Thursday, April 25, 2024

ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

భారత్‌లో కేసుల నమోదు తక్కువ
ప్రజలు ఆందోళన చెందవద్దు
2,3 వారాల తర్వాత తగ్గుముఖం
– ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలో కరోనా వైరస్ తట్టుకోవడం కష్టమని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో కొత్త కరోనా కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ రాకేశ్ మిశ్రాలు పేర్కొంటున్నారు.

మరణాల గురించి ఇప్పటికే కొన్ని కంప్యూటర్ ఆధారిత మోడల్స్ వచ్చాయని, వాటి ప్రకారం ఆయా దేశాల్లో కొన్ని లక్షల మంది మరణిస్తారన్న అంచనాలు ఉన్నా అవేవీ భారత్‌కు వర్తించవని వారు స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ప్రజల సాధారణ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు.

రెండు, మూడు వారాల తర్వాత తగ్గుముఖం
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారానికల్లా కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకొని రెండు, మూడు వారాల తర్వాత తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నట్లు వారు వివరించారు. కరోనా వైరస్ ప్రభావం వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటాయని వారు పేర్కొన్నారు. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకు వరకు ఉంటాయని, 25 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటితే కరోనా వైరస్ తట్టుకోలేవని అవి చనిపోతాయని వారు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించగా జనవరి నెలాఖరుకు అక్కడి ప్రభుత్వం రవాణాపై ఆంక్షలు విధించిందని వారు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని వారు అంచనావేశారు.

వైద్యులను సంప్రదించి తగిన చర్యలు చేపట్టాలి
దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టారని, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్,స్కూళ్లు, కాలేజీలు, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారని ఈ చర్యల ఫలితం త్వరలోనే కనిపిస్తుందని వారు తెలిపారు.
మనలాంటి ఉష్ణోగ్రత దేశాల్లో ఈ ప్రమాదం తక్కువని ఉష్ణోగ్రతల పెరుగుదలతో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట పడుతుందని కొందరు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. కాకపోతే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పిస్తే ప్రజలు ఇతరులతో కలవడాన్ని తగ్గించాలని, వైద్యులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

వైరస్ నియంత్రణకు అన్నిరకాల జాగ్రత్తలు
ఐఐసిటిలో వైరస్ నియంత్రణకు అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో రోజురోజుకు నమోదవుతున్న కొత్త కరోనా వైరస్ కేసులు 10 కంటే తక్కువ ఉన్నాయని దీనిని బట్టి చూస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. చల్లటి వాతావరణం ఉన్న దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగాఉంటుందన్నారు.

నాలుగు దశల్లో కరోనా
కరోనా వైరస్ నాలుగు దశల్లో విజృంభిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ కరోనా మహామ్మారి నాలుగు దశల్లో విజృంభిస్తుందని వారు తెలియజేస్తున్నారు. మొదటి దశ – విదేశాల నుంచి స్థానికంగా ప్రవేశించడం, రెండో దశ – వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరి నుంచి సోకడం, మూడో దశ – సమూహావ్యాప్తి, నాలుగో దశ – మహామ్మారిగా మారడమని వారు పేర్కొంటున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతం ఈ వ్యాధి రెండో దశలో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Coronavirus cannot survive if it exceeds 25 degrees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News