Friday, April 26, 2024

జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు

- Advertisement -
- Advertisement -

Coronavirus Effect on Indian GDP

 ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్‌లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి పడిపోవచ్చు
లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా పెరగని డిమాండ్
ప్రజలు ఖర్చు చేయకుండా, డబ్బు ఆదా చేస్తున్నారంటున్న నిపుణులు

ముంబై: కోవిడ్19 వైరస్ మళ్లీ కోరలు చాస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే దశలో సెకండ్ వేవ్(రెండో తరంగం) ముప్పు మరింత భయపెడుతోంది. మొదటి తరంగ కంటే రెండో తరంగం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీజింగ్‌లో కరోనా పడగవిప్పడంతో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అలాగే అమెరికాలోనూ కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇచ్చిన తర్వాత కేసులు పెరగడం పాలకులకు ఆందోళన కల్గిస్తోంది. భారతదేశంలో లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాతే కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనిస్తూనే ఉన్నాం. తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా విజృంభించడంతో మళ్లీ లాడ్‌డౌన్‌ను ప్రకటించింది.

రెండో తరంగం అంటే వైరస్ రెండోసారి వ్యాపించడం, ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి తరంగం వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టాం. కాలక్రమేణా వైరస్‌లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని, రెండో తరంగం వైరస్ మరింతగా విజృంభిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చని, లాక్‌డౌన్ ఎత్తివేయడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి అంశాలు వైరస్ మరింతగా వ్యాప్తికి కారణమవుతాయని అంటున్నారు. దీనివల్ల ఆర్థి క వ్యవస్థలు మరింత పతనం కావొచ్చని వారు అంటున్నారు.

దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం

రెండో తరంగ కోవిడ్ 19 మహమ్మారితో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోనున్నాయని ఒఇసిడి(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) ఇప్పటికే హెచ్చరించింది. కేసుల సంఖ్య పెరిగితే అంతర్జాతీయ జిడిపి 7.6 శాతం క్షీణించనుందని తెలిపింది. అలాగే రెండో తరంగంలో భారత్ పరిస్థితి మరింత దిగజారనుందని, జిడిపి మైనస్ 7.3 శాతానికి పడిపోనుందని పేర్కొంది.

దేశీయ మార్కెట్లలో ఆందోళన

దలాల్ స్ట్రీట్‌లో ఆందోళన మొదలైంది. సోమవారం కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన పెట్టుబడిదారుల్లో కనిపించింది. పెట్టుబడిదారులు పెద్దమొత్తంలో అమ్మడం ప్రారంభించడంతో నిఫ్టీ, సెన్సెక్స్ బాగా క్షీణించాయి. మంగళవారం సూచీలు పుంజుకున్నప్పటికీ ఇది నీటి బుడగేనని నిపుణులు అంటున్నారు. మార్కెట్‌లే రెండో క్షీణత దశ ప్రారంభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ మార్కెట్లలో అలజడి

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రపంచ వృద్ధి రేటు మరింతగా క్షీణించనుందని, రెండో తరంగ ప్రభావం భారీగా ఉంటుందనే ఆందోళనలే. జపాన్, కొరియా, హాంకాంగ్‌కు చెందిన బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం 5 శాతం తగ్గాయి. డౌ ఫ్యూచర్లలో కూడా గణనీయమైన క్షీణత ఉంది.

కేసులు పెరుగుతూనే ఉన్నాయి..

దేశంలో ప్రతిరోజూ కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. అంటే ఇప్పటికే కరోనాదే పైచేయిగా ఉందని, దాని నియంత్రణలో లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారతదేశంలో ఇప్పటివరకు 3.32 లక్షల కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 10,000 చేరువ అవుతోంది.

మాంద్యం అనేక దశలు

రెండో తరంగ కరోనా భయం ప్రతిచోటా వేగంగా వ్యాపిస్తోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కు చెందిన దీపక్ జసాని అంటున్నారు. మాంద్యం అనేక దశలను కలిగి ఉందని అన్నా రు. నిఫ్టీ 7,500 స్థాయికి పడిపోయి వేగంగా కోలుకోవడం చూశామని, ఇప్పుడు రెండవ దశ క్షీణత ప్రారంభమైందని అన్నారు. మార్కెట్ క్షీణించడం ప్రారంభించిందని ఐడిబిఐ క్యాపిటల్ పరిశోధన విభాగాధిపతి ఎకె ప్రభాకర్ చెప్పారు. గత వారం కూడా మార్కెట్ పడిపోయింది. రాబోయే కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయిలకు క్షీణించవచ్చని అన్నారు.

మార్కెట్ దిగజారిపోవచ్చు

సాంకేతికంగా మార్కెట్ కూడా బలహీనంగా ఉంది. గత వారం ప్రారంభంలో పటిష్టమైన ఓపెనింగ్ తర్వాత నిఫ్టీ50 అస్థిరంగా మారింది. చివరికి పతనంతో ముగిసింది. మరో విశ్లేషకుడు మాట్లాడుతూ, నిఫ్టీ 9,700 స్థాయిని చేరితే, అది శుక్రవారం 9,550 కనిష్టానికి పడిపోవచ్చు. నిఫ్టీ 10,050 పైన ట్రేడ్ చేస్తేనే అది నిలబడగలదని అన్నారు.

డిమాండ్ లేదు

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పెట్టుబడిదారులకు మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, దేశంలో లాక్‌డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే డిమాండ్ ఎంతమాత్రం లేదు. ప్రజలు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. అందరూ మాట్లాడుతున్నట్టుగా కొత్తగా డిమాండ్ లేదు. ప్రజలు ఖర్చు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉన్నారని ప్రభాకర్ అన్నారు. ఎందుకంటే వారికి అత్యవసర పరిస్థితులకు డబ్బు అవసరమని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎంఎస్‌ఎంఇ రంగం అత్యంతగా ప్రభావితమైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా కంపెనీలు మూతపడవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News