Wednesday, April 24, 2024

వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా 25 ప్రాంతాలు !

- Advertisement -
- Advertisement -

హాట్ స్పాట్ల పరిధిపై త్వరలో కేంద్రం మార్గదర్శకాలు
ఏప్రిల్ 10 తేదీ తరువాత మరిన్ని కేసులు పెరిగే అవకాశం ?

 

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మర్కజ్ సదస్సేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన 25 ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా గుర్తించింది. వీటిలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, వరంగల్ అర్బన్, నిజామాబాద్ పట్టణం, కరీంనగర్ పట్టణం తదితర ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా హాట్ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే

వీటి వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటివరకు గుర్తించిన హాట్ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మర్కజ్ వెళ్లొచ్చిన వారికి, వారి సన్నిహితులకు ఏప్రిల్ 10వ తేదీ నాటికి పరీక్షలు పూర్తి కానుండటంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కరోనా కేసులు పెద్దగా నమోదయ్యే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు:

హాట్ స్పాట్ల పరిధిలో వైరస్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ కార్యక్రమం చివరి పేషంట్ దొరికే వరకు కొనసాగుతోంది. హాట్ స్పాట్ల పరిధి ఎంత మేరకు ఉంటుంది, వాటిని పాజిటివ్ కేసులున్న పరిధిలో ఎంత దూరం వరకు మ్యాపింగ్ చేస్తారన్న దానిపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఏప్రిల్ 10వ తేదీ నాటికి మరిన్ని కేసులు:

ఏప్రిల్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలో 600కు పైగా కరోనా కేసులు నమోదు కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి కుటుంబీకులకు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి 10వ తేదీ లోపు పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది సర్కారు అంచనా. ఇప్పటివరకు 21 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి.

 

Corona virus hot spots in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News