Friday, April 19, 2024

బీజింగ్ దిగ్బంధం

- Advertisement -
- Advertisement -
Coronavirus Outbreak in Beijing
 విమానాలు, రైళ్లు రద్దు, హోల్‌సేల్ మార్కెట్‌తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు,  నగరం నుంచి రాకపోకలు రద్దు

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వందలాది విమానాలు, రైళ్ల రాకపోకలను బుధవారం రద్దు చేశారు. నగరంలో ఈ మధ్యలోనే కరోనా వైరస్ తీవ్రస్థాయికి చేరుకుంది. దీనిని అరికట్టేందుకు నగరంలో దాదాపు లక్ష మందికి సామూహిక వైరస్ పరీక్షలు నిర్వహించాలని సంకల్పించారు. వైరస్‌ను అరికట్టేందుకు ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థను నిలిపివేశారు. నగరంలో మరో 31 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 137కు చేరుకుంది.

బీజింగ్‌లోని రెండు విమానాశ్రయాల నుంచి 1255 స్వదేశీ విమానాలను రద్దు చేశారు. నిర్ణీత రాకపోకలలో ఈ విధంగా 70 శాతం వరకూ బ్రేక్‌లు పడ్డాయి. బీజింగ్ నుంచి ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలను నడవడం లేదు. రైళ్లు నిలిచిపొయ్యాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎటువంటి తగ్గింపులు లేకుండా మొత్తం డబ్బు చెల్లిస్తారు. బుధవారం నుంచే బీజింగ్‌లో పలు ఆంక్షలు విధించారు. రెస్టారెంట్లు మూసివేశారు. క్యాంపస్‌లకు విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేశారు. స్థానిక హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్‌కు అత్యధిక సంఖ్యలో ప్రజలు వెళ్లిరావడంతో కరోనా నగరంలో తీవ్రస్థాయిలో విజృంభించింది. బీజింగ్‌కు ఇతర ప్రాంతాల వారు ఎవరూ రావద్దని పేర్కొంటూ నగరాన్ని నో గో జోన్‌గా ప్రకటించారు. బీజింగ్‌లో ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉందని అక్కడి ఉన్నతాధికారులు హెచ్చరించారు.

దేశ రాజధానిలో పెద్ద ఎత్తున సామూహిక వైరస్ నిర్థారణ పరీక్షలు చేపట్టారు. నగరంలోని జిన్‌ఫాది హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్ ఇప్పుడు కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారింది. గత కొద్ది రోజుల క్రితమే ఇక్కడ షాపింగ్‌కు వెళ్లిన వారిలో అత్యధికులు వైరస్‌కు గురి అయినట్లు తెలిసింది. దీనితో నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయిలో స్పందించింది. లాక్‌డౌన్ ఎత్తివేత తరువాతి పరిణామాలలో వైరస్ తిరిగి విజృంభించడంతో బీజింగ్‌లో ఆందోళన నెలకొంది, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ అధికారి జిహెజియన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా, వైరస్ ఆగకపోవడంపై అధికారులు కలవరం చెందుతున్నారు.

బీజింగ్ వైశాల్యం, ఇతర ప్రాంతాలతో అనుసంధానం వంటి పరిణామాల నేపధ్యంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే వీలుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. స్థానిక హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం లక్షలాది మంది తరలివస్తుంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి రావడంతో, అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతుండటంతో, ఆహారపు స్టాల్స్ ఉండటంతో వీటన్నింటిని వైరస్ నేపథ్యంలో మూసివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ప్రాంతాల నుంచి ఇతరులు బీజింగ్‌లోకి రావద్దని అధికారులు ఆదేశాలు వెలువరించారు. ప్రస్తుతం నగరంలో రోజువారి టెస్టుల సంఖ్య స్థాయిని లక్ష వరకూ పెంచారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో మాస్క్‌లు ధరించి పరీక్షల కోసం వివిధ ఆసుపత్రుల వద్ద బారులుతీరి ఉన్నారని వార్తా సంస్థలు తెలిపాయి. నగరంలో క్రీడా మైదానాలు, పెద్ద హోటల్స్ మూతపడ్డాయి. దాదాపుగా జనజీవితం స్తంభించే పరిస్థితి ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News