Home అంతర్జాతీయ వార్తలు చైనాలో కరోనా మృతులు 25

చైనాలో కరోనా మృతులు 25

Coronavirus

బీజింగ్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాధి బారినపడి మరణించిన వారిసంఖ్య 25కు చేరింది. వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి 830 మంది గురైనట్టు ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో వూహాన్‌తో సహా ఎనిమిది నగరాల్ని దిగ్బంధం చేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. అన్ని రకాల రవాణా వ్యవస్థల్ని రద్దు చేయడంతో పాటు లూనార్ న్యూ ఇయర్ వేడుకలపై కూడా ఈ ప్రభావం పడింది. చైనాలో 20 ప్రావిన్షియల్ స్థాయి ప్రాంతాల్లో 1,072 మందికి కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నామని జాతీయ ఆరోగ్య కమిషన్ (నేషనల్ హెల్త్ కమిషన్ ఎన్‌హెచ్‌సి) తెలిపింది. గురువారం నాటికి 29 ప్రావిన్షియల్ ప్రాంతాల్లో 830 మందికి ఈ కొత్తరకం న్యుమోనియా వ్యాధి సోకిందని ధ్రువీకరించినట్టు సమాచారం. కరోనా వైరస్ (2019 ఎన్‌కోవి) అనే ఈ నూతన న్యుమోనియా వల్ల 25 మంది మరణించారు.

వారిలో 24 మంది కేవలం హుబెయి ప్రావిన్స్‌లోనే చనిపోగా, మరొకరు నార్త్ హుబెయిలో మృతిచెందారు. హుబెయి ప్రావిన్స్‌లో వూహాన్, హుయాన్‌గ్గంగ్, ఎజ్‌హౌ, చిబి, జియాన్‌టావో, క్వియాన్‌జియాంగ్, ఝిజియాంగ్, లిచువాన్ నగరాల్లో ప్రయాణాల్ని నిషేధించినట్టు స్థానిక ప్రభుత్వాలు నోటీసులు విడుదల చేశాయని హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ శుక్రవారం తెలిపింది. 11 మిలియన్ల జనాభా ఉన్న వూహాన్ లో ఈ వ్యాధి మొట్టమొదట తలెత్తినట్టు భావిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల ప్రయాణ సాధనాల్నీ నిషేధించారు. బీజింగ్ సరిహద్దుల్లోని ఉత్తర హెబెయి ప్రావిన్స్‌లో 80 ఏళ్ల వృద్ధుడు ఈ వ్యాధి సోకి జనవరి 22న చనిపోయారు. బాధితుల్లో గరిష్ఠ సగటు వయసు 73 కాగా, అతి తక్కువ వయసు 48 ఏళ్లని అంచనా వేశారు.

భయాందోళనల్లో భారత్ విద్యార్థులు
వూహాన్‌లోని భారతదేశ విద్యార్థులు కరోనా వ్యాధి విషయంలో ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనను గుర్తించిన వూహాన్ అధికారులు లాక్ డౌన్ చేశారు. అయితే చాలామంది విద్యార్థులు సెలవులకు తమ ఇళ్లను వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నగరంలో 700 మంది భారత విద్యార్థులున్నారు. చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. కాగా, ఈ వ్యాధిని అరికట్టేందుకు 144 మిలియన్ అమెరికన్ డాలర్లను కేటాయించామని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది.

రిపబ్లిక్ డే వేడుకలు రద్దు
కరోనా వైరస్ కారణంగా చైనాలోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకల్ని రద్దు చేసింది. ‘కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని, అలాగే బహిరంగ సమావేశాల్ని రద్దు చేయాలని చైనా అధికారులు నిర్ణయించినందున బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో జనవరి 26 వేడుకల్ని, రిసెప్షన్‌ను రద్దు చేస్తున్నాం’ అని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతకు ముందు గురువారం ఇండియన్ ఎంబసీ చైనా అధికారులకు, బీజింగ్‌లోని రాయబార వర్గానికి రిసెప్షన్ ఏర్పాటు చేసింది. భారత రాయబారి విక్రం మిస్రీ ఆ సమావేశంలో మాట్లాడుతూ ‘2020 మనకు ముఖ్యమైంది. భారత్ చైనాల మధ్య దౌత్య సంబంధాల్లో 70 వ ఏట అడుగుపెట్టాం’ అన్నారు.

Coronavirus Outbreak Kills 25 in China