Home అంతర్జాతీయ వార్తలు 2021లో కరోనా వ్యాక్సిన్ గ్యారంటీ

2021లో కరోనా వ్యాక్సిన్ గ్యారంటీ

Corona vaccine can be expected by early 2021

 

అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఫౌచీ
కోవిడ్‌తో ప్రపంచానికి బోలెడు పాఠాలు
ప్రజారోగ్య అలవాట్లతో మహమ్మారిల విరుగుడు

వాషింగ్టన్ : కోవిడ్ 19 వైరస్ నివారణకు ఇప్పుడు జరుగుతున్న టీకా పరీక్షలపై అంటువ్యాధుల ప్రముఖ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు కీలక దశలలో ఉన్నాయని, ఇవి అన్ని కూడా సజావుగా ఇదే విధంగా జరిగితే వచ్చే ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ఆరంభానికి కానీ కరోనా టీకా అందుబాటులోకి వచ్చే వీలుందని ఆయన తాజాగా తెలిపారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని అంటువ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది అమెరికాలో అత్యున్నత స్థాయి వైద్య సంస్థ. ఈ సంస్థ అమెరికాకు చెందిన మోడెర్నా ఔషధ సంస్థతో కలిసి ఓ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది.

కరోనా వైరస్ ఇప్పటికీ అదుపులోకి రాలేదని డాక్టర్ ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత మంచిదని అన్నారు. వైరస్‌ను ఏ దేశమూ ఏ వర్గం తేలికగా తీసుకోరాదని, ఈ విషయాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారితో అంతా గుర్తించినట్లు అయిందని తెలిపారు. ప్రపంచంలో ఇక ముందు వచ్చే ఇటువంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు పరస్పర సమన్వయం అవసరం అని ఆయన తెలిపారు. మహమ్మారులు వస్తుంటాయని, అయితే సమగ్రమైన సహకారం, సమన్వయంతో , పారదర్శకతతో ఇటువంటి వాటిని ఎదుర్కొవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వచ్చిపడ్డ కరోనాతో మనం అనేక పాఠాలను నేర్చుకున్నామని, సాగిపోతూ ఉండటమే కాదు అనుబంధంగా వచ్చిపడే పర్యవసానాలను బేరీజు వేసుకుని తీరాలని కరోనా ఇప్పుడు తెలియచేసిందన్నారు.

ప్రజలు సరైన ఆరోగ్యపు అలవాట్లతో ఉంటే ఇటువంటి వైరస్‌లు ఏమీ చేయలేవని, లేకపోతే తగు మూల్యం చెల్లించుకోవల్సివస్తుందని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రామాణికంగా తోడ్పాటు అందించాల్సిందేనని, ప్రజారోగ్యం కోసం పాటించే పద్థతుల ద్వారానే వైరస్‌ను అంతం చేయడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై తాను పూర్తి స్థాయిలో ఆశాభావంతో ఉన్నానని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ బాగా సాగుతున్నాయని అన్నారు. కోవిడ్‌తో పోరు అనే ఆన్‌లైన్ సదస్సును ఉద్ధేశించి ఈ నిపుణుడు ప్రసంగించారు. వైరస్ చికిత్సకు అవసరం అయిన మందు కేవలం పరిశోధనలు, అంతకు మించి సృజనాత్మకతతో సాధ్యం అవుతుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు పరిశోధకులు, రిసర్చ్ విద్యార్థులు ఈ కోవిడ్‌పై పోరు ఆన్‌లైన్ సదస్సులో పాల్గొన్నారు. వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యావేత్తలు, సామాజికవేత్తలు కూడా తమ సలహాలు సూచనలు వెలువరించారు. ప్రామాణిక పరీక్షలు వ్యాక్సిన్ సమర్థత కీలకం అని డాక్టర్ ఫౌచీ తెలిపారు. ఇప్పుడు పలు వ్యాక్సిన్‌లు వివిధ దశలలో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, ఇప్పటికే వీటిలో కొన్ని 1/2 స్థాయి దాటాయని, మూడో దశకు చేరుకుంటున్నాయని , ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో వీటి ఫలితాలు స్పష్టం అవుతాయని విశ్లేషించారు.

వ్యాక్సిన్‌ల రూపకల్పన అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది ఈ నెలాఖరు వరకూ పూర్తి స్థాయిలో చెప్పేందుకు వీలేర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు. జనవరి నుంచే పలు రకాలుగా వ్యాక్సిన్ కోసం పరీక్షలు ఆరంభం అయినట్లు వివరించారు. యాంటీబాడీ తటస్థీకరణ ప్రక్రియ కీలకమైనదని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ ఏడాది చివరిలో లేదా 2021 మొదట్లో వ్యాక్సిన్ రాకకు వీలుంటుందని తెలిపారు. అమెరికాలో మాడెర్నా కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తోంది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఇది పూర్తి స్థాయిలో సమగ్రమైన వ్యాక్సిన్‌గా నిర్థారణ అవుతుందని తేల్చిచెప్పారు.

Corona vaccine can be expected by early 2021