన మొదటి రోజుల్లో వైరస్ ప్రభావం గురించి సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో జరుగుతున్న ప్రచారం చూసి ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారని కానీ వైద్యశాఖ వెనకాడకుండా నిరంతరంగా సేవలందిస్తుందని మంత్రి గుర్తుచేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ తేలితే వణికిపోతున్నా, తాను గాంధీలో చికిత్స పొందుతున్న తొలి కోవిడ్ పేషెంట్‌ను స్వయంగా కలిసి అతనికి ధైర్యాన్ని కల్పించానని అన్నారు. అంతేగాక గాంధీ ఆసుపత్రి లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సైతం గాంధీని కోవిడ్ సెంటర్ గా మార్చవద్దని వ్యతిరేఖించిన, గాంధీ హాస్పిటల్ చుట్టూ ఉన్న ప్రజల్లో చాలా మంది ఆందోళనకు దిగినా వారికి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఐసియూ రోగులతో నేరుగా మంత్రి ముఖాముఖీ…
కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వస్తే మిగతా వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి ఈటల స్వయంగా కరోనా క్రిటికల్ రోగులను పలకరించారు. గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శనలో భాగంగా అక్కడ ఐసియూలో ఉన్న రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్స్‌రే, రక్తపరీక్షలు, ఇతర టెస్ట్‌ల గురించి తెలుసుకొని వైద్యులకు పలు కీలక సూచనలు చేశారు. డాక్టరు,్ల సిబ్బంది రోజులో ఎన్ని సార్లు వస్తున్నారు? వారు అందిస్తున్న చికిత్సా విధానం ఎలా ఉంది?భోజనం ఎలా ఉంది? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అంటూ ప్రతి రోగిని మంత్రి అడిగి తెసుసుకోవడం అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈసందర్బంగా టిమ్స్‌లో సేవలు బాగున్నాయ్ అని ఓ రోగి ప్రశంసించగా మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ప్రతి రోగికి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని అక్కడి అధికారులకు మంత్రి సూచించారు.

సిబ్బంది పనితీరును పరిశీంచేందుకు ఆర్‌ఎంఒకు బాధ్యతలు..
గచ్చిబౌలి టిమ్స్‌లో సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు మంత్రి ఓ ఆర్‌ఎంఓకి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. రోగులకు అందుతున్న సేవలు, డాక్టర్లు అందిస్తున్న వైద్యం, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనకు తెలియజేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు టిమ్స్‌లో అంతా యువడాక్టర్లు ఉన్న నేపథ్యంలో మరింత ధైర్యంగా పనిచేయాలని వారికి సూచించారు. ఈక్రమంలో టీమ్స్ పై ఫ్లోర్ లలో ఉన్న గదులలో ఉండి 24 గంటలు సేవలందిస్తున్నందుకు వారిని మంత్రి అభినందించారు.

Corona treatment does not exceed Rs 10,000