Saturday, April 20, 2024

నగరంలో కరోనా కేసు..

- Advertisement -
- Advertisement -

coronavirus

 

మన తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నగరంలోకి ప్రవేశించింది. గత నెల రోజుల నుంచి 78మంది కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరగా, వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సికింద్రాబాద్ యువకునికి సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతనికి గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్సలు అందిస్తున్నారు. మహీంద్రహిల్స్‌కు చెందిన యువకుడు(24) బెంగుళూరులోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. గత ఫిబ్రవరి రెండవవారంలో విధినిర్వహణలో భాగంగా దుబాయ్‌కు వెళ్లి మూడోవారంలో తిరిగి బెంగుళూరు చేరుకున్నారు. వచ్చిన నాటినుంచి జ్వరంతో బాధ పడుతుండటంతో మూడు రోజుల క్రితం నగరానికి బయలుదేరి.. సికింద్రాబాద్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిలో వైద్యంకోసం వెళ్లగా అక్కడి వైద్యులు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు చూసి అతని వివరాలు ఆరా తీయడంతో దుబాయ్‌ నుంచి వచ్చినట్లు పేర్కొనడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆ యువకుని కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షలు నిర్వహించిన తరువాత పాజిటివ్ రిపోర్టు రావడంతో ప్రత్యేక వార్డులో చికిత్స అందజేసి, మరోమారు నిర్థారణ చేసుకునేందుకు పుణెకు పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను పంపగా, కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాగా నిర్థారించింది.

తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటన చేశారు. సదరు యువకుడు బెంగుళూరు నుంచి బస్సులో నగరానికి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఐదు రోజుల పాటు గడిపారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహచరుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. యువకుడు ప్రయాణించిన బస్సులో 27మంది ప్రయాణించినట్లు తెలిసింది. అతడు వెళ్లిన ఆసుపత్రికి, కుటుంబ సభ్యులు, బందువులు తదితర ప్రాంతాల్లో దాదాపు 80మందికి కూడా ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడు వెళ్లిన చోట ఉన్న వ్యక్తులందరికి అనుమానిత కేసులుగా చెబుతున్నారు. నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం 40 పడకలు ఇప్పటికే సిద్దం చేశామని, గాంధీ వ్యాధి నిర్దారణ కేంద్రం ఏర్పాటు చేశామని వ్యాధి సోకిన 24గంటల్లో గుర్తించే విధంగా పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. మరోపక్క మంత్రి ఈటెల బెంగుళూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లాడని, హాంకాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడని, వ్యాధి ప్రబలకుండా ముందుస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలావుండగా, హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదు కావడం నగరవాసులను భయాందోళనలకు గురిచేసింది. వ్యాధి సోకిన వ్యక్తి ఎక్కడెక్కడ వెళ్లాడు…ఎవరెవరినీ కలిశాడు అన్న ప్రశ్నలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి వేస్తున్నాయి. మధ్యాహ్నం వరకే కేసు నమోదు అయినట్లు అధికారిక ప్రకటన వెలువడటంతో నగరవాసులు అప్రమత్తమవుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి వ్యాధి ప్రబలకుండా చూడాలని కోరుతున్నారు.

కరోనా లక్షణాలు, జాగ్రత్తలు: ముక్కుకారడం, గొంతునొప్పి, ఒంటినొప్పులు, తుమ్ములు, చాతిలో నొప్పి, తలనొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, పొడిదగ్గు, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, వాంతులు,విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే కరోనాగా అనుమానించాలి. అలాంటి వారు గాంధీ ఆసుపత్రికి వస్తే నమూనాలు సేకరించి చికిత్సఅందించనున్నారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని వైద్యులు సూచిస్తున్నారు. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నంచాలని వెల్లడిస్తున్నారు.దూర ప్రాంతం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలంటున్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు వృద్దులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. చలి ప్రదేశాల్లో తిరగకూడదని, ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండి, ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలని పేర్కొంటున్నారు.

Coronavirus Positive Case Identify in Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News