Friday, April 19, 2024

పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran Reddy

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపోతే కరోనా లాంటి వైరస్‌లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనుకూలంగా ఏకైక గ్రహం భూమి అని, భూగ్రహాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్నీ కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హానీ వల్లేనని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్‌లు సోకడం ముమ్మరమవుతుందనేది మహమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.

మానవ తప్పిదాల వల్లే వైరస్‌లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పర్యావరణ విధ్వంసం మూలాన గతంలో ఎబోలా, మెర్స్, నిఫా, సార్స్, బర్డ్‌ఫ్లూ లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. చెట్టు అంటే కలప కాదు అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలన్నారు. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సరాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థను గుర్తించాలని తెలిపారు. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి. కొత్తగా మొక్కలను నాటండి అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

 

Corona virus is result of Environmental Negligence
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News