Thursday, April 25, 2024

ఔట్‌బ్రేక్స్‌పై నజర్!

- Advertisement -
- Advertisement -

కొంప ముంచుతున్న గుంపులు
క్లోజ్డ్ ప్రదేశాల్లోనే 75 శాతం వ్యాప్తి
అప్రమత్తంగా లేకుంటే అందరికీ ముప్పేనని నిపుణుల హెచ్చరిక
అన్ని జిల్లాల్లో హై అలెర్ట్

Corona Virus more spread in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకే చోట పది కేసుల కంటే మించి(ఔట్‌బ్రేక్స్) నమోదైన ప్రాంతాలపై వైద్యశాఖ దృష్టిసారించింది. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ కేసులు రికార్డు అయ్యాయి? వైరస్ ప్రభావం ఎలా ఉంది? ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లలో ఎంత మందికి పాజిటివ్ తేలింది. ఆ ఔట్‌బ్రేక్స్‌లో పాజిటివిటి ఎలా ఉంది? అనే అంశాలపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తుంది. ముఖ్యంగా ఇటీవల అత్యధికంగా పాజిటివిటిలు తేలిన పాఠశాలలు, ఫంక్షన్లు, కార్యాలయాల్లో అధికారులు నిఘా పెంచారు. ఈ ఔట్‌బ్రేక్స్ మరిం త విస్తరించకుండా అధికారులు కొవిడ్ కట్టడికి కొత్త ప్రణాళికను అమలు చేస్తున్నారు. పాజిటివ్ తేలిన పేషెంట్లను క్వారంటైన్ చేయ డం, వైద్యం అందించడంతో పాటు ఒక్కో పేషెంట్ ప్రైమరీ, సెకండరీ కంటాక్ట్‌లకూ విస్తృతంగా టెస్టులు చేస్తున్నారు.

అంతేగాక లక్షణాలు లేకపోయినా 14 రోజులు ఐసోలేట్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాల్లోనూ వేగం పెంచాలని వైద్యశాఖ సూచించింది.ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఓలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్డర్లలో యంటీజెన్ పరీక్షలతో పాటు లక్షణాలు ఉండి నెగటివ్ వచ్చిన వారి శాంపిల్‌ను ఆర్‌టిపిసిఆర్ టెస్టుకు పంపాలని సూచించారు. అసింప్టమాటిక్‌తో వైరస్ తేలిన వారికి సకాలంలో హోం ఐసోలేషన్ కిట్స్ ఇచ్చేలా ఆరోగ్యశాఖ అన్ని జిల్లాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్లు పెంచడం, అర్హులైన ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు టీకాపై అవగాహన కల్పిచేందుకు వైద్యశాఖ ప్రత్యేకంగా రూపొందిస్తున్న పాటలను సోషల్ మీడియా, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతం గా వినిపించాలన్నారు. వీటిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆశాలు,ఏఎన్‌ఎంలదేనని డిహెచ్ సూచించారు

సాముహిక గుంపులతోనే వ్యాప్తి పెరుగుతోంది

సెకండ్‌వేవ్‌లో సాముహిక గుంపులతోనే వ్యాప్తి పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఇదే విధానంతో వైరస్ వ్యాప్తి జరిగిందని హెల్త్ ఆఫీసర్లు గుర్తించారు. ముఖ్యంగా విందులు, వినోద కార్యక్రమాలతోనే వ్యాప్తి పెరిగింది. అది కూడా యువత ద్వారానే కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. పబ్‌లు, బార్లు, సినిమాహాళ్లు, ఫంక్షన్ హాళ్లు, తదితర ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం వలనే వైరస్ యువతపై పంజా విసరుతుందని ఓ అధికారి అన్నారు.అంతేగాక వీరి ద్వారా వారి ఇళ్లల్లో ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలపై కరోనా ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.

యువతలోనూ వైరస్ లోడ్

మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలో వ్యాప్తితో పాటు వైరస్ లోడ్ కూడా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలోనూ పెరగడం ఆశ్చర్యంగా ఉంది. ఈక్రమంలోనే గడిచిన వారంలో దేశ వ్యాప్తంగా సంభవించిన మరణాల్లో యంగ్ స్టార్స్ కూడా ఉన్నారని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైనాలోని 320 సిటీలలో వ్యాప్తిపై నాన్‌జింగ్, హాంగ్‌కాంగ్ యూనివర్సిటీలు సంయుక్త అధ్యయనం చేయగా 318 ఔట్ బ్రేక్స్ వచ్చినట్లు గుర్తించారు.

వీటిలో ఏకంగా 254 ఇండోర్ ప్రదేశంలోనే తేలడం గమనార్హం. అంటే ఓపెన్ ప్రదేశాల్లో కంటే ఇండోర్ ప్రదేశాల్లో ఏకంగా నాలుగు రెట్లు వ్యాప్తితో పాటు లోడ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. దీంతో పాటు స్పెయిన్‌లో జరిగిన ఓ అధ్యయనంలోనూ సుమారు 30 శాతం క్లోజ్‌డ్ ప్రదేశాల్లోనే వ్యాప్తి జరిగినట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తి నుంచి సుమారు 2 నుంచి ఐదుగురికి వైరస్ సోకుతుండగా, క్లోజ్‌డ్ రూంలలో సుమారు 30 మందికి సులువుగా వైరస్ సోకుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉప్పెనలా వస్తుంది..జరభద్రం
– డా. కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ విభాగం,
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి

సెకండ్ వేవ్ ఉప్పెన లా వస్తుందని, అప్రమత్తంగా లేకుంటే అందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగం హెడ్ డా కిరణ్ మాదాల అన్నారు. ఇమ్యూనిటీ, వైరస్‌ల మధ్య జరిగే ఈ సమరంలో ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవాలన్నారు.అయితే వైరస్ ఎన్ని మ్యూటేషన్లు చెందినా హైరిస్క్ గ్రూప్‌లకే అత్యధిక ప్రమాదమన్నారు. అంతేగాక కరోనాతో యువత చనిపోవడానికి కారణం కూడా వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటమేన్నారు. కొందరికి తెలియకుండానే వైరస్ తగ్గిపోతుండగా, మరి కొందరిలో అకస్మత్తుగా వైరస్ లోడ్ పెరిగి అత్యవసరవార్డులో చేరాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. గతంలో వ్యాప్తి రేట్ కేవలం 1 శాతం ఉండగా, ప్రస్తుతం 7 నుంచి 10 రెట్లు ఉందన్నారు. దీంతో క్లోజ్‌డ్ రూమ్‌లలో పనిచేసే వారి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News